టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా.. తిరిగి మంగళవారం కటక్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న తొలి టీ20ల్లో ఆడనున్నాడు.
పునరాగమనంలో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ముందు పాండ్యా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యాడు. ఈ టోర్నీలో బరోడా తరపున రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండింటిలోనూ అతడు తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేశాడు.
ఎడమ క్వాడ్రిసెప్స్(తొడ కండరాలు) గాయం నుంచి పాండ్యా పూర్తిగా కోలుకున్నట్లు కన్పిస్తున్నాడు. హార్దిక్ షెడ్యూల్ ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం రెండు మ్యాచ్‌లు సరిపోతాయని నిర్ణయించింది. దీంతో పాండ్యా నేరుగా తొలి మ్యాచ్ జరిగే కటక్‌కు చేరుకున్నాడు.
బారాబతి స్టేడియంలో ఈ ఆల్‌రౌండర్ ఒంటరిగా ట్రైనింగ్ పాల్గోన్నాడు. వార్మప్, స్ట్రెచింగ్, రన్నింగ్ డ్రిల్స్‌తో పాటు, త్రోడౌన్ స్పెషలిస్టులు నువాన్ సెనెవిరత్నే, దయానంద్ గారానితో కలిసి 20 నిమిషాలు బౌలింగ్ చేశాడు.
ప్రాక్టీస్‌కు దూరం!
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి.. సోమవారం జరిగిన భారత్ చివరి ప్రాక్టీస్ సెషన్‌కు హార్దిక్ గైర్హాజరయ్యాడు. దీంతో అతడు మళ్లీ గాయపడ్డాడా? అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది. అయితే హార్దిక్‌కు ఎటువంటి గాయం లేదని, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే శిక్షణకు దూరమయ్యాడని క్రిక్ బజ్ తెలిపింది.
టీ20 ప్రపంచకప్-2026కు సమయం అసన్నమవుతుండడంతో హార్దిక్ లాంటి అద్భుతమైన ఆటగాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే బౌలింగ్ చేసే క్రమంలో పాండ్యా కాస్త ఆసౌకర్యంగా కన్పించడాని, అందుకే ట్రైనింగ్ సెషన్‌కు దూరంగా ఉన్నాడని మరి కొన్ని రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం హార్దిక్ ట్రైనింగ్ స్కిప్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు.
సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్


