శబరిమలకి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా పంబా, సన్నిధానంలలో పనిచేస్తున్న ప్రత్యేక ఆహార భద్రతా బృందాలు ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పంబలో 328 , సన్నిధానంలో 302 తనిఖీలు పూర్తయ్యాయి.
పంబలో లోపాలు గుర్తించిన సంస్థలపై 6 కాంపౌండ్ ఫుడ్ నోటీసులు, 21 సవరణ నోటీసులు జారీ చేశారు. సన్నిధానంలోని 24 సంస్థలకు సవరణ నోటీసులు పంపించారు. మొత్తం ఆరు ఫిర్యాదులు పరిష్కరించబడగా , కాంపౌండ్ ఫుడ్ విధానం ద్వారా నాలుగు సంస్థల నుంచి రూ.30,000 జరిమానా వసూలు చేశారు.
పంబ, సన్నిధానంలోని ఆహార వ్యాపారులకు ఆహార సరఫరా సంబంధిత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రాథమిక నాణ్యత పరీక్షల కోసం పంబాలో 69 ఆహార నమూనాలు, సన్నిధానంలో 62 ఆహార నమూనాలను పరీక్షలకు పంపించారు.
ఆహార భద్రతకు సంబంధించిన టోల్ - ఫ్రీ నంబర్లను అన్ని సంస్థల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కూడా తనిఖీలు కొనసాగుతాయని ఆహార భద్రతా అధికారులు తెలిపారు.
కాగా, సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామి అరవణ పాయసంలో వాడే యాలకుల్లో పురుగు మందు అవశేషాలున్నట్లు తేలడం తోపాటు ఇటీవల అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో సైతం లోపాలున్నట్లు విజిలెన్స్ తేల్చడం తదితర కారణాల రీత్యా శబరిమలలో ఆహారభద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది.
(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..)


