వణికించే చలిలో వెచ్చగా మారడానికి చాలా మంది తేనీటి మీదే ఆధారపడతారు. మిగిలిన కాలాల్లో రోజుకి ఒకటి రెండు సార్లు మించి తాగే అలవాటు లేనివాళ్లు కూడా వింటర్‌లో టీ హంటర్స్‌గా మారిపోతారు. ఎక్కువ సార్లు టీ లేదా కాఫీ తాగడం ప్రారంభిస్తారు.
కానీ ఈ శీతాకాలపు అలవాటు మన శరీరంపై, దాని పనితీరుపై ఊహించని దుష్ప్రభావాలను చూపుతుందని రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ ఇంజురీ సర్జన్ డాక్టర్ దుష్యంత్ చౌహాన్ అంటున్నారు. ఆయన ఇటీవల రాసిన ఓ ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌లో ఈ సీజన్‌లో ఎడాపెడా టీ తాగేయడం ఎంతగా ఆరోగ్యపరమైన అనర్ధాలు తెస్తుందో వివరించారు మితంగా తీసుకోవడం ఎందుకు ముఖ్యమో కూడా తెలియజేశారు.
వేడి పానీయాలు ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న మనం ఊహించని సంబంధాన్ని డాక్టర్ చౌహాన్ హైలైట్ చేశారు. చల్లని వాతావరణంతో కలిపినప్పుడు అధిక కెఫిన్ కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరిస్తున్నారు. ‘‘టీ వేడిగా ఉంటుంది, కానీ అది మీ ఎముకలను ‘చల్లబరుస్తుంది’. అని చెబితే అది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం అంటున్నారాయన.
శీతాకాలంలో చాలా మంది టీ లేదా కాఫీ తీసుకునే డోస్ పెంచడంతో, మోకాళ్ల లోపల మృదులాస్థి మరింత దుర్బలంగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఆయన చెబుతున్న ప్రకారం...‘‘ మోకాళ్ల లోపల మృదులాస్థి రెండు ఎముకల మధ్య ఉండే పొర, ఎండిపోవచ్చు. ఇది కీళ్లలో సున్నితత్వాన్ని మొద్దుబారుస్తుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దినప్పుడు ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది
శీతాకాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అయితే ఈ డీ హైడ్రేషన్ గుర్తించబడదు. చల్లని వాతావరణం నుంచి టీ, కాఫీలు తక్షణ ఓదార్పునిచ్చినప్పటికీ, శరీరానికి సరళత కీళ్ల పనితీరుకు అవసరమైన ద్రవాలను అవి భర్తీ చేయలేవు మనం త్రాగేవి మన ఎముకలు కీళ్లను ప్రభావితం చేస్తాయని చాలా మంది గ్రహించరు .
అయితే టీని ఆస్వాదించవచ్చు, కానీ దానితో పాటు తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. ‘‘హైడ్రేట్‌గా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు, ఇది శీతాకాలంలో సర్వసాధారణం ఆరోగ్యకరమైన కీళ్లను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది". వేడి పానీయాలను ఆస్వాదిస్తున్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన మేలు చేస్తాయి.
ఆర్థోపెడిక్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ పి సి జగదీష్ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, ‘‘మృదులాస్థి అధిక శాతం నీటితో తయారవుతుంది దాని స్థితిస్థాపకత, షాక్ శోషణ సామర్థ్యం మృదులాస్థి ఉపరితలాన్ని నిర్వహించడానికి తగినంత హైడ్రేషన్‌పై ఆధారపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్‌కి గురైనప్పుడు, మృదులాస్థి దాని అంతర్గత నీటి శాతాన్ని కోల్పోతుంది, ఇది కీళ్లను కుషన్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కదలిక సమయంలో ఇబ్బందులను పెంచుతుంది.
అయితే కెఫీన్ స్వయంగా నేరుగా కీళ్లను దెబ్బతీయదని, అది తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుందని తద్వారా తక్కువగా నీటిని తీసుకునే అలవాటున్న వ్యక్తులలో ద్రవ నష్టాన్ని బాగా పెంచడానికి దోహదం చేస్తుందని ఆయన చెబుతున్నారు.. శీతాకాలంలో, నీటి తీసుకోవడం తగ్గిస్తూ దానిని నీటిని టీ లేదా కాఫీతో భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు, అక్కడే నిజమైన ప్రమాదం దాగి ఉంది.
రోజుకు పలు కప్పుల చాయ్ లేదా కాఫీ తాగే వ్యక్తులకు, శరీర బరువు కార్యాచరణ స్థాయిని బట్టి, మొత్తం రోజువారీ ద్రవం తీసుకోవడం 2 నుంచి 2.5 లీటర్ల వరకు ఉండాలనేది సాధారణ సలహా అని డాక్టర్ జగదీష్ చెప్పారు. ‘తగినంత హైడ్రేషన్‌ను నిర్వహించడానికి ప్రతి కెఫిన్ పానీయం ఒక గ్లాసు సాదా నీటితో సమతుల్యం చేసుకోవాలి అని ఆయన సూచిస్తున్నారు.
శీతాకాలపు కీళ్ల నిర్వహణలో హైడ్రేషన్ ఒక భాగం మాత్రమే నంటున్న ఆయన. ‘క్రమం తప్పకుండా కదలిక వ్యాయామాలు, కీళ్ల చుట్టూ కండరాల బలాన్ని నిర్వహించడం, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం శరీరాన్ని వెచ్చగా ఉంచడం అన్నీ మెరుగైన కీళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు తరచుగా నడక, సైక్లింగ్ లేదా నీటి ఆధారిత వ్యాయామాలు వంటి తక్కువ ప్రభావ కార్యకలాపాల ద్వారా ప్రయోజనం పొందుతారని, అలాగే విటమిన్ డి, కాల్షియం ఒమేగా–3 అధికంగా ఉండే ఆహారాలను తగినంతగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..)


