ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..
ఫ్రాన్స్‌కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్‌పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్‌ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్‌ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్‌లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు.
ఎందుకోసం ఈ పర్యాటన అంటే..
అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్‌ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.
14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు.
ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్‌నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు.
ఏకంగా ఎనిమిది నెలలు..
ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్‌కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్‌కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.
లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:
ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట.
(చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?)


