- ఆ ద్వీపం మాదే అంటున్న డ్రాగన్ కంట్రీ
పొరుగు దేశాల భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే జిత్తుల మారి చైనా ఇప్పుడు రష్యాపై కన్నేసిందా? పదేపదే భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చి మ్యాపులు విడుదల చేసే డ్రాగన్ దేశం ఇప్పుడు రష్యా-చైనా సరిహద్దుల్లోని ఓ ద్వీపం పూర్తిగా తమదేనని వాదిస్తోందా? దీనిపై రష్యా నిఘా వర్గాలు అవునని పేర్కొంటూ నివేదికలు అందజేశాయి. అసలు ఆ ద్వీపం కథేంటి? చరిత్ర ఏం చెబుతోంది? శతాబ్దన్నర క్రితం చైనా ఆ ద్వీపాన్ని కోల్పోవడానికి కారణాలేంటి? దీనిపై ఇటీవలి కాలంలో ఇరుదేశాల మధ్య ఒడంబడికలు జరిగాయా? దీనిపై సాక్షి డిజిటల్ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి.
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. ఉస్సూరీ-అమూర్ నదుల సంగమం వద్ద అతిపెద్ద ద్వీపం ఉంది. దీన్ని బోల్‌షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్‌గా పిలుస్తారు. 150 ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ద్వీపంపై చైనా కన్నేసింది. ఈ ద్వీపాన్ని సాంతం ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇటీవల రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్‌బీ 8 పేజీల నివేదికను అందజేసింది. ఆ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొంది. అమెరికా మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’.. అదేవిధంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక దీనిపై కథనాలను ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ఐల్యాండ్ పూర్తిగా చైనాదేనని పేర్కొనడమే కాకుండా.. ఆ దీవి పేరును మార్చింది. అంతేకాదు.. రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టోక్ కూడా తమ భూభాగమేనని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ మ్యాప్ స్పష్టం చేస్తోంది.
చరిత్రలో వెనక్కి వెళ్తే.. బోల్‌షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే..! కానీ, 150 ఏళ్ల క్రితం.. అంటే.. 19వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది. ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. భద్రత దృష్ట్యా ఈ దీవిని రష్యాకు అప్పగించింది. రష్యాకు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఈ దీవి అప్పట్లో అవసరంగా మారింది. 1958లో జరిగిన ఒప్పందం ప్రకారం అమూర్ నదికి ఉత్తరాన ఉన్న విశాలమైన ప్రాంతాన్ని రష్యాకు దఖలుపరిచింది. 1860లో మరో యుద్ధంలో చైనా ఓడిపోవడం.. పాశ్చాత్య దేశాలకు రష్యా సహకరిస్తుందనే భయంతో ‘పెకింగ్ ఒప్పందం’ చేసుకుంది. ఈ రెండు ఒప్పందాల ప్రకారం ఈ దీవితోపాటు.. సువిశాలమైన భూభాగం రష్యా సొంతమైంది. ఆ వెంటనే రష్యా ఇక్కడ వ్లాదివోస్తోక్ నగరాన్ని నిర్మించింది.
ఐదు దశాబ్దాల క్రితం నుంచి చైనా సంస్కరణల బాటలో దూసుకుపోవడం మొదలు పెట్టింది. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా బలోపేతమవుతుండడంతో.. క్రమంగా ఈ ప్రాంతాలపై వివాదాలు రాజుకున్నాయి. రష్యా-చైనా మధ్య 4,200 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సరిహద్దు ఉంది. 60వ దశకంలో కూడా ఈ సరిహద్దు వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1990-2000 మధ్యకాలంలో ఈ వివాదం ముదిరి పాకాన పడే పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో.. పలు ఒప్పందాలు కుదిరాయి. రష్యా ప్రచ్ఛన్న యుద్ధం మొదలు.. ఎప్పటికప్పుడు అవకాశాలను వాడుకున్న డ్రాగన్.. తన కవ్వింపు చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టకపోవడంతో 2008లో రష్యా కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం బోల్‌షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్‌లో కొంత భాగం చైనాకు చెందుతుంది.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంతో రష్యా ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కకుపోతోంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో అతలాకుతలమవుతోంది. దీంతో డ్రాగన్ మరోమారు కుయుక్తులకు తెరతీసింది. ఓ వైపు రష్యాను మిత్రదేశంగా పేర్కొంటునే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను కాదని రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు బోల్‌షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్‌ని హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ చైనా తన చర్యలను మరింత ముమ్మరం చేస్తే.. రష్యా ఎదుర్కోగలదా? ఇరు దేశాల మధ్య యుద్ధమే మొదలైతే.. అది ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా? మిత్రుల మధ్య కీచులాటను చాలా ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఈ వివాదాన్ని అవకాశంగా మలచుకుంటుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పనుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాయండి.


