వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతపై విధించిన అదనపు సుంకాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ అత్యవసర అధికారాన్ని ఉపయోగించి, భారతదేశం నుండి వచ్చే దిగుమతులపై 50 శాతం అదనపు సుంకాన్ని విధించారు. తాజాగా వీటిని రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రతినిధులు డెబోరా రాస్, మార్క్ వీసీ, భారతీయ-అమెరికన్ రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో ఈ తీర్మానం వెలువడింది. ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధం అని, ఇది అమెరికన్ కార్మికులు, వినియోగదారులతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు హానికరం అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానం కేవలం వాణిజ్యపరమైన సమస్యను మాత్రమే కాకుండా, అధ్యక్షుడు తన అత్యవసర అధికారాలను ఏకపక్షంగా వినియోగించడాన్ని ఎత్తిచూపింది.
ఈ సుంకాల ప్రభావం గురించి కాంగ్రెస్ మహిళా సభ్యురాలు డెబోరా రాస్ మాట్లాడుతూ నార్త్ కరోలినా ఆర్థిక వ్యవస్థ భారతదేశం వాణిజ్యం, పెట్టుబడులతో ముడిపడి ఉందని, భారతీయ అమెరికన్ సమాజం ఇక్కడ వేళ్లూనుకుందని అన్నారు. భారతీయ కంపెనీలు ఇక్కడ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, వేలాది ఉద్యోగాలు సృష్టించాయని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యుడు మార్క్ వీసీ తన ప్రసంగంలో భారతదేశాన్ని .. ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించారు. ఈ చట్టవిరుద్ధమైన పన్నులు అమెరికన్ పౌరులపై భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సుంకాలు వ్యతిరేకమైనవని, అమెరికన్ కార్మికులకు హాని కలిగిస్తాయని, వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయని అన్నారు. ఈ సుంకాలను రద్దు చేయడం ద్వారా యూఎస్-భారతదేశం మధ్య ఉన్న కీలకమైన ఆర్థిక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయవచ్చని, తద్వారా మన ఉమ్మడి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ తీర్మానం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నంగా తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ గత ఆగస్టులో భారత్‌పై రెండు విడతలుగా 25 శాతం చొప్పున సుంకాలను విధించారు. భారతదేశం రష్యన్ చమురు కొనుగోలు చేస్తూ, మాస్కో యుద్ధ ప్రయోజనానికి ఆజ్యం పోస్తున్నదని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద సుంకాలను పెంచారు.
ఇది కూడా చదవండి: ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు!


