ఎనిమిది యుద్ధాలను ఆపానని స్వోత్కర్షకు పోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు తీసేలా ప్రపంచంలో రెండుచోట్ల మళ్లీ కుంపట్లు రాజుకున్నాయి. సుంకాలు విధిస్తానంటూ బెదిరించి రెండునెలల క్రితం ఆయన ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్ – కంబోడియాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపి సఖ్యత కుదిర్చారు.
ఆ రెండింటి మధ్యా సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కుదిరిందని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అయిదురోజుల నాడు కంబోడియా మందుపాతరకు తమ సైనికుడు తీవ్రంగా గాయపడటంతో థాయ్ వైమానిక దళం దాడులు ప్రారంభించింది. ఈసారి దాదాపు పదిమంది మరణించగా వేలాదిమంది జనం ప్రాణభయంతో గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది.
కంబోడియా సైన్యం ప్రతీకార దాడులతో థాయ్ గ్రామాల ప్రజలు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అటూ, ఇటూ 5 లక్షలమంది నిరాశ్ర యులయ్యారు. ఆఫ్రికాలో పరస్పరం తలపడుతున్న కాంగో–రువాండాల మధ్య కేవలం వారం క్రితం ట్రంప్ శాంతి ఒప్పందం కుదిర్చారు. కానీ అది కూడా విఫలమైంది. పర్యవ సానంగా కాంగోలోని సరిహద్దు గ్రామాలను 2 లక్షల మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. రువాండా తిరుగుబాటు సంస్థ ఆ గ్రామాల్లోకి ప్రవేశించిందంటున్నారు.
సమస్య మూలమేమిటో తెలుసుకోకుండా, ఇరుపక్షాలూ ఎలాంటి పరిష్కారాన్ని కోరుకుంటున్నాయో గ్రహించకుండా, అందుకు ఏర్పడుతున్న అడ్డంకులేమిటో అర్థం చేసుకోకుండా... ఒక ఫోన్ కాల్‌తో, ఒకటి రెండు బెదిరింపులతో అంతా సమసిపోతుంద నుకుంటే అవి మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. ట్రంప్ దౌత్యం విఫలం కావటానికి కారణం ఇదే.
ఇరుగు పొరుగు దేశాల మధ్య భూభాగం గురించే ప్రధానంగా ఘర్షణలుంటాయి. థాయ్‌లాండ్–కంబోడియాల సమస్య కూడా అదే! రెండు దేశాలకూ 817 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది. ఫ్రాన్స్ దురాక్రమణలో కంబోడియా ఉండగానే వందేళ్ల క్రితం థాయ్‌లాండ్‌తో పేచీ ఏర్పడింది. 1953లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాన్ని పరిష్కరించుకుందామని కంబోడియా ప్రయత్నిస్తోంది.
కానీ రెండువైపులా పుట్టు కొచ్చే జాతీయవాద ధోరణులు అందుకు అడ్డంకిగా మారాయి. 2008లో వివాదాస్పద భూభాగంలోని 11వ శతాబ్దం నాటి హిందూ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వార సత్వ సంపదల జాబితాలో చేర్చినప్పుడు అది తమదేనని కంబోడియా ప్రకటించు కోవటంతో ఘర్షణలు తలెత్తాయి. వాస్తవానికి 1962లోనే ఆ భూభాగం కంబోడియా దేనని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. కానీ అందుకు థాయ్ లాండ్ ససేమిరా అంటున్నది.
మొన్న జూలైలో ఇరువైపులా 50 మంది మరణానికి దారితీసిన ఘర్షణలు రాజు కున్నప్పుడు అప్పటి థాయ్ ప్రధాని పెటోంగ్‌టార్న్ షినవత్రా, కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలు లీక్ అయ్యి ఆమె పదవి పోగొట్టు కున్నారు. తమ సైన్యం కూడా సరిగా వ్యవహరించటం లేదని ఆమె అంగీకరించటం దేశంలో పెద్ద దుమారం లేపింది.
నాలుగు దశాబ్దాలు దేశాన్నేలిన హున్ సేన్ ఇప్పటికీ ప్రస్తుత ప్రధాని, తన కుమారుడు హున్ మానెట్‌ను తెర వెనక ఉండి నడిపిస్తుంటారు. ఆయనతో మాట్లా డితే తప్ప సమస్య పరిష్కారం కాదని షినవత్రా అనుకోవటం కొంప ముంచింది. తాజా వివాదం పర్యవసానంగా కంబోడియా పౌరులను దేశంలోకి రానీయ కుండా థాయ్‌లాండ్ సరిహద్దుల వద్ద అడ్డుకుంటుండగా, థాయ్ సినిమాల ప్రసారం, అక్కడి పండ్లు, కూరగాయలు, గ్యాస్, ఇంధనం రాకుండా కంబోడియా నిలిపేసింది.
థాయ్–కంబోడియా ఘర్షణలైనా, కాంగో–రువాండాల కొట్లాట అయినా ప్రత్యర్థి దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే పరిష్కారమవుతాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ అధికారం కోసం జాతీయవాద ధోరణులు రెచ్చగొట్టడం వల్ల సమస్య లొచ్చిపడుతున్నాయి. థాయ్‌లాండ్‌లో వచ్చే ఫిబ్రవరి 6న ఎన్నికలు జరగబోతున్నాయి.
గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, దేశాన్ని రక్షించేది తామేనని చెప్పటానికి కంబో డియాపై యుద్ధభేరి మోగించటంతో పాటు పాలకపక్షం శుక్రవారం పార్లమెంటును రద్దు చేసింది. మళ్లీ ఇరుపక్షాల మధ్యా రాజీ కుదురుస్తానని ట్రంప్ చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది.


