కార్పొరేట్‌ ‘స్వర్గం’ | Coforge Public Libraries | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ ‘స్వర్గం’

Dec 8 2025 12:01 AM | Updated on Dec 8 2025 4:40 AM

Coforge Public Libraries

‘‘నేను ఎప్పుడూ స్వర్గం అనేది ఒక గ్రంథాలయంలా ఉంటుందని ఊహిస్తాను’’ అన్న అర్జెంటీనా రచయిత జార్జ్‌ లూయీ బోర్హెస్‌ ప్రసిద్ధ వ్యాఖ్యానపు స్ఫూర్తిని స్వీకరిస్తూ, పబ్లిక్‌ లైబ్రరీలకు శ్రీకారం చుట్టింది ‘కోఫోర్జ్‌’ సంస్థ. మూడు దశాబ్దాల క్రితం ‘నిట్‌’ పేరుతో ప్రారంభమై, 2020లో ‘కోఫోర్జ్‌’గా రీబ్రాండ్‌ అయిన ఈ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ తన ‘కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ’లో భాగంగా దేశవ్యాప్తంగా గొలుసుకట్టు గ్రంథాలయాలకు నడుం బిగించింది. 2024 ఫిబ్రవరిలో నోయిడాలో, 2025 జూన్‌లో గురుగ్రామ్‌లో ప్రారంభమైన ఈ గ్రంథాలయపు మూడో శాఖ 15,000 పుస్తకాలతో ఈ అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 దాకా సంవత్సరంలో 365 రోజులూ తెరిచి ఉండటం వీటి ప్రత్యేకత.

ఫిక్షన్, హిస్టరీ, సెల్ఫ్‌ హెల్ప్, రెలిజియన్‌ అండ్‌ స్పిరిచ్యువాలిటీ, సైకాలజీ, ఫిలాసఫీ, సైన్స్, పాలిటిక్స్, మేనేజ్‌మెంట్, రిఫరెన్స్‌ లాంటి విభాగాలతో ప్రధానంగా ఆంగ్ల పుస్తకాలతోపాటు కొద్దిస్థాయిలో హిందీ, తెలుగు విభాగాలను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఉర్దూ విభాగానికి కూడా డిమాండ్‌ వస్తోందని చెబుతున్నారు. కావాల్సిన పుస్తకపు అందుబాటును అక్కడ ఏర్పాటుచేసిన రెండు పెద్ద టచ్‌ స్క్రీన్స్‌ మీద వెతుక్కోవచ్చు. ‘చిల్డ్రెన్స్‌ సెక్షన్‌’ విడిగా ఉండటం చిన్నారులను ఉత్సాహపరుస్తుంది. ది ఇల్లూమినేటెడ్‌ రూమి; డేనియల్స్‌ ఇండియా: వ్యూస్‌ ఫ్రమ్‌ ద ఎయిటీన్త్‌ సెంచరీ; ఎండేంజర్డ్‌ లాంగ్వేజెస్‌ ఇన్‌ ఇండియా; ద లైఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఆఫ్‌ వాన్‌ గో; బిబేక్‌ దేబ్‌రాయ్‌ పది వాల్యూముల మహాభారతం; హాన్‌ కాంగ్‌ ‘ద వైట్‌ బుక్‌’తో పాటు ‘బిగ్‌ ఐడియాస్‌ ఎక్స్‌ప్లెయిన్డ్‌ సిరీస్‌’లో ద మూవీ, ద హిస్టరీ, ది ఎకనామిక్స్, ది ఆర్ట్‌ లాంటివెన్నో అందుబాటులో ఉన్నాయి.

‘యోచన ముఖ్యమైనదే కానీ అసలు ప్రాధాన్యం ఉన్నది ఆచరణకే’ అని సంస్థ సీఈఓ సుధీర్‌ సింగ్‌ నమ్మకం. అందుకే కాబోలు, మనకు అనుభవంలో ఉండే గ్రంథాలయాల ముతకదనానికి భిన్నంగా కార్పొరేట్స్‌కే సాధ్యమయ్యే ఒక సోఫిస్టికేషన్‌ ఇక్కడ కనబడుతుంది. చదవడానికి తగినంత నిశ్శబ్దం, తీర్చిదిద్దినట్టున్న ర్యాకులు, పుస్తకాలను గుట్టలుగా పోయకుండా తగినంత డిస్‌ప్లేకు ఇచ్చిన అవకాశం– బయట వేగంగా పరుగెడుతూ అద్దాల్లోంచి దూరంగా కనబడుతున్న వాహనాల హడావిడి ప్రపంచానికి భిన్నంగా, రెండు అరచేతుల్లో నెమ్మదిగా విప్పారే అక్షరాలు చూపించే లోకాలను ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘విద్య వలన వినయం పుట్టును, వినయం వలన యోగ్యత కలుగును’ అని వేమన; ‘పదవులు, సంపదలు నశించును గాని జ్ఞానమనే సంపద నశించదు’ అంటూ పోతన; ‘పుస్తకాలు చదివే అలవాటులేనివాడికి అక్షర జ్ఞానం లేనివాడిమీద అదనపు అడ్వాంటేజీ ఏమీ ఉండ’దనే మార్క్‌ ట్వెయిన్‌ కవ్వింపు, ‘ఒక పాఠకుడు చనిపోయేలోపు వెయ్యి జీవితాలు జీవిస్తాడు, అదే ఎప్పుడూ చదవనివాడు ఒక్క జీవితమే జీవిస్తాడు’ అనే ఆర్‌.ఆర్‌. మార్టిన్‌ ఉడికింపు బోర్డులు గ్రంథాలయ సందర్శకులను ఇట్టే పుస్తకం పట్టేలా ప్రేరేపిస్తాయి.

కృత్రిమ మేధ సృష్టించిన కవర్‌ పేజీల వాడకం వల్ల ఈ నవంబర్‌లో రెండు పుస్తకాలు ఒక పోటీకి అనర్హత పొందడం సాహితీ ప్రపంచంలో సంచలనానికి కారణమైంది. 65,000 డాలర్ల నగదు బహుమతితో కూడిన న్యూజిలాండ్‌ ప్రతిష్ఠాత్మక ‘ఆక్‌హామ్‌ అవార్డ్‌’ కోసం వచ్చిన ఆబ్లిగేట్‌ కార్నివోర్‌ (స్టెఫానీ జాన్సన్‌ కథల సంపుటి), ఏంజిల్‌ ట్రెయిన్‌(ఎలిజబెత్‌ స్మితర్‌ నాలుగు గొలుసు నవలికలు) పుస్తకాలకు ఏఐ గీసిన ముఖచిత్రాలను వాడినట్టు గుర్తించడంతో నిర్వాహకులు వాటిని పోటీ నుంచి తప్పించారు. సాహిత్య లోకంలోకి కూడా ఏఐ చొచ్చుకువచ్చి, అంతటా డిజిటల్‌ జపం జరుగుతున్న కాలంలో, ప్రత్యేకించి ఒక కార్పొరేట్‌ సంస్థ భౌతిక పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి పూనుకోవడం అభినందనీయం. మున్ముందు ఢిల్లీ, పుణె, బెంగళూరు నగరాలకూ లైబ్రరీని విస్తరించే యోచన జరుగుతోంది. సాంకేతిక పరిణామాలు, వ్యాపార నమూనాలు మారినా ఎప్పటికీ నిలబడి ఉండే దీర్ఘకాలిక సామాజిక మౌలిక వసతులుగా ప్రజా గ్రంథాలయాలను  చూస్తున్నామని ‘కోఫోర్జ్‌’ చెబుతోంది. శుభం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement