జనతంత్రం
జన జీవితాల పెనుహననం యథేచ్ఛగా సాగిపోతున్నది. భద్రం అనుకున్న బతుకులకు సైతం భరోసా లేని పీడకాలం క్రీడిస్తున్నది. కంచే చేను మేస్తున్నది. కాపాడవలసిన వ్యవస్థలే కబళిస్తున్నాయి. విజయవాడలోని భవానీపురం బాధితుల ఆక్రోశం టీవీలో ప్రసారమైంది కనుక లోకం దృష్టికి వచ్చింది. అయినా న్యాయం జరగలేదు. జనారణ్యంలో ఇంకా వారు రోదిస్తూనే ఉన్నారు. అసలు లోకం దృష్టికే రాని సైలెంట్ కిల్లింగ్ ఫీల్డ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో... ఎన్నెన్నో! భవానీ పురంలో 42 మధ్యతరగతి కుటుంబాలు వారి కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని చాలా కాలంగా నివసిస్తున్నారు. కొందరైతే పాతికేళ్లుగా అక్కడే ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతర గతి ప్రజలు ఇల్లు కట్టుకోవడం అంటే తమ జీవిత కాలాన్ని ధార పోయడమే! కోరికలకు పగ్గాలు వేసి, కడుపు కట్టుకొని పైసా పైసా కూడబెడితే దశాబ్దాల తర్వాత ఆ ఇల్లు సొంతమవుతుంది.
అటువంటి 42 కుటుంబాల లైఫ్ టైం అఛీవ్‌మెంట్‌ను తెల్లారే సరికల్లా కూల్చి పడేశారు. ఈ రాక్షసకాండకు రక్షకభటులే రక్షణగా నిలబడ్డారు. ప్రభుత్వ పెద్దల కనుసైగలతోనే పిశాచ గణాలు నర్తించాయనడానికి ఇదే నిదర్శనం. ఇదేమీ రహస్యం కాదు, ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ ‘పై వాడి’కెవడికో ఈ భూమిపై మనసైందట! ఘోరంగా మరులు గొన్నాడట! ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడి ఆజ్ఞాపన మరి! సైరంధ్రి తన సరసకు రావాలని కీచకుడు వేసిన శాసనం. తప్పదు కదా! ఆ పైవాడి ఆదేశాన్ని భృత్యులు శిరసావహించారు. వారి ‘కర్తవ్య పరాయణత’ ఎంతటిదంటే, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నదని బాధితులు నెత్తీ నోరూ బాదుకున్నా అక్కడికి వచ్చిన అధికార ఖాకీ గులాములు ఖాతరు చేయలేదు.
భవానీపురం బాధితులు ఇళ్ళు కట్టుకున్న స్థలం గత మూడు, నాలుగు దశాబ్దాలుగా వివాదంలో ఉన్నదట! కోర్టులో కేసు నడుస్తున్నది. ఈ వివాదం సంగతి బాధితులకు తెలియదు. భూ యజమానికి డబ్బులు చెల్లించి, ఈ 42 మంది ఇంటి స్థలాలు కొనుక్కున్నారు. కార్పొరేషన్‌కు డబ్బులు కట్టారు. అనుమతులు వచ్చాయి. బ్యాంకులు రుణాలిచ్చాయి. కరెంటు, నీటి కనెక్షన్లు వచ్చాయి. బాధితులకు స్థలాలను అమ్మడానికి పూర్వం సుమారు 40 ఏళ్ల కింద భూ యజమాని ఒక హౌసింగ్ సొసైటీకి ఒప్పందం చేశారట! కొంత డబ్బు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ, సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయకుండా కోర్టులో వివాదం నడిపిస్తూ, ప్రస్తుత బాధితులకు ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నాడు. ఈ మధ్యనే కోర్టు తీర్పు సొసైటీకి అను కూలంగా వచ్చింది. ఈ సొసైటీ వారు భూ యజమానికి చెల్లించిన మొత్తం ఒక లక్ష 70 వేల రూపాయలు. ప్రస్తుతం ఆ భూమి విలువ 100 కోట్లని చెబుతున్నారు.
కోర్టు తీర్పును అమలు చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ బాధితులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆర్డర్ కాపీ అందలేదన్న మిషతో 200 మంది పోలీసుల సమక్షంలో గంటల వ్యవధిలోనే 42 గృహాలను నేలమట్టం చేశారు. ఆ బాధితులు ఎవరూ అక్రమంగా ఇళ్లను నిర్మించుకోలేదు. కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని, ఫీజులు చెల్లించి, అన్ని అనుమతులతో బ్యాంకులు ఇచ్చిన రుణాలతో ఇళ్లు నిర్మించుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో బాధితులు వీధిన పడకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. కానీ, పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరింపచేసి కూల్చివేతకు దన్నుగా నిలబడిందంటేనే ఈ కథలో ఇంకో మతలబు ఏదో ఉన్నదని అర్థం. స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్న ముఖ్యమంత్రి పాలనలో 42 సక్రమ నివాసాలను కూల్చివేయడాన్ని ఏమనుకోవాలి? విజయవాడ నగరంలో ఎన్నో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా అక్రమ నిర్మాణాల్లో కొనసాగుతున్నాయి. వాటి జోలికి ఈ ప్రభుత్వం వెళ్లగలదా? వెళ్లలేదు! ఎందుకంటే, సంపన్నులు, వ్యాపారవేత్తల రక్షణ, పేదలూ–మధ్యతరగతి ప్రజల భక్షణ ఈ ప్రభుత్వ పాలసీ కనుక!
విశాఖలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకొనే పదివేల బడ్డీ దుకాణాలను తొలగించారు. వీరిలో చాలామంది మునిసిపల్ కార్పొరేషన్‌కు ఫీజు చెల్లించి, అనుమతి పత్రాలు తీసుకున్నవారే! ఎటువంటి హెచ్చరికలూ, నోటీసులూ లేకుండా ఎకాయెకిన పిడుగుపడ్డట్టుగా పదివేల బడ్డీలను తొలగించారు. పదివేల కుటుంబాల జీవనోపాధిని తెగనరికారు. అంటే 30 నుంచి 40 వేల మంది ప్రజలకు విశాఖ వీధుల్లో శిరచ్ఛేదన చేశారనుకోవాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 వేల మంది కార్మికుల జీవితాలపై ఇప్పటికే కత్తి వేలాడుతున్నది. విశాఖ ఉక్కును ఉద్దేశించి ఇటీవల మాట్లాడిన ఎకసెక్కపు మాటలు గమనిస్తే – దాన్నేం చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌కు వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో కోటి మందికి పైగా ఉన్న రైతులు, కూలీల బాధామయ గాథలు వర్ణనాతీతం. రైతుకు ప్రభుత్వం చేసే పెట్టుబడి, బీమా సాయాల సంగతి దేవుడెరుగు. పండించిన పంటను అమ్మబోతే రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాని దైన్య పరిస్థితులు వెక్కిరించాయి. ఉల్లి రైతులు రోడ్డున పడ్డారు, క్వింటాల్‌కు కనీసం రెండున్నర వేలన్నా వస్తేనే పెట్టిన ఖర్చులు వస్తాయంటున్నారు. ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 1,200 చొప్పున ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. అరటి రైతుల అవస్థలు, ఆక్వా రంగం ఆవేదన, మామిడి రైతు వెతలు, ధాన్యం రైతు కళ్ళల్లోదైన్యం.. వంటి కథనాలు ఇప్పటికే రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం వల్ల, ఎప్పటికప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకొని, ఈ స్థాయిలో ధరలు పతనం కాకుండా కాపాడగలిగింది. ఏడాదిన్నర కాలంలో రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిన సర్కార్, ఐదారు వేల కోట్లను ధరల కంట్రోల్ కోసం వెచ్చించలేదా? వెచ్చించ లేకపోవడం అనేది సమస్య కాదు... వ్యవసాయ రంగం, రైతు క్షేమం బాబు సర్కార్ ప్రాధాన్యతా క్రమంలో లేవు. అందువల్లనే ఈ సంక్షోభం! కోటి కుటుంబాల్లో ఆందోళన. జీవచ్ఛవాలుగా మారుతున్న పేద రైతు కూలీలు!! పేద సమూహాల జీవన విధ్వంసకాండ ఏ ఒక్క రంగానికో, రెండు రంగాలకో పరిమితం కాలేదు. ఇది సర్వవ్యాపితం. ఉపాధి హామీ పథకంలో ఊరట పొందుతున్న వారిలో 18 లక్షల మంది జాబ్ కార్డులను రాష్ట్ర సర్కారు తొలగించింది.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 1,500 చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు మూతపడి 20 వేల మంది ఉపాధి కోల్పోయారని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పేదల సంక్షేమం, ఆ సమూహాల అభివృద్ధి అనే రాజ్యాంగ బాధ్యతలను గాలికొది లేసి, సంపన్న వర్గాలకు వనరులన్నీ ధారపోసే ప్రైవేటీకరణ క్రతువు నిరాటంకంగా సాగిపోతున్నది. పేదలు, మధ్యతరగతి సమూహాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి పిల్లల కోసం జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన విద్యా విప్లవాన్ని కూటమి సర్కార్ నీరుగార్చింది. పట్టణ ధనిక సమూహాల పిల్లలు కొనుగోలు చేయగలిగే నాణ్యమైన విద్య పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా అందజేసే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం ఉద్యమంగా ప్రారంభించింది.
కూటమి సర్కార్ ఆ ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరు గార్చింది. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ఎత్తివేసింది. ఇంగ్లీష్ మీడియం బోధన తొలగించింది. సబ్జెక్టు టీచర్ల విధానాన్ని తొలగించింది. స్కూళ్లను కుదించింది. మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా మార్చింది. కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో అటు కాలేజీలు, ఇటు విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘వసతి దీవెన’ బకాయిలు పేరుకుపోతున్నాయి. ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మూడున్నర లక్షలు తగ్గింది. వారిలో కొందరిని ప్రైవేట్ స్కూళ్లకు పంపించి ఉండవచ్చు. అత్యధికులు డ్రాప్ అవుట్లుగా మిగిలి ఉంటారు.
వాస్తవాలు ఇట్లా ఉంటే, జగన్ పాలనలో విద్యారంగంలో విధ్వంసం జరిగిందనీ, తాము ఇప్పుడు చక్కదిద్దుతున్నామనీ కూటమి పెద్దలు చెప్పుకుంటున్నారు. జగన్ చేసిన విధ్వంసం ఏమిటో, తాము చేస్తున్న ఉద్ధరణ ఏమిటో మాత్రం ససేమిరా చెప్పరు. వ్యాఖ్యానాలు చేయడమే తప్ప వివరాలు, లెక్కలు చెప్పడం వారి నిఘంటువులోనే లేదు. ‘పేరెంట్–టీచర్’ మీటింగ్‌లనేవి జగన్ హయాంలో సలక్షణంగా జరిగాయి. ఇంత హడావిడి లేదు. తల్లితండ్రులకు బదులు వైసీపీ కార్యకర్తలు వచ్చి కుర్చీల్లో కూర్చోలేదు. ఇప్పుడు ఈ తరహా మీటింగ్‌ను తామే కనిపెట్టినట్లు కూటమి చేసుకుంటున్న ప్రచారం వెగటు పుట్టించే విధంగా ఉన్నది. కాకపోతే ‘పేరెంట్–టీచర్ మీటింగ్’లను రాజకీయ వేదికలుగా మార్చుకోవడం మాత్రం ఇప్పుడే జరుగుతున్నది. ‘మోడల్ అసెంబ్లీ’లను ప్రతి ఏటా అన్ని పెద్ద స్కూళ్లలో కళాశాలలో నిర్వహించే అలవాటు అనాదిగా ఉన్నది. బహుశా చంద్రబాబు పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఉన్నది.
వైద్యరంగం గురించి మాట్లాడకపోవడమే మేలు. జగన్ ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగులో ప్రైవేటీకరించడంతోపాటు, ప్రాంతీయ వైద్య సేవలను కూడా ప్రైవేట్ మార్గం పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్ మొత్తం కార్యక్రమాల్లో ఒక క్రమం తప్పని విధానం మాత్రం కనిపిస్తున్నది. అదే... కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధానం! పెత్తందారీ అనుకూల పాలన. పేదల కోసం ఆయన చేసిన మహత్తర ఆలోచన ‘పీ–4’. ఒక్కో ధనవంతుడి దగ్గర పదిమంది పేదలని తాకట్టు పెట్టడం, అందుకోసం వనరులన్నీ ధనవంతులకు కట్టబెట్టడం. ఈ దుర్మార్గ విధానాన్ని కప్పిపుచ్చడానికి కోటలు దాటే మాటలతో అభివృద్ధి కబుర్లను అర్థం కాని భాషలో చెప్పడం. పరిగెత్తు కొస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి చంద్రబాబు పోచికోలు ఉపన్యాసాలు చెప్పడం!
చంద్రబాబును ఓ సూపర్ మ్యాన్‌గా, లోకేశ్ బాబును చిన్న సూపర్ మ్యాన్‌గా ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ఉండనే ఉన్నది. ఇప్పుడు ఈ బాధ్యతలను కూటమి అధికారిక ప్రతినిధులకు కూడా పంచినట్టున్నారు. ఓ జాతీయ మీడియాలో అధికార ప్రతినిధి ఒకరు చిన్న సూపర్ మ్యాన్‌ను ఆకాశానికి ఎత్తబోయి, బొక్క బోర్లా పడ్డారు. ఇండిగో విమానాల నిలిపివేత అంశంపై రిపబ్లిక్ టీవీలో జరిగిన చర్చలో – విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ఆర్ణబ్ గోస్వామి ప్రశ్నించారు.
అందుకు టీడీపీ ప్రతినిధి బదులిస్తూ లోకేశ్ కూడా ఈ సమస్యను సమీక్షిస్తున్నారని చెప్పాడు. అసలు లోకేశ్ ఎవరు? ఆయనకేం పని?? అంటూ ఆర్ణబ్ గోస్వామి నిలదీయడంతో టీడీపీ ప్రతినిధి నీళ్లు నమలాల్సి వచ్చింది. పాపం ఆ ప్రతినిధి ఏం చేస్తాడు? చిన్నబాబు–పెద్దబాబుల భజన బాధ్యత ఆయనపై కూడా పార్టీ మోపినట్టుంది. మీడియా సామ్రాజ్యంలో అత్యధిక భాగాన్ని టీడీపీ కూటమి ఆక్రమించు కుంటున్న నేపథ్యంలో, అవి బాబుల భజనలకే ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ‘క్రెడిట్ చోరీ’ కితాబులకు దొంగ సాక్ష్యాలు చెప్పవచ్చు. కానీ, కూలిపోతున్న కోట్లాది జీవితాలను, దిగజారుతున్న జీవన ప్రమాణాలను దాచడం సాధ్యం కాదు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నాణ్యమైన జీవితాన్ని నానాటికీ కోల్పోతున్నారు. జీవచ్ఛవాల సంఖ్య రోజురోజుకూ పెరుగు తున్నది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


