సంక్లిష్ట సమయాల్లో సైతం నమ్మకమైన నేస్తంగా నిరూపించుకున్న రష్యాతో అనుబంధం మరింత దృఢతరమైంది. గురువారం భారత పర్యటన కోసం వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జరిపిన శిఖరాగ్ర సమావేశమైనా, ఆపై ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలైనా ఈ సంగతిని నిరూపిస్తున్నాయి. వర్తమాన ప్రపంచ స్థితిగతులు సజావుగా ఏమీ లేవు. ఉక్రెయిన్‌తో రష్యా నాలుగేళ్లుగా యుద్ధంలో తలమునకలైంది.
గడియకో మాట మాట్లాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంగతెలా ఉన్నా యూరప్ దేశాలు ఈ విషయంలో రష్యాపై కత్తులు నూరుతున్నాయి. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించటానికి మధ్యమధ్యలో ట్రంప్ ప్రయత్నిస్తున్నా యూరప్ దేశాలు... ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఎట్లాగైనా రష్యా మెడలు వంచాలని చూస్తున్నాయి. పుతిన్ భారత పర్యటనకు ముందు ‘మా భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి’ అంటూ భారత్‌లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) రాయబారి హెర్వ్ డెల్ఫిన్ మనకు చెప్పటం గమనించదగ్గది.
రష్యా చమురు కొంటున్నందకు ఇప్పటికే అమెరికా ఆగ్రహించి, మనపై 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఇతరత్రా వాణిజ్య ఒప్పందాలకు బ్రేక్ వేయాలంటూ ఒత్తిళ్లు తెస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా నాలుగేళ్ల నుంచి రష్యాకు పాశ్చాత్య బ్యాంకింగ్ వ్యవస్థతో లింక్ తెగిపోయింది. వాణిజ్య సంబంధాలూ అంతే. ఇదే సమయంలో మనతో రష్యా ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయి. మన దేశం నిరుడు 5,600 కోట్ల డాలర్ల విలువైన ముడిచమురు కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి పర్యవసానంగా ఇటీవల ఆ కొనుగోళ్లు తగ్గినా ఇరు దేశాల వార్షిక వాణిజ్యం 6,870 కోట్ల డాలర్లకు చేరుకుంది. దీన్ని 10,000 కోట్ల డాలర్లకు చేర్చాలని ఇరుదేశాల లక్ష్యం. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పుతిన్ ఒక దేశంలో అధికారిక పర్యటనకు రావటం ఇదే తొలిసారి.
ఈసారి సైనిక సామగ్రి, ఆయుధాలకు సంబంధించికాక ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలపైనే ఇరు దేశాలూ కేంద్రీకరించాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో సంతకాలైన ఆర్థిక సహకార ఒప్పందం 2030 వరకూ షిప్పింగ్, కెమికల్స్, ఆరోగ్యం వగైరారంగాల్లో పరస్పర సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా కలిసి పనిచేయాలని కూడా ఇరు దేశాలూ నిర్ణయించాయి. అయిదో తరం సుఖోయ్ ఎస్‌యూ–57 యుద్ధ విమానాల అమ్మకానికి రష్యా సుముఖత చూపడమేకాక, వాటిని భారత్‌లోనే ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే రష్యా రియాక్టర్లతో రెండో అణువిద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పే అవకాశాన్ని పరిశీలించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి.
ఈ సమావేశం కోసం మోదీ, పుతిన్‌లిద్దరూ ఈ ఏడాది అయిదుసార్లు ఫోన్లలో సంభాషించుకోవటంతోపాటు చైనాలోని తియాన్జిన్‌లో మొన్న సెప్టెంబర్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్రం సందర్భంగా కలుసుకున్నారు. ఈ పర్యటనలో కుదరబోయే ఒప్పందాలపైనా, ప్రస్తావనకు రాబోయే భిన్న అంశాలపైనా గత ఆర్నెల్లుగా రెండు దేశాలమధ్యా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. మొన్న ఆగస్టులో విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాను సందర్శించి పుతిన్‌ను కలిశారు. అంత క్రితం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. ఇవన్నీ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావటానికి దోహద పడ్డాయి.
ఎవరితోనైనా తాము కుదుర్చుకునే ద్వైపాక్షిక ఒప్పందాలు మూడో దేశానికి వ్యతిరేకం కాదని మన దేశం మొదటినుంచీ చెబుతోంది. రష్యాతో సంబంధాల విషయంలో అమెరికా, యూరప్ దేశాల ఒత్తిళ్లు పనిచేయబోవని ఈ శిఖరాగ్ర సమావేశం నిరూపించింది. చైనా–రష్యా సంబంధాలు ప్రస్తుతానికి బాగున్నా, ఆసియాలో తన ప్రయోజనాలను విడనాడుకోవటానికి రష్యా సిద్ధంగా లేదు. అలాగే అమెరికా–చైనా సన్నిహితమవుతున్న తీరును కూడా రష్యా గమనించకపోలేదు. ఎవరెవరితో కలుస్తారో, ఏ కూటములు ఎన్నాళ్లు మనుగడలో ఉంటాయో తెలియని అయోమయ స్థితిలో స్వతంత్ర విదేశాంగ విధానమే సర్వవిధాలా మేలైనదని మన దేశం చాటిచెప్పింది.


