మొన్నటివరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ తాపత్రయపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధవీరుడి అవతారమెత్తారు. మాదకద్రవ్యాల అడ్డాగా మారి అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని ఆరోపిస్తూ దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై కత్తులు నూరుతున్నారు. అక్కడ ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రకటించి, దాన్ని నిషేధించారు. అదంతా అబద్ధమని వెనిజులా చెబుతోంది. మొన్న ఆగస్టు నుంచి కరీబియన్ దీవులకు 10,000 మంది సైనికులనూ, అతి పెద్ద విమాన వాహక నౌకనూ, క్షిపణులు వగైరా ఆయుధ సామగ్రినీ తరలించిన అమెరికా ఆ మరుసటి నెల 2న వెనిజులా నుంచి పోతున్న పడవలపై దాడి చేసి 11 మందిని హతమార్చింది.
ఇవి మాదకద్రవ్యాలు తరలిస్తున్నాయని ఆరోపించింది. ఆ సాకుతోనే 22 దాడుల్లో 83 మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఏ ఉదంతానికీ అమెరికా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ఈమధ్య వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ట్రంప్ ఫోన్ చేసి అధికారం వదిలిపెట్టి దేశం వదిలి పారిపోవాలని హెచ్చరించారు. వెనిజులా గగనతలాన్ని మూసివేసినట్టు ప్రకటించారు.
తాజాగా బయటపడిన వీడియో ట్రంప్ ప్రభుత్వ హంతక మనస్తత్వాన్ని తెలియ జేస్తోంది. దాడిలో పడవలోని 9 మంది ప్రయాణికులు చనిపోగా, ఇద్దరు బతికి బయట పడ్డారు. వెనువెంటనే మళ్లీ దాడిచేసి ఆ ఇద్దర్నీ కూడా చంపేశారు. మొదట్లో ఆ దాడి గురించి అతిశయోక్తులు చెప్పిన ట్రంప్, వీడియో బయటపడగానే స్వరం మార్చారు. పడవలోని వారందరినీ చంపేయమని రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించటం వల్లే ఇలా చేశామని సైనికాధికారులు చెబుతుండగా, అలా చెప్పలేదని హెగ్సెత్ అంటున్నారు. అది తప్పేనన్నట్టు ట్రంప్ సంజాయిషీ ఇస్తున్నారు. ఈ ఉదంతంపై రిపబ్లికన్లలోనే విభేదాలు బయల్దేరాయి. ప్రతినిధుల సభ అనుమతి లేకుండా దండయాత్రకు అసలు ఎలా దిగుతారంటూ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు మొదలుకాబోతోంది.
సంక్షోభాన్ని సృష్టించటం, ఒక సార్వభౌమాధికార దేశం ప్రమాదకరంగా పరిణమించిందని ఆరోపించటం, ఆ సాకుతో దురాక్రమణకు ప్రయత్నించటం అమెరికాకు అలవాటు. వేరే దేశం గగనతలాన్ని మూసేసినట్టు చెప్పటం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం. సమస్యలుంటే, సాక్ష్యాధారాలుంటే దౌత్యపరంగా పరిష్కరించు కోవటానికి ప్రయత్నించాలి. నిజానికి వెనిజులాపై అమెరికా కడుపుమంట ఈనాటిది కాదు. అక్కడి భూగర్భంలో చమురు, సహజవాయు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వగైరాలున్నాయి.
బహుళజాతి సంస్థల ద్వారా వాటిని కైంకర్యం చేస్తూ వచ్చిన అమెరి కాకు 1999లో తొలిసారి హ్యూగో చావెజ్ రూపంలో ఆటంకం ఎదురైంది. ఆయన అధికారంలోకొచ్చిన వెంటనే దాన్నంతటినీ ఆపేశారు. అప్పటినుంచి ఏదో వంకన వెనిజులాను హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. చావెజ్ అనారోగ్యంతో మరణించాక 2013లో అధికారంలోకొచ్చిన మదురోను ఇబ్బందిపెట్టని రోజంటూ లేదు. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్, వెనిజులా నుంచి పారిపోయివచ్చిన జువాన్ గైదోను దేశాధ్యక్షుడిగా ప్రకటించి భంగపడ్డారు. అక్కడ జరిగిన ఎన్నికలు అప్రజాస్వామికమంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ గైదో ఏమయ్యాడో తెలియదు. ఈసారి మాదక ద్రవ్యాల సాకుతో కత్తిగట్టారు.
ట్రంప్‌కు మాదకద్రవ్యాలు అరికట్టే ఉద్దేశం ఉందా? ఉంటే కొకైన్ తరలింపు కేసులో నిరుడు అమెరికా కోర్టు 45 ఏళ్ల శిక్ష విధించిన హోండురస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండోకు క్షమాభిక్ష పెడతామని గతవారం ట్రంప్ ఎలా చెప్పగలిగారు? వెనిజులాపై సైనిక చర్యకు 70 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకమని సీబీఎస్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యం పేరిట ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్లయిందని, వాటి జోలికి పోవద్దని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. నిజానికి అలాంటి హామీతోనే ట్రంప్ అధికారంలోకొచ్చారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదల చేస్తానంటూనే మరో యుద్ధానికి అంకురార్పణ చేస్తున్న ట్రంప్ పోకడ ప్రమాదకరం. అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఇది పెను ముప్పు. దీన్ని తక్షణం కట్టిపెట్టాలి.


