ఢిల్లీ: భారత్-రష్యాలమధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వివిద రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సహకారం వలస విధానంపై ఒప్పందంతో పాటు, ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య రంగాలపై ఒప్పందం, కెమికల్ ఫెర్టిలైజర్స్ సరఫరాపై ఇరు దేశాల మధ్య ఒప్పందం, సముద్ర ఆహార ఉత్పత్తులపైనా ఒప్పందాలు జరిగాయి.
దీనిలో భాగంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షడు పుతిన్‌ల సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలపై కీలక సంతకాలు జరిగాయన్నారు. ‘పుతిన్ నేతృత్వంలో భారత్-రష్యాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. గత ఎనిమిది దశాబ్దాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం.భారత్-రష్యాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుంది. రష్యా ఎప్పట్నుంచో మనకు మిత్రదేశం. 2030 వరకూ ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు శిఖరాగ్రానికి చేరతాయి’ అని స్పష్టం చేశారు.
అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. ‘ నాకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. భారత ఆతిథ్యం సంతోషాన్ని ఇచ్చింది. భారత్-రష్యాల మధ్య సహృద్భావ వాతావరణం. నేను మోదీతో అంతర్జాతీయ అంశాలను షేర్ చేసుకున్నా. ఆర్థిక, భద్రత తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్, రష్యాల మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం. మేకిన్ ఇండియాకు మా మద్యతు ఉంటుంది. భారత్‌కు చముర సరఫరాను కొనసాగిస్తాం’ అని తేల్చి చెప్పారు పుతిన్.


