పెళ్లిలో రసగుల్లా గోల : పిడిగుద్దులతో మల్లయుద్ధమే వైరల్‌ వీడియో | Bihar Wedding chaotic scene Chairs Kicks Punches Fly After Rasgulla Shortage | Sakshi
Sakshi News home page

పెళ్లిలో రసగుల్లా గోల : పిడిగుద్దులతో మల్లయుద్ధమే వైరల్‌ వీడియో

Dec 5 2025 3:03 PM | Updated on Dec 5 2025 3:50 PM

Bihar Wedding chaotic scene Chairs Kicks Punches Fly After Rasgulla Shortage

బిహార్‌లోని బోధ్ గయలో జరిగిన  వింత ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.  పెళ్లి విందులో వడ్డించిన  స్వీట్‌ సరిపోకపోవడం దుమారం రేగింది.  వధూవరుల కుటుంబ సభ్యుల  వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద యుద్ధమే జరిగింది. ఈ మొత్తం సంఘటన సీసీటీవీలో రికార్డైంది. అసలు ఏం జరిగిందంటే..

ఒక వివాహం సందర్బంగా జరిగిన పెళ్లి విందులో రసగుల్లా కొరత వచ్చింది. దీంతో వధువు, వరుడి కుటుంబాలు ఘర్షణకు దిగడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలూ విచక్షణ మర్చిపోయి కొట్టుకున్నారు. నెట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. ఈ దృశ్యాలు  వివాహం జరుగుతున్న హోటల్‌లోని సీసీటీవీలో రికార్డైనాయి. 

 ఈ సంఘటన నవంబర్ 29న జరిగింది. పెళ్లి వేడుక కోసం వధూవరుల కుటుంబాలు ఒకే హోటల్‌లో బస చేశాయి.  ప్రీవెడ్డింగ్‌  వేడుకల  తరువాత పెళ్లి మంటపానికి వెడుతుండగా వివాదం మొదలైంది. అది తీవ్రమై కొట్టుకునే దాకా వచ్చింది.  రసగుల్లా కొరత కారణంగా జరిగిన గొడవ కారణంగా వివాహం రద్దయింది. తరువాత వధువు కుటుంబం వరుడి తరపు వారిపై వరకట్న కేసు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా, ఒక గ్రూపు గొడవకు దిగి, కుర్చీలు, ప్లేట్లతో దాడికి దిగారు. దీంతో రెండు వైపుల నుండి చాలా మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ బుధవారం రసగుల్లా లేకపోవడం వల్ల గొడవ జరిగిందని ధృవీకరించారు. వరుడి కుటుంబం వివాహాన్ని కొనసాగించడానికి అంగీకరించగా, వధువు కుటుంబం ముందుకు సాగకూడదని నిర్ణయించుకుంది.

వరుడి తల్లి మున్నీ దేవి, గొడవ జరుగుతుండగా, వధువు కుటుంబం తాను బహుమతిగా తెచ్చిన ఆభరణాలను తీసుకుందని ఆరోపించింది. హోటల్ బుకింగ్ కూడా తామే చేశామని వరుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. వివాహం జరగాలని వధువు కుటుంబంతో  సర్ది చెప్పాలని ప్రయత్నించాం. కానీ  ఫలించలేదని వరుడి బంధువు సుశీల్ కుమార్  తెలిపారు. మొత్తానికి సర్దుకుపోవాల్సిన స్వల్ప విషయానికి ఒక శుభకార్యం ఆగిపోయింది. పంతాలు, పట్టింపులతో ఇరువైపు అవమానాలు,  ఆర్థిక నష్టం తప్ప మరేమీ మిగల్లేదు. 

ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement