హీరోయిన్ సమంత రూతు ప్రభు, రాజ్ నిడుమోరు తమ పెళ్లివార్తను ప్రకటించిన ఎన్నో ఊహాగానాలకు చెక్ పెట్టారు. రాజ్ నిడిమోరుతో తన వివాహ చిత్రాలను అప్‌లోడ్ చేయడంతో అటు ఫ్యాన్స్, ఇటు నెటిజన్లు సంబరాల్లో మునిగితేలారు.
తమిళనాడులోని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సాంప్రదాయ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. డిసెంబర్ 1న, కేవలం 30 మంది అతిథులతో వివాహం చేసుకున్నారు. సమంత అందమైన ఎర్రచీర, చోకర్ నెక్లెస్, భారీ చెవిపోగులు సంప్రదాయ నగలతో ఆకట్టుకున్నారు. రాజ్ కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా సమంత ధరించిన మొగల్ శైలి పోట్రెయిట్ కట్ డైమండ్ రింగ్ విశేష ప్రాధాన్యంగా నిలిచింది. పోట్రెయిట్ కట్‌ను బలం, తేజస్సు, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్యాషన్ డిజైనర్ , సమంత సన్నిహితురాలు శిల్పా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాహం నుండి మరిన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలో అరటి ఆకులో వడ్డించిన థాలీ ఏంటి అనేది హాట్ టాపిక్‌గా నిలిచింది.
అరటి ఆకులో కమ్మటి భోజనం
సమంత & రాజ్ వివాహానికి సాత్విక విందు మరో ప్రత్యేక ఆకర్షణ. అరటి ఆకుపై అన్నం, పప్పు,కూరలతో కలర్‌పుల్‌గా కనిపించిన సాంప్రదాయ దక్షిణ భారత విందు ఇది. ఇషా ఫౌండేషన్ విలువలు, నమ్మకాలకు ప్రతిబింబిస్తూ సాత్విక నియమాలను ఖచ్చితంగా పాటించారు. తమిళనాడు రుచులు మరియు సంస్కృతికి అనుగుణంగా అన్నం, పప్పు క్యారెట్ , బీన్స్ పల్యా, రాగి బాల్స్, దోసకాయ సలాడ్, ఊదా రంగు స్వీట్ రైస్ ఉన్నాయి. ఇషా యోగా సెంటర్‌లోని ది పెప్పర్ వైన్ ఈటరీ అనే కేఫ్ అందించిన ఎలాంటి మసాలా దినుసులు లేకుండా ఈ ఫుడ్‌ను వడ్డించారు.
ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?


