విదేశీ అతిథులు ప్రతిపక్ష నేతను కలిస్తే భయమెందుకు:రాహుల్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగిపోయిందని, అందుకే విదేశాల అధినేతలు, ప్రముఖులు మన దేశానికి వచి్చనప్పుడు ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడొద్దంటూ వేడుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విదేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిని కలవడం ఒక సంప్రదాయమని గుర్తుచేశారు.
ప్రధాని మోదీ గానీ, విదేశాంగ శాఖ గానీ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో విదేశీ అతిథులు ప్రతిపక్ష నాయకుడిని కలిసి మాట్లాడే సంప్రదాయం చక్కగా కొనసాగిందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మారిపోయిందని ఆక్షేపించారు.


