న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా గురువారం రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై-అలర్ట్‌లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్)బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్‌లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ-స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.
పుతిన్ రాక మొదలుకొని వెళ్లే వరకూ ఆయన కదలికలన్నింటినీ బహుళ భద్రతా ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు అమలులో ఉండగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేయనున్నారు. రాజధాని నగరంలో మోదీ-పుతిన్ చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 23వ భారత్-రష్యా వార్షిక వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సమావేశం కేవలం దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహపడనుంది. ఈ అధికారిక చర్చలకు ముందు, ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్‌కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పారిశ్రామిక సహకారం, వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. శాంతియుత అంతరిక్ష అన్వేషణ, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త 'ఆశాజనక ప్రాజెక్టులు' కూడా చర్చల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ, ఈ పర్యటన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది.
ఇది కూడా చదవండి: స్మార్ట్‌ఫోన్ ముట్టని పుతిన్.. షాకిచ్చే కారణం


