దేశంలోనే తొలిసారి విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. కోస్తా కర్ణాటకలో మొన్న ఏప్రిల్‌లో మతపరమైన హత్య చోటు చేసుకున్నాక జరిగిన పరిణామాల పరంపర తర్వాత ఇలాంటి చట్టం తెస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూనే దానికి సహేతుకమైన పరిమితులు విధించింది.
సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర రకాల చర్యల్ని అరికట్టడానికి గతంలో ఐపీసీలో, ఇప్పుడు బీఎన్‌ఎస్‌లో నిబంధనలున్నాయి. కానీ దురదృష్టమేమంటే అవి అసమ్మతిని అణచడానికి పనికొచ్చినట్టు విద్వేష ప్రసంగాలను అదుపు చేయటానికి తోడ్పడటం లేదు. కనుక ప్రత్యేక చట్టం తీసుకు రావటం హర్షించదగ్గదే. ‘విద్వేషం ప్రతి ఒక్కరినీ ప్రమాదంలోకి నెడుతుంది.
అందుకే దానిపై పోరాడటం అందరి బాధ్యతా కావాలి’ అన్నారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్. నిజానికి విద్వేషపూరిత ప్రసంగాలు మనుషుల ఉసురు తీస్తాయని, మత, కుల ఘర్షణలకు కారణ మవుతాయని పదిపదిహేనేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇలాంటి ప్రసంగాలూ, సందేశాలూ సమాజ మనుగడకు పెను సవాలుగా మారాయి.
ఎక్కడో కాదు... కర్ణాటకలోనే విద్వేషపూరిత ప్రసంగాలు, సందే శాల ప్రభావంతో దుండగులు 2015లో ప్రముఖ రచయిత, హేతువాది, కన్నడ యూని వర్సిటీ మాజీ వైస్‌చాన్సలర్ ఎంఎం కల్బుర్గిని, 2017లో ప్రముఖ సంపాదకురాలు, రచయిత్రి గౌరీ లంకేష్‌ను పొట్టనబెట్టుకున్నారు.
భావప్రకటనాస్వేచ్ఛ ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం, తమకు నచ్చని అభిప్రాయాలున్న వారిపై ఉసిగొల్పేలా ప్రసంగాలు చేయటం ఉన్మాదం. కర్ణాటక విద్వేష ప్రసంగాలూ, విద్వేష నేరాలు (నివారణ, నియంత్రణ) బిల్లు ఈ మాదిరి చర్యల్ని సరిగానే గుర్తించింది.
కేవలం ప్రసంగాలే కాదు...సమాజ గమనానికి ముప్పు కలిగించే రాతలు, చిత్రాలు, దృశ్యాలు వగైరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం కూడా ఈ బిల్లు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. మతం, కులం, భాష, జెండర్, జాతి, ప్రాంతం, అంగవైకల్యం తదితరాల పేరిట వ్యక్తులపై లేదా బృందాలపై విద్వేషాన్ని ప్రేరేపిస్తే వివిధ రకాల శిక్షలు నిర్దేశించింది.
మొదటి నేరానికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ, అనంతర నేరాలకు రెండునుంచి పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా వేయొచ్చు. ఈ నేరాలను శిక్షార్హమైన, బెయిల్‌కు వీలుకాని నేరాలుగా పరిగణించటం దీని తీవ్రతను తెలియ జేస్తోంది. సంస్థల పేరిట నేరాలకు పాల్పడిన పక్షంలో వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు.
ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉండే విద్వేషపూరిత అంశాలను తొలగించమని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనార్థం విద్యాసంబంధ, కళాత్మక, సాహిత్య, శాస్త్రీయ దృష్టితో చేసే ప్రసంగా లకూ, ఇతరేతర సందేశాలకూ ఇది మినహాయింపును ఇచ్చింది. బాధితులకు నష్టపరి హారం ఇచ్చేందుకు కూడా ఇందులో ఏర్పాటుంది.
అయితే ఇలాంటి బిల్లుల రూపకల్పనలో అస్పష్టతకు తావుండటం వల్ల పోలీసులకు అపరిమిత అధికారాలు దక్కుతాయి. అవి దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. గతంలో టాడా చట్టం, ఇప్పుడు యూఏపీఏ విషయంలో ఈ ఆరోపణ లున్నాయి.
హిందూ మతసంస్థల అణచివేతకే ఈ చట్టం తీసుకు రాబోతున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, పౌర సమాజ కార్యకర్తలు సైతం బిల్లులోని అంశాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా మానసికంగా గాయ పరచటం అనే భావనకు చోటున్నందు వల్ల దుర్వినియోగానికి అవకాశాలెక్కువ.
వాస్తవంగా ఫలానా ప్రసంVýæం సమాజంలో ఘర్షణలకు కారణమని ధ్రువపడటం, దాని కారణంగా హత్య జరిగిందని నిర్ధారణ కావటం వంటి సందర్భాల్లో చట్టం తోడ్పడాలి. కానీ విస్తృత భాష్యం చెప్పగలిగే వాటిని చేర్చటంవల్ల చట్టం ఉద్దేశమే దెబ్బతింటుంది.
విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు కనబడదు. దుర్వినియోగానికి తావు లేని రీతిలో చట్టం ఉన్నప్పుడే నిజమైన నేరగాళ్లకు శిక్షపడుతుంది. ఆ దిశగా ఆలోచించటం అవసరం.


