ఆలయంలో వివాహం చేసుకుంటుంటారు చాలామంది. అలాగే కొన్ని ఆలయాలు సాముహిక పెళ్లిళ్లను జరిపిస్తుంటాయి కూడా. మరికొందరు మొక్కుల రీత్యా కూడా ఆలయంలో వివాహం చేసుకుంటారు. అలాంటిది వేల ఏళ్ల నాటి పురాతన ఆలయం ఆకస్మికంగా వివాహాలను నిషేధించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఆలయ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా అక్కడ ప్రభుత్వానికి తెలియజేసింది కూడా. అందుకు సుప్రీం కోర్టు కూడా సమ్మతించడం విశేషం ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే విస్తుపోతారు.
బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటి, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చాలామంది జంటలు వివాహాలు చేసుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారం కూడా. అలాంటిది గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వివాహ వేడుకులను నిలిపివేసింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ ఆలయంలో వివాహాలను నిషేధించడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది.
ఆలయ చరిత్ర
సోమేశ్వరస్వామి ఆలయం సుమారు 12వ-13వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. దీని నిర్మాణంలో చోళులు, విజయనగర రాజుల నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపేగౌడ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేదా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో వేలాది జంటలు పెళ్లితో ఒక్కటయ్యేవి. అయితే ఆ జంటలే మధ్య సయోధ్య కుదరక విడాకులకు దారితీయడంతో.. ఆ ఆలయ పూజారులు కోర్టుల చుట్టూ తిగరాల్సి వచ్చింది.
అంతేగాదు ఆలయ ఆగమ పనులకంటే..కోర్టు చుట్టూ తిరగడమే పనైంది పూజారులకు. ఈ న్యాయపరమైన చిక్కులను నివారించేందుకు, అలాగే పూజారులు ఆయల కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా వివాహాలను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. హిందూ వివాహాలకు పేరుగాంచిన ఈ ఆలయం ఏటా వందలాది జంటల వివాహాలను ఘనంగా జరిపించేది. ఆలయ గోపురం కింద ఈ వివాహాలు జరిగేవవి.
వేద సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా జరిగే ఈ వివాహాలు..ఇటీవల విడాకులు కేసులు అంతకంతకు పెరిగి ఆలయ పవిత్రత మంట కలిసిపోయేలా మారింది. దానికి తోడు ఆ పెళ్లిలో సాక్షులుగా ఉన్న పూజారులు కోర్లుమెట్టాక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతరెండేళ్లలోనే ఆలయ అధికారులకు 50కి పైగా విడాకులు ఫిర్యాదుల అందాయట. చాలా వివాహాలు ఇంట్లోని కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా చేసుకోవడం, కొందరు నకిలీ డాక్యుమెంట్లతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వాపోయారు. పూజారుల భక్తి సమయం ఆదా అయ్యేలా, అలాగే ఆలయ పవిత్రతను కాపాడుకునేలా ఇలా వివాహాలను నిషేధించక తప్పలేదని చెబుతున్నారు.
ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది అమిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఆలయం ఇతర ఆచారాలు, మతపరమైన వేడుకలను అనుమతిస్తూనే ఉంది. కానీ ప్రస్తుతానికి వివాహాలను అనుమతించబోమని నిర్ణయించింది. ట్రెండ్‌ను అంచనా వేసి, కమ్యూనిటీ వాటాదారులతో సంప్రదించిన తర్వాత భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించవచ్చని యాజమాన్యం పేర్కొంది." అని చెప్పారు.
నిజానికి దక్షిణ భారతదేశంలో దేవాలయాలలో వివాహాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఆ నేపథ్యంలోనే పురాతన దేవాలయాల్లో వీటిని నిర్వహించేందుకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. కానీ పెరుగుతున్న విడాకుల కేసులు, పూజారులను చట్టపరమైన చిక్కుల్లో పడేశాయి. దీంతో అధికారులు సోమేశ్వర ఆలయం మరిన్ని న్యాయమపరమైన చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేలా ఈ వివాహాలకు అడ్డుకట్టవేయాల్సి వచ్చింది.
(చదవండి: లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!)


