లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..! | Sing-Alongs Are Hyderabads New Trend | Sakshi
Sakshi News home page

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

Dec 10 2025 11:01 AM | Updated on Dec 10 2025 11:01 AM

Sing-Alongs Are Hyderabads New Trend

క్లాస్‌రూమ్‌ సింగింగ్‌ నుంచి కరోకే సాంగ్స్‌ దాకా నగరంలో పాటలు వినే శ్రోతల్ని పాటల్ని ఆలపించే గాయకులుగా మార్చే పలు వేదికలు పుట్టుకొస్తున్నాయి. సంగీతం నేర్చుకోకున్నా.. అనుభవం లేకున్నా.. పాటాభిమానమే అర్హతగా పాడుకుందాం రా.. అని ఆహ్వానిస్తున్నాయి. అదే క్రమంలో కొత్తగా పుట్టుకొచ్చిన ట్రెండ్‌ పేరే ‘సింగ్‌ ఎలాంగ్‌’.. అచ్చ తెలుగులో చెప్పాలంటే సామూహిక గానం..  

భాగ్యనగరంలో విభిన్న భాషలు సంప్రదాయాలు సంగీత ధోరణులు కలిసిపోయి కొత్త ట్రెండ్స్‌కు ఊపిరిపోస్తున్నాయి. అలాంటి మరో కొత్త ట్రెండే కలిసి పాడే సెషన్లు. అయితే ఇవి కరోకేలాగా ఒంటరిగా పాడేవి కాదు. ఈ సింగింగ్‌ సమావేశాలకు వేదిక ఉండదు. అలాగే ప్రధాన గాయకులు అంటూ ఎవరూ ఉండరు. అంతేకాదు ఔత్సాహికుల పాడే నైపుణ్యంపై తీర్పులు చెప్పడం లాంటివి కూడా జరగవు. అపరిచితులైన అందరూ కలిసి పాడతారు. 

అన్నింటినీ విడిచిపెట్టి సంగీతంతో కనెక్ట్‌ అయ్యేందుకు సృష్టించిన ప్రత్యేక ప్రదేశంలో కలవడమే సింగ్‌ ఎలాంగ్‌. కేఫ్స్‌ నుంచి కమ్యూనిటీస్‌ దాకా.. ఈ సింగ్‌ ఎలాంగ్‌ ఈవెంట్స్‌.. సాధారణంగా ప్రశాంతంగా ఉండే కేఫ్‌లు, విశాలమైన కల్చరల్‌ స్పేసెస్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీ, పార్క్స్, సిటీ దగ్గరలోని పిక్నిక్‌ స్పాట్స్‌ తదితర ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. దీంతో ఇవి ప్రస్తుతం నగరంలో తాజా వారాంతపు క్రేజ్‌గా మారాయి. 

వీటి రిజిస్ట్రేషన్‌ ఫీజులు సైతం రూ.150 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉండటంతో అన్ని వయసుల వారిని ఆకర్షిస్తున్నాయి. సామూహిక గానంలోని వినోదాన్ని పంచే ఇలాంటి సెషన్స్‌ నిర్వహించేందుకు కేంద్రీయ విద్యాలయ పూర్వ విద్యార్థి, డేటా విశ్లేషకురాలు లాస్య నందిగాం(25),  సివిల్‌ ఇంజనీర్‌ అయిన ప్రనిధి కాంచనపల్లి(24) కలిసి జూలైలో ‘అన్‌ప్లగ్డ్‌ రాగం’ను ప్రారంభించారు. ‘మాకు వివిధ వయసుల వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొనేవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికీ సంగీతంతో అనుబంధాన్ని పెంచడమే మా ప్రయత్నం’ అంటున్నారు లాస్య.. ‘రెట్రో, ఫెస్టివల్, జానపద ఇలా వారానికో థీమ్‌ను ఎంచుకుంటాం. మా తల్లిదండ్రులు ఇళయరాజా అభిమానులు, కాబట్టి ఈ అభిరుచి సహజంగానే నాకూ అబ్బింది’ అని ప్రనిధి చెబుతున్నారు.

పాటలతో కలుపుగోలు.. ఒత్తిడికి వీడ్కోలు ఈ ఆలోచన మానసిక ఆరోగ్య కార్యక్రమాల నుంచి పుట్టిందని చెప్పొచ్చు. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మరికొందరితో కనెక్ట్‌ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సామూహిక సంగీతం దానిని సులభతరం చేసింది. ‘వయస్సు లేదా వృత్తి వ్యాపకాలతో సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా పాడటానికి మాత్రమే వస్తారు. పధాన గాయకుడు/గాయని అంటూ ఎవరూ ఉండరు.. 

అందరూ ఒకే గొంతుగా పాడతారు. అపరిచితులమనే భావన కాసేపటికే మాయమవుతుంది. సుపరిచితులై, వారంలోని ఒత్తిడికి వీడ్కోలు పలుకుతారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే సంగీతం ద్వారా చేసే చికిత్స.’ అని హైదరాబాద్, వైజాగ్‌ వంటి నగరాల్లో ఈ సింగ్‌ ఎలాంగ్‌ కార్యక్రమాలను నిర్వహించే ‘ఓపెన్సెట్‌’ వ్యవస్థాపకుడు హర్ష కొమరవోలు అంటున్నారు. తాము కేఫ్‌లతో కలిసి ఒప్పందం చేసుకుని ఈ తరహా ఈవెంట్స్‌ నిర్వహిస్తామన్నారాయన.  

ఉపశమనం.. ఉభయకుశలోపరి.. 
ఈ సెషన్లు నగరవాసులకు భావోద్వేగ ఉపశమనంగా సరికొత్త స్నేహానికి మార్గాలుగా మారాయి. ‘ఈ పాటల వేడుకలు కళాకారులకు సైతం కొత్త శైలులను కనుగొనడంలో సారూప్యత కలిగిన వ్యక్తులతో కనెక్ట్‌ అవ్వడంలో సహకరిస్తున్నాయి. 

‘ఈ సెషన్లు పాటల పోటీలు కావు.. అయినప్పటికీ అవి నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సంగీతం పట్ల నాకున్న మక్కువను పంచుకునే ఇతరులను కలవడానికి సహాయపడ్డాయి’ అని నగరవాసి తరుణ్‌ అంటున్నారు. ఓ వైపు పాటలు వినే ఆసక్తి కొనసాగుతూనే ఉంటే మరోవైపు దానికి ధీటుగా స్వయంగా పాటలు పాడే సమాజం విస్తరిస్తోంది. స్వరాలు ఏకమైనప్పుడు, సంగీతం అభిరుచుల ఐక్యతను కూడా వినిపిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement