సాక్షి, సిటీబ్యూరో: అతిథులే గాయకులై పాటల తోటలో ఊయలలూగేలా చేసే ‘సింగ్ ఎలాంగ్’ కార్యక్రమాన్ని నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న అకాన్ రెస్టారెంట్ నిర్వహిస్తోంది. ‘పాడు బ్రో’పేరిట నిర్వహిస్తున్న ఈ సింగ్ ఎలాంగ్ సెషన్ 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. సంగీతంలో ప్రవేశం లేకపోయినా, గాత్రంపై పట్టు లేకపోయినా హాయిగా అందరితో కలిసి పాటలు పాడే ఈ పాటల సందడి 21 ఏళ్లు పైబడినవారికి మాత్రమే పరిమితం. దాదాపు 4 గంటలపాటు కొనసాగే ఈ ఈవెంట్‌లో పాల్గొని గాత్రం కలపాలన్నా, సరదా గాయకుల సందడి చూడాలన్నా ఆన్‌లైన్ ద్వారా ఎంట్రీ పాస్‌లు కొనుగోలు చేయాలి.
నెక్సస్‌లో ది గ్లోస్ బాక్స్ షురూ...
కూకట్‌పల్లిలోని నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో బ్యూటీ ఫెస్టివల్ ‘‘ది గ్లోస్ బాక్స్’’ప్రారంభమైందని మాల్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. పెళ్లిళ్లు, పార్టీ సీజన్‌ను పురస్కరించుకొని డిసెంబర్ 7 వరకు ఈ ఫెస్ట్ జరగనుందని, దేశంలోనే ప్రముఖ బ్యూటీ, గ్రూమింగ్, వెల్నెస్ బ్రాండ్లు అందుబాటులోకి కొలువు దీరనున్నాయని పేర్కొన్నారు. ది గ్లోస్ బాక్స్‌లో లైవ్ డెమోలు, సౌందర్య నిపుణుల చిట్కాలు, ఫన్ మేకోవర్ జోన్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఫన్ జోన్స్‌ను క్లిక్ చేసి షేర్ చేసుకునేందుకు వీలుగా ఆసక్తికరమైన రీతిలో ఏర్పాటు చేశామని వివరించారు.


