ఆరుబయట ఎండలో కూర్చున్న విద్యార్థులు
పలు జిల్లాల్లో 7 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు
పాఠశాలల్లో భారీగా పడిపోతున్న హాజరు శాతం
వారం రోజులుగా 46 శాతం మించడం లేదంటున్న విద్యాశాఖ లెక్కలు
ఉదయాన్నే వణుకుతూ స్కూళ్లకు వెళ్లేందుకు మొరాయిస్తున్న చిన్నారులు
జలుబు, దగ్గు లాంటి సమస్యలతోనూ బాధ పడుతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వణికించే చలిలో ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లడానికి పిల్లలు మారాం చేస్తున్నారు. మరోవైపు వారు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో పాఠశాలల్లో హాజరు శాతం పడిపోతోంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో పాఠశాలల వేళల మార్పునకు ఇది కారణమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో అయితే అరకొరగానే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరు లేని చోట్ల బోధన చేపట్టడం లేదు.
చలిలో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం కూడా సమస్యగా మారింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లల్లో విద్యార్థులు చలికి వణికి పోతున్నారు. గీజర్లు పనిచేయని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల కిటికీలకు తలుపులు కూడా లేవు. దీంతో విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకోలేక అష్టకష్టాలూ పడుతున్నారు.
ఉదయం ఓ యజ్ఞం
పొద్దున్నే నిద్ర లేచేందుకు విద్యార్థులు బద్ధకిస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుని పాఠశాలకు తయారవ్వడం ఓ యజ్ఞంగా మారుతోంది. ఆలస్యంగా నిద్రలేవడం, హడావుడిగా స్కూలుకు వెళుతుండటంతో అల్పాహారం తీసుకునేందుకు వీలవడం లేదు. విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే..తల్లిదండ్రులకూ ఇబ్బందులు తప్పడం లేదు. పిల్లల కన్నా ముందే లేచి బాక్సు సిద్ధం చేయడం చలిలో కష్టమవుతోందని అంటున్నారు. ఇక ఉద్యోగం చేసే తల్లిదండ్రుల అవస్థలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి.
హాజరు అంతంత మాత్రమే
వారం రోజులుగా ప్రాథమిక పాఠశాలల్లో హాజరు 46 శాతం మించడం లేదని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 480 ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లల్లో 10 మందికి మించి విద్యార్థులు హాజరవ్వడం లేదు. ఉన్నత పాఠశాలల్లో కేవలం టెన్త్ క్లాస్ విద్యార్థుల హాజరు మాత్రమే కాస్త ఎక్కువగా ఉంటోంది. వార్షిక పరీక్షలు రాయాల్సి ఉండటంతో కష్టంగానైనా వాళ్లు స్కూలుకు హాజరవుతున్నారు. అయితే వీళ్ళల్లో చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఇక ప్రత్యేక తరగతులంటే విద్యార్థులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. స్కూలుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఒకటి రెండు క్లాసులు ఉండగానే ఇళ్లదారి పడుతున్నారు.
ఇదీ సంగతి!
⇒ సంగారెడ్డి, కుమురం భీం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల లోపే ఉంటున్నాయి. ఈ జిల్లాల్లో వారం రోజులుగా విద్యార్థుల హాజరు శాతం 20 నుంచి 38 శాతం వరకు పడిపోయింది. 50 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కొన్ని రోజులుగా 10కి మించడం లేదు.
⇒ ఆదిలాబాద్, కుమురం భీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 100కు పైగా స్కూళ్లల్లో 50 శాతం లోపే హాజరు ఉంటోంది. ప్రైవేటు స్కూళ్లల్లోనూ వారం రోజులుగా హాజరు 25 శాతం వరకూ పడిపోయింది. హైదరాబాద్‌లోని పలు స్కూళ్లల్లో దాదాపు 20 శాతం మంది విద్యార్థులు ఆలస్యంగా వస్తున్నారు.
⇒ మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో విద్యార్థులు జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. వీళ్లు స్కూళ్లకు వచ్చినా త్వరగా వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. టీచర్లు కూడా చాలామంది సెలవుల్లో ఉంటున్నారు. టెట్ కోసం కొందరు, ఇతర కారణాలతో మరికొందరు సెలవులు పెడుతుండటంతో బోధన అరకొరగానే సాగుతోంది.
⇒ నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుము రం భీం సహా పలు జిల్లాల సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థు లు చలికి వణికి పోతున్నారు. అనేకచోట్ల గీజర్లు పని చే యడం లేదు. ఇతర వసతుల లోపం కూడా కన్పిస్తోంది.
చలికి భయ‘బడి’!
ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటల వరకు బయటే కూర్చోవలసి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం కనిపించిన ఈ దృశ్యం చలి తీవ్రతకు అద్దం పడుతోంది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్


