స్పీకర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌.. పదవికి మచ్చ తెస్తారా? | Minister Bandi Sanjay Serious Comments On Speaker Prasad | Sakshi
Sakshi News home page

స్పీకర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌.. పదవికి మచ్చ తెస్తారా?

Feb 4 2026 1:39 PM | Updated on Feb 4 2026 1:46 PM

Minister Bandi Sanjay Serious Comments On Speaker Prasad

సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో పార్టీ ఫిరాయింపులు సంసారం పెట్టారు.. కనిపించడం లేదా? అని స్పీకర్‌ను ప్రశ్నించారు.

సిరిసిల్లలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రచారంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. గాంధీ భవన్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు?. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు.. వాళ్లే బీఫాంలు పంచుతున్నారు. స్పీకర్ గారు.. అయినా మీ కళ్లకు కన్పించడం లేదా?. స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా?. ప్రజలారా.. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. ఎందుకు ఓటేయాలని అడగండి.

మాకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారట. కేటీఆర్.. నా జోలికొస్తే రోడ్డుకీడుస్తా. కేంద్రం నిధులిస్తే.. ఆ నిధులను తినేసి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయాపైసా ఇవ్వలేదు. కాంగ్రెస్ వద్ద నయాపైసా లేదు.. వాళ్లకు ఎందుకు ఓటేయాలి?. అందుకే ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు. మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత హామీలతో మీ ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోతే ఐదేళ్ల అరిగోస తప్పదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement