నాలుగు గోడలు, పైకప్పుతో ఉండే సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ప్రైవసీ, ఆధునిక వసతులు ఉండే విలాసవంతమైన ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఏడాది కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు అమ్ముడుపోగా.. ఇందులో రూ.10–20 కోట్ల ధర ఉండే లగ్జరీ యూనిట్ల విక్రయాలు 170 శాతం వృద్ధి చెందగా.. రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ అమ్మకాలు 16 శాతం తగ్గాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టే డెవలపర్లు కూడా ప్రీమియం ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ.. స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా భారత ఆర్థిక దృక్పథం స్థిరంగా ఉంది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరిగింది. విస్తీర్ణమైన గదులు, ఆధునిక వసతులు, గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి కారణంగా లగ్జరీ గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని విలాసవంతమైన ఇళ్లలో 45 శాతం ఐదేళ్లలో వచ్చినవే..
పర్యావరణ అనుకూలమైన, ఇంధన సమర్థవంతమైన నివాసాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇవే స్థిరాస్తి రంగంలో స్థిరమైన అభివృద్ధికి కీలకంగా మారాయి. దేశంలోని లగ్జరీ గృహ విక్రయాలలో 10 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నైల కంటే భాగ్యనగరంలోనే విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉండటం గమనార్హం
ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్..
లగ్జరీ గృహ విక్రయాలకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కోకాపేట, నియోపోలిస్ ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో రూ.20–40 కోట్ల మధ్య ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు సైతం నమోదవుతుండటం దీనికి ఉదాహరణ.


