జనంలోకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
నేటి పార్టీ సమావేశంలో బహిరంగ సభలపై నిర్ణయం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
రేవంత్ ఒక కాలు కాంగ్రెస్‌లో మరో కాలు బీజేపీలో ఉందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఆయన పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజల్లోకి వెళ్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగే బీఆర్‌ఎస్ కీలక నేతల సమావేశంలో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు సహా పలు అంశాలపై మాట్లాడారు.
రేవంత్ ఇంటిని బీజేపీ ఎంపీ రీ మోడల్ చేయించాడు
‘కాంగ్రెస్, బీజేపీ నడుమ లోపాయికారీ ఒప్పందం ఉంది, రేవంత్ ఓ కాలు కాంగ్రెస్‌లో మరో కాలు బీజేపీలో ఉంది. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులో రేవంత్ ఇల్లును ఓ బీజేపీ ఎంపీ రీ మోడల్ చేయించాడు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహ ప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లాడో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు చెప్పాలి. సీఎం రమేశ్ వంటి వారికి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టులు ఇస్తుంటే, బీజేపీ ఆయనకు అండగా నిలుస్తోంది. అఖిలేశ్ యాదవ్‌తో నా దోస్తీపై రామచందర్‌రావుకు బాధ ఎందుకు? పంచాయతీ ఎన్నికల ఫలితాల దెబ్బతో ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయి.
గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా జరిగింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లు చేయాలనేది రేవంత్ ఆలోచన. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయడం వంటి ప్రయోగాల జోలికి కేంద్రం వెళ్లకపోవచ్చు. ఉద్యమ ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి ప్రయోగాలు ఫలించవు..’అని కేటీఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్‌లో ఉన్నామనడం కామెడీ
‘కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టిన కడియం బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ఆ ఎమ్మెల్యేలు చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రేవంత్ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను ఫెయిల్ కాలేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఏడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం. ఫార్ములా ఈ, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు డొల్ల అని రేవంత్‌కు అర్ధమైంది. ఆయన పాలన వైఫల్యాలకు ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక.
రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా..
రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా. ఆయన మాదిరిగా కుటుంబసభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయను. ఇంట్లోని పిల్లలు, మహిళలు, మనవడి గురించి మాట్లాడను..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
లైన్లు దాచేందుకే యూరియా యాప్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: యూరియా కోసం రైతులు బారులు తీరే దృశ్యాలను దాచి పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మొబైల్ యాప్ విధానం తెస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనాన్ని బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచి పెట్టేందుకు కొత్తగా రైతు వ్యతిరేక విధానం తెస్తోందన్నారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన బీఆర్‌ఎస్ మద్దతుదారులను తెలంగాణ భవన్‌లో శనివారం కేటీఆర్ సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేనందునే రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల అవసరాల మేరకు వెంటనే యూరియాను సరఫరా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యాప్‌ల పేరిట రైతులకు కొత్తగా సమస్యలు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిధులు ఏ నాయకుడి సొంత ఆస్తి కాదని, ప్రజల సొమ్ముకు నాయకులు ధర్మకర్తలు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీకి వచ్చే నిధులపై సర్పంచ్‌లు, పంచాయతీ పాలక మండలికి మాత్రమే సంపూర్ణ అధికారం ఉంటుందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజా అవసరాలకు నిధులను ఖర్చు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


