కొత్త ఏడాదిపై రియల్‌ ఎస్టేట్‌ గంపెడాశలు | Real Estate Set for a Boom in the New Year 2026 | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిపై రియల్‌ ఎస్టేట్‌ గంపెడాశలు

Dec 20 2025 5:18 PM | Updated on Dec 20 2025 5:36 PM

Real Estate Set for a Boom in the New Year 2026

ఫ్యూచర్‌ సిటీ, మూసీ, మెట్రో విస్తరణ, త్రిబుల్‌ ఆర్‌ వంటి ప్రాజెక్ట్‌లతో ఉత్సాహం

ప్రాజెక్ట్‌ల కార్యాచరణ మొదలైతే రియల్టీలో జోష్‌

2025లో.. ఔటర్‌ వరకూ గ్రేటర్‌ పరిధి విస్తరణ..

భారత్‌ ఫ్యూచర్‌ సిటీతో నగరంలో నాలుగో నగరి అవతరణ..

మూసీకి పునరుజ్జీవంతో నైట్‌ ఎకానమీ ఆవిష్కరణ..

మెట్రో విస్తరణ, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ల ప్రణాళికలతో కొంగొత్త ఉత్సాహం..

..హైదరాబాద్‌ ముఖచిత్రాన్ని మార్చే ఈ మెగా ప్రాజెక్ట్‌లకు శ్రీకారం పడింది. ఇక, వీటి కార్యాచరణతో కొత్త ఏడాదిలో నగర స్థిరాస్తి రంగం దూసుకెళ్లడం ఖాయమని నిర్మాణ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో రియల్‌ అభివృద్ధికి ఢోకా లేదని భావిస్తున్నారు. మరోవైపు గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల రాకతో ఐటీ నిపుణులు, సంస్థలు హైదరాబాద్‌ వైపు దృష్టిసారిస్తున్నారు.

స్థిరాస్తి రంగానికి మెరుగైన మౌలిక వసతులే జవసత్వాలు. రహదారులు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలు వంటి సామాజిక వసతులు ఉన్న చోట స్థిరాస్తి రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైటెక్‌ సిటీ, మాదాపూర్, కూకట్‌పల్లి, కోకాపేట, నార్సింగి వంటి ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఆయా ప్రాంతాలలో ప్రభుత్వాలు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో నిర్మాణ సంస్థలు పోటీపడీ మరీ నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించాయి. దీంతో ఎకరం వందల కోట్లు పలికే రికార్డ్‌ స్థాయికి ఆయా ఏరియాలు అభివృద్ధి చెందాయి. సాధారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఒక్క చదరపు అడుగు(చ.అ.) కార్యాలయ స్థలం లావాదేవీ జరిగితే.. 10 చ.అ. నివాస స్థలానికి డిమాండ్‌ ఏర్పడుతుందని అంటారు. ఆఫీసు స్పేస్‌ అభివృద్ధితో నివాస, వాణిజ్య సముదాయాల అవసరం ఏర్పడుతుంది.  

రెండేళ్ల కాలంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ), గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. మన భాగ్యనగరం బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, అందుబాటు ధరలు, నిపుణుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్‌ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి రకరకాల కారణాలతో బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో కంపెనీల ఏర్పాటుకు, పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఔటర్‌ గ్రేటర్‌.. 
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. 27 నగర, పురపాలక సంస్థలు జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా జీహెచ్‌ఎంసీ అవతరించింది. రెండు వేల చ.కి.మీకు పైగా విస్తరించిన జీహెచ్‌ఎంసీని ఒకే కార్పొరేషన్‌ ఏర్పాటు కావడంతో కొత్త ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి. బహుళ స్వతంత్ర మున్సిపల్‌ కార్పొరేషన్ల ఏర్పాటుతో సమర్థవంతమైన పరిపాలన, సమాంతర అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులను వేగవంతమవుతాయి. పట్టణీకరణ సవాళ్లు, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం సులువు అవుతుంది. పాత మున్సిపాలిటీల్లోనూ మెరుగైన మౌలిక వసతులు రావడంతో రియల్‌ ఎస్టేట్‌కు డిమాండ్‌ ఏర్పడటం ఖాయం. బహుళ అంతస్తుల భవనాలు, భారీ వెంచర్లకు నిర్మాణ సంస్థలు, డెవలపర్లు ముందుకొస్తారు.

మెట్రో బూమ్‌..
హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగోల్‌–శంషాబాద్‌ విమానాశ్రయం, రాయదుర్గం–కోకాపేట, ఎంజీబీఎస్‌ – చాంద్రయాణగుట్ట, మియాపూర్‌– పటాన్‌చెరు, జేబీఎస్‌–మేడ్చల్‌/శామీర్‌పేట వంటి కీలక మార్గాలలో మెట్రో పరుగులు పెట్టనుంది. సుమారు 76–86 కి.మీ. మేర మెట్రో కొత్త లైన్‌ రానుంది. మెట్రో విస్తరణతో శివారు ప్రాంతాలు ప్రధాన నగరంతో అనుసంధానమవుతాయి. ప్రీమియం గృహాలకు డిమాండ్‌ ఏర్పడుతుంది. కోకాపేట, గచ్చిబౌలి, ఉప్పల్‌ వంటి విమానాశ్రయంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా మారతాయి. మెట్రో లైన్లలోని ఆస్తి విలువలు 10–20 శాతం మేర పెరుగుతాయి. కొత్త స్టేషన్ల చుట్టూ 2–3 కి.మీ. వరకూ బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు వస్తాయి.

ఫ్యూచర్‌ బెటర్‌
ఏటేటా మహా నగరం విస్తరిస్తోంది. విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం రకరకాల కారణాలతో నగరంలో వలసలు పెరుగుతున్నాయి. శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండటంతో ప్రధాన నగరంలో జనసాంద్రత పెరుగుతోంది. మౌలిక వసతులపై ఒత్తిడి పడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్‌ రాష్ట్ర రహదారుల మధ్యలో మీర్‌ఖాన్‌పేటలో సుమారు 30 వేల ఎకరాలలో ఫోర్త్‌ సిటీ నిర్మాణానికి పునాదులు వేసిన సంగతి తెలిసిందే. ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్‌ ఏడు మండలాల్లోని 56 గ్రామాలను కలుపుతూ ప్రత్యేకంగా ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో రహదారులు, భూగర్భ విద్యుత్‌ వ్యవస్థ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ గ్రామాలలో భూములకు రెక్కలొచ్చాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా గ్లోబల్‌ సమ్మిట్‌–2047ను కూడా నిర్వహించింది. రెండు రోజుల సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ఫ్యూచర్‌ సిటీలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి.

మూసీ అభివృద్ధికేసి..
భాగ్యనగరం నడిబొడ్డున వడ్డాణం మాదిరిగా అందంగా పొదిగిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మూసీ నదిని కేవలం నదీ తీర ప్రాంతంగా మాత్రమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖలా నిలిచేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నైట్‌ ఎకానమీకి మూసీని కేరాఫ్‌ మూసీ మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. మూసీ నదిని బ్లూ, గ్రీన్‌ అని రెండు భాగాలుగా అభివృద్ధి చేయనున్నారు. బ్లూ మాస్టర్‌ ప్లాన్‌లో వరద నీటి నివారణ, వంతెనల నిర్మాణం తదితర అంశాలుంటే.. గ్రీన్‌ మాస్టర్‌ ప్లాన్‌లో నదీ తీరంలో గ్రీనరీ, రవాణా ఆధారిత అభివృద్ధి తదితర అంశాలుంటాయి.

మూసీ నదీ తీర పునరుజ్జీవం, ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తూర్పు–పశ్చిమ నదీ తీరాన్ని కలుపుతూ 35–40 కి.మీ. కారిడార్‌ను అభివృద్ధి చేస్తారు. మూసీ నదీ తీరాన్ని రవాణా ఆధారిత అభివృద్ధిగా కలిపి డెవలప్‌ చేయాలని ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నది తీరం వెంబడి ప్రజా స్థలాలు, వినోద కేంద్రాలు, విహార ప్రదేశాలు, సాంస్కృతిక వేదికలు, విహార ప్రదేశాలు, ఉద్యానవనాలు, సాంస్కృతిక కేంద్రాలు, సైకిల్, వాకింగ్‌ ట్రాక్స్‌ వంటి స్థిరమైన రవాణా ఏర్పాట్లు వంటివి ఏర్పాట్లు చేయనున్నారు. వరదల నిరోధకత, జీవ వైవిధ్యం, సమ్మిళిత రూపకల్పనపై దృష్టిసారించనున్నారు. అలాగే ఆగ్యుమేటెడ్‌ రియాల్టీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాల్టీ (వీఆర్‌) ఆధారిత స్టోరీ     టెల్లింగ్‌ జోన్లు, కల్చరల్‌ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు.

త్రిబుల్‌ ఆర్‌ రయ్‌.. 
ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాలలో అభివృద్ధి విస్తరణకు ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి 30–50 కి.మీ. దూరంలో రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (త్రిబుల్‌ ఆర్‌)కు ప్రణాళికలు చేసింది. హైదరాబాద్‌ చుట్టూ 340 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్ట్‌ ఇదీ. త్రిబుల్‌ ఆర్‌తో రాష్ట్ర మొత్తం కనెక్టివిటీ మెరుగవుతుంది. ఇంటర్‌ ఛేంజ్‌లు, గ్రోత్‌ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాలలో రియల్‌ ఎస్టేట్‌ అవకాశాలు ఏర్పడతాయి. పారిశ్రామిక గిడ్డంగులు, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లకు ఆస్కారం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement