సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్
నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయమే సమావేశం ప్రధాన ఎజెండా
పార్టీ కార్యాచరణపై అధినేత దిశానిర్దేశం చేసే చాన్స్
సుమారు 450 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం
శనివారం సాయంత్రమే నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ కీలక నేతల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షంతో పాటు పార్టీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తదితరులు కలిపి మొత్తంగా సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ పార్టీ సమావేశానికి హాజరు కానుండటం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రమే కేసీఆర్ దంపతులు ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరుల స్తూపం, జయశంకర్ విగ్రహానికి నివాళి అరి్పంచిన అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు.
ఏపీ జల దోపిడీపై పోరుబాట
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, ఏపీ జలదోపిడీపై పోరుబాటకు ఆదివారం జరిగే సమావేశంలో కేసీఆర్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకంపై రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు త్వరలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన కరివెన రిజర్వాయర్ వద్ద ఈ సభ నిర్వహించే అవకాశముంది. అలాగే నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం జల దోపిడీ కోసం చేస్తున్న కుట్రలపైనా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపైనా క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పోరాట రూపాలపైనా ఈ సమావేశంలో చర్చించి కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశముందని
అంటున్నారు.
కవిత ఎపిసోడ్ సహా ఇతర అంశాలపై?
పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘జనం బాట’పేరిట జిల్లా పర్యటనల్లో పార్టీ కీలక నేతలు లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత కుమార్తె కవిత అంశంలో కేసీఆర్ స్పందిస్తారా అనే ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వ నిర్ణయం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి అంశాలు ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది.
ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ తదితర అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే కోణంలోనూ దిశా నిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడంపై కూడా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌పై స్పష్టత ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు.


