హైదరాబాద్, డిసెంబర్ 19: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలోనూ, భవిష్యత్ తరాల ప్రయోజనాలను కాపాడడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన నిబద్ధతను చాటుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే లక్ష్యంతో జాతీయ ఇంధన పరిరక్షణ ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించింది. కోటిమందికిపైగా జనభాతో ప్రపంచంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటిగా జీహెచ్ఎంసీ వెలుగొందుతోంది. త్వరలోనే ఈ జనాభా సంఖ్య 1.12 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రజా పరిపాలన, పట్టణ ప్రణాళిక, పారిశుధ్యం మరియు రహదారి మౌలిక సదుపాయాలలో జీహెచ్ఎంసీ కీలక పాత్ర పోషిస్తుంది. నగర అభివృద్ధి ఎజెండాలో భాగంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి కార్పొరేషన్ ఇంధన సామర్థ్యం (ఈఈ), ఇంధన పరిరక్షణ (ఈసీ) లకు అధిక ప్రాధాన్యతనిచ్చింది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో జీహెచ్ఎంసీ నగరం అంతటా సుమారు 5.53 లక్షల ఇంధన-సమర్థవంతమైన ఎల్ఈడీ వీధి దీపాలను విజయవంతంగా పునరుద్ధరించింది. ఈ చొరవ కేంద్రం వీధి దీపాల జాతీయ కార్యక్రమం (ఎస్ఎల్ఎన్‌పీ) కింద అమలు చేయబడిన మెట్రోపాలిటన్ నగరాల్లో భారతదేశంలోని అతిపెద్ద ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఇప్పుడు ప్రపంచ సాంకేతికతలు మరియు అంతర్జాతీయ సేవా ప్రమాణాలను స్వీకరించడం ద్వారా హైదరాబాద్ వీధి దీపాల కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం జాతీయ ఇంధన సామర్థ్య నిపుణులతో సంప్రదించి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యత
సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తూ కేవలం ఇంధన సామర్థ్యం మరియు పరిరక్షణపైనే కాకుండా పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణపై కూడా జీహెచ్ఎంసీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేస్తోందని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ పేర్కొన్నారు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆయన హైదరాబాద్ వాతావరణ కార్యాచరణ వ్యూహంలో ఇంధన సామర్థ్యం పాత్రను హైలైట్ చేసే సమగ్ర నివేదికను ఆవిష్కరించారు. ఈ నివేదికను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మీడియా సలహాదారు ఏ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈఎస్ఎల్ మరియు తెలంగాణ ప్రభుత్వంలోని రాష్ట్ర నియమించబడిన ఏజెన్సీ టీఎస్ రెడ్‌కో సహకారంతో రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఇంధన సామర్థ్యం మాత్రమే 40 శాతానికి పైగా దోహదపడుతుందని చెప్పారు.
ఇది ప్రపంచ అవసరాన్ని పెంచుతుందని తెలిపారు. అదుపులేని మానవ కార్యకలాపాలు గాలి, నీరు మరియు నేల కాలుష్యానికి దారితీశాయని ఆవేదన వ్యక్తంచేశారు. వన్యప్రాణులు, మానవ ఆరోగ్యం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని గుర్తుచేశారు. కమిషనర్, బీఈఈ ఆర్థిక సహాయంతో టీఎస్ రెడ్‌కో ద్వారా అమలు చేయబడిన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని కూల్ రూఫ్ పైలట్ ప్రాజెక్టును కూడా అభినందించారు. సుమారు 36,746 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వాతావరణ మార్పులను తట్టుకోగల మరియు ఇంధన సామర్థ్యం గల క్యాంపస్‌ను సృష్టించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రశంసించారు. దీని ద్వారా ఏటా 7 వేల కిలోవాట్ల ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేశామన్నారు.
నగరంలో ఇంథన సామర్ధ్య ఫలితాలు ఇలా
హైదరాబాద్ ఇంధన సామర్థ్య కార్యక్రమాల యొక్క స్పష్టమైన ఫలితాలను హైలైట్ చేస్తూ ఈఈఎస్ఎల్ కొన్ని వార్షిక ప్రయోజనాలను నివేదించింది. వాటిలో 238.83 మిలియన్ యూనిట్లు ఇంధన ఆదా చేసినట్లు తెలిపింది. ఇక గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో తగ్గింపులో భాగంగా 59.49 మెగావాట్లు తగ్గించినట్లు పేర్కొంది. దీనిద్వారా వార్షిక వ్యయ పొదుపు రూ. 193.45 కోట్లు మేర అయ్యిందని వెల్లడించింది. కార్బన్ ఉద్గారాలను 0.19 మిలియన్ టన్నులు తగ్గించామని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో ఈఈఎస్ఎల్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం 15.41 లక్షల వీధి దీపాలలో జీహెచ్ఃఎంసీ పరిధిలో 5.53 లక్షల ఎల్ఈడీ వీధి దీపాల రెట్రోఫిట్టింగ్‌ను పూర్తి చేసింది. పట్టణ పాలనను జాతీయ వాతావరణ లక్ష్యాలు, ప్రపంచ ఉత్తమ పద్ధతులు మరియు పౌర-కేంద్రీకృత సుస్థిరత ఫలితాలతో సమలేఖనం చేయడానికి తాము గట్టిగా కట్టుబడి ఉన్నామని జీహెచ్ఎంసీ పునరుద్ఘాటించింది.


