సాక్షి, హైదరాబాద్: ఓ మంత్రి ఇంటి వద్ద గలాబా.. ఓ నిందితులు ఎస్కేప్ కావడానికి సహకారం.. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం.. అందిన చోటల్లా ఆమ్యామ్యాలు... ఇలా వరుస వైఫల్యాలు, వివాదాలు, అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతూ సుప్తచేతనావస్థలో ఉన్న నగర పోలీసు విభాగం ప్రక్షాళనను కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ప్రారంభించారు.
సిటీ కాప్స్‌కు వెన్నెముక లాంటి టాస్‌్కఫోర్స్‌తో దీనికి శ్రీకారం చుట్టారు. ఇందులోని ఏడు బృందాల్లో పని చేస్తున్న 65 మందిని ఒకేసారి సిటీ ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగానికి అటాచ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సుదీర్ఘకాలంగా టాస్క్ ఫోర్స్‌లో పని చేస్తున్న వారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లూ ఉన్నారు. వీరి స్థానంలో తాత్కాలికంగా వివిధ ఠాణాల నుంచి 22 మంది కొత్తవారిని నియమించారు. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఎస్‌ఐలు, ఒక ఏఎస్‌ఐతో పాటు హెడ్–కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నారు.
సైబర్ క్రైమ్, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ ఇలా మిగిలిన విభాగాలనూ ప్రక్షాళన చేయడానికి కొత్వాల్ సన్నాహాలు చేస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరకు వివిధ హోదాల్లో పని చేస్తున్న వారి పూర్వాపరాలపై సమగ్ర విచారణ చేస్తున్నారు.
ఇప్పటికే 15 మంది ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు ఏసీపీల వ్యవహార శైలిపై సజ్జనర్‌కు నివేదికలు అందినట్లు సమాచారం. త్వరలోనే కమిషనరేట్‌లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్, సబ్–ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులను బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి ఏదైనా నేరం చేస్తే... ఆ నేరానికి సంబంధించి సాధారణ వ్యక్తులకు విధించే శిక్ష కంటే ఎక్కువ శిక్ష వేయాలి’ అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు పునరుద్ఘాటించిన అంశమిది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ పోలీసు కమిషనర్ సజ్జనర్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని ఏకంగా అరెస్టు చేస్తున్నారు. ఇటీవల రోజుల్లోనే ఇద్దరు కానిస్టేబుళ్లు కటకటాల్లోకి వెళ్లిన విషయం విదితమే.
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి తొలి ప్రతినిధిగా ఉండేది పోలీసులే. ఈ నేపథ్యంలో క్రమ శిక్షణ కలిగి ఉండాల్సిన విభాగాల్లో దీన్ని మొదటిదిగా పరిగణిస్తారు. ఈ అధికారులు, సిబ్బందికి ఎన్ని అధికారాలు ఉంటాయో.. విధి నిర్వహణ అంత సున్నితంగా ఉంటుంది. తమకు ఉన్న అధికారాలు, హోదా తదితరాలను దుర్వినియోగం చేస్తూ వివాదాస్పదమయ్యే వాళ్లూ ఎక్కువగానే ఉంటారు.
ఒకప్పుడు ఏ స్థాయి ఆరోపణలు వచ్చినా, వాటి తీవ్రత ఎలా ఉన్నా బదిలీ వేటు వేయడమో, హెడ్–క్వార్టర్స్‌కు ఎటాచ్ చేయడమో చేసేవాళ్లు. ఉన్నతాధికారులు చాలా వరకు మెమోలు, చార్జ్‌మెమోలు, సస్పెన్షన్ల వరకే వెళ్లేవాళ్లు. ఇది కొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయి అధికారులకు అలుసుగా మారింది. దీంతో ప్రస్తుత ఉన్నతాధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సివిల్ వివాదంల్లో తల దూర్చడం, మామూళ్ల వసూళ్లు తదితర అంశాల్లో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకు మించి తీవ్రమైన ఆరోపణలు వస్తే మాత్రం ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, ఏరియాపై పట్టులేకున్నా, ఏ స్థాయిలో కట్టు తప్పినా వేటు తప్పదని కొత్వాల్ సజ్జనర్ స్పష్టం చేస్తున్నారు.


