గతంతో పోలిస్తే నగరంలోని యువత కెరీర్ ఎంపికలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఒకప్పుడు పార్ట్‌టైమ్ పనిగా భావించిన ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో నూతన తరం యువతకు ప్రధాన కెరీర్ ఎంపికగా మారుతోంది. సిటీ లైఫ్‌స్టైల్, స్టార్టప్ కల్చర్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి.. ఇలాంటి అంశాలతో ఫ్రీలాన్సింగ్ కొత్త వృత్తి ప్రమాణంగా మారింది. ఓ వైపు ఐటీ, సాఫ్ట్‌వేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రొఫెషనల్ జాబ్స్ చేస్తున్న వారి సంఖ్య ఎప్పటిలానే పెరుగుతున్నప్పటికీ.. విభిన్నంగా ఆలోచిస్తూ తమ కెరీర్‌ను కొత్త పంథాల్లో రూపొందించుకుంటున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారికి ఫ్రీలాన్సింగ్ అనువైన వేదికగా మారింది. గచి్చ»ౌలి నుంచి కూకట్‌పల్లి వరకు.., జిమ్ ట్రైనర్లు, ఆర్టిస్టులు మొదలు., చెఫ్‌లు, రైటర్లు, డ్రైవర్లు, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్లు, డైటీషియన్లు, డిజైనర్లు వరకు అనేక రంగాల ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఫ్రీలాన్స్ వైపు మళ్లుతున్నారు. ‘‘నాకు టైమ్ ఫ్రీడం కావాలనే నిర్ణయంతోనే ఫ్రీలాన్స్ మోడ్ ఎంచుకున్నా అని చెబుతున్న వారి సంఖ్య ఎక్కవగా పెరుగుతోంది. ఇలా వ్యక్తిగత సమయానికి కట్టుబడి ఉండే ఈ జనరేషన్‌కు ఫ్రీలాన్సింగ్ సూట్ అవుతోంది.
ఫ్రీలాన్సింగ్ అనేది కేవలం ఐటీ లేదా మీడియా రంగాలకు పరిమితం కాదు. ఫిట్‌నెస్ వెల్‌నెస్ రంగంలో జిమ్ ట్రైనర్లు, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, స్పోర్ట్స్ థెరపిస్ట్‌లు భారీగా అవకాశాలు చూస్తున్నారు. హోమ్ ట్రైనింగ్, కార్పొరేట్ వెల్‌నెస్ వర్క్‌షాప్‌లు వీరి డిమాండ్‌ను పెంచాయి. ఫుడ్ రంగంలో ప్రైవేట్ చెఫ్‌లు, హోమ్ బేకర్లు, డైటీషన్లు వ్యక్తిగత కన్సల్టెన్సీ, పార్టీ క్యాటరింగ్, స్టార్టప్ ఫుడ్ ప్లానింగ్‌లో పనిచేస్తున్నారు. క్రియేటివ్ రంగంతో గ్రాఫిక్ డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు, బ్రాండ్ స్ట్రాటజిస్టులు, సోషల్ మీడియా మేనేజర్లు.. వంటివి ప్రస్తుతం హాట్ డిమాండ్‌లో ఉన్న వృత్తులు.
రీల్స్ కల్చర్, చిన్న బ్రాండ్‌ల పెరుగుదల, ఈకామర్స్ షూట్స్ ఈ రంగానికి బలం చేకూరుస్తున్నాయి. వీరితో పాటు టెక్ రంగంలో యూఐ/యూఎక్స్ డిజైనర్లు, వెబ్ డెవలపర్లు, యాప్ బిల్డర్లు, టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్లు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ క్లయింట్లతో ప్రాజెక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. హోమ్, లైఫ్‌స్టైల్ సరీ్వసుల్లో ఇంటీరియర్ డిజైనర్లు, బాల్కనీ గార్డెన్ స్పెషలిస్టులు, టెక్నీషియన్లు కూడా ఈ సరీ్వస్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అవకాశాలు పొందుతున్నారు.
ఫ్రీలాన్సింగ్ బూస్ట్‌కి ప్రధాన కారణాలు..
నగర యువత ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకోవడానికి కీలక కారణాల్లో ఒకటి టైమ్ ఫ్లెక్సిబిలిటీ. రాత్రిళ్లు పని చేయాలనుకున్నా, ఉదయమే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనుకున్నా.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సౌలభ్యం వీరికి ప్రధాన ఆకర్షణ. అలాగే క్రియేటివ్, స్కిల్‌బేస్డ్ కమ్యూనిటీలు హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్నాయి. కో వర్కింగ్ స్పేసెస్, ప్రొఫెషనల్ స్టూడియోలు, స్కిల్ మీట్‌అప్స్ వంటివి నెట్‌వర్కింగ్ అవకాశాలను పెంచుతున్నాయి.
స్టార్టప్‌లు కూడా తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనిని పొందేందుకు ఫ్రీలాన్సర్లకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. చిన్న ప్రాజెక్ట్‌లు, క్యాంపెయిన్‌లు, తాత్కాలిక పనుల కోసం ఫ్రీలాన్స్ మోడల్ సరిగ్గా సరిపోతుంది. చాలా మంది యువత ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం కోసం ఫ్రీలాన్స్ చేస్తూ నెలకు రూ.20–రూ.50 వేలు అదనంగా సంపాదిస్తున్నారు. ఇది కూడా ట్రెండ్ వేగంగా విస్తరించడానికి ముఖ్య కారణంగా మారింది.
తక్కువగా ఉన్న రంగాలు..
ప్రతి రంగంలో ఫ్రీలాన్స్ ఒకే విధంగా పనిచేయదు. హెల్త్‌కేర్ రంగంలో డాక్టర్లు, నర్సులు, థెరపిస్ట్‌లు చట్టపరమైన నియమాల కారణంగా స్వతంత్రంగా పనిచేయడం కష్టం. బ్యాంకింగ్ ఫైనాన్స్, బ్యాంక్ అధికారులుగా, ఆడిట్ విభాగాల్లో పనిచేసే వారికి ఫ్రీలాన్స్ అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఎయిర్‌లైన్ పరిశ్రమలో కేబిన్ క్రూ, టెక్నికల్ గ్రౌండ్ సిబ్బంది తదితరాలు సంస్థాధారిత ఉద్యోగాలే. మెయిన్‌స్ట్రీమ్ ఇంజనీరింగ్‌లో.. సివిల్, కెమికల్, మెటీరియల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు కంపెనీ ఆధారితంగానే నడుస్తాయి.
సిటీ లైఫ్‌స్టైల్‌లో ఫ్రీలాన్స్ ప్రభావం..
ఫ్రీలాన్సర్లు నగర ఆర్థిక వ్యవస్థలో సరికొత్త వర్గంగా నిలుస్తున్నారు. ఈవెంట్‌లు, బ్రాండింగ్ క్యాంపెయిన్‌లు, హోమ్ సరీ్వసులు, షార్ట్ ఫిల్మ్‌లు, స్టార్టప్ ఆపరేషన్స్.. ఇన్నింటిలో ఫ్రీలాన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. డిగ్రీ కంటే స్కిల్‌కు విలువ పెరుగుతున్న తరం ఇది. అందువల్ల యువత త్వరగా నూతన నైపుణ్యాలు నేర్చుకుని మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు.
ఫ్రీలాన్సింగ్ హైదరాబాద్ యువతకు కేవలం ప్రత్యామ్నాయ మార్గం కాదు.. స్వేచ్ఛ, స్కిల్స్, క్రియేటివిటీ, ఆధునిక సిటీ లైఫ్‌స్టైల్‌కి అద్దం పట్టే కొత్త కెరీర్ పంథా. విభిన్న రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ రాబోయే సంవత్సరాల్లో నగర ఉద్యోగ సంస్కృతిని మరింతగా మార్చే అవకాశం ఉంది.


