వండర్‌ బర్డ్స్‌..థండర్‌ కిడ్స్‌.. | Young Birders Month: Hyderabad Leads India’s First Birdwatching Fest for Children | Sakshi
Sakshi News home page

వండర్‌ బర్డ్స్‌..థండర్‌ కిడ్స్‌..

Nov 4 2025 9:59 AM | Updated on Nov 4 2025 12:34 PM

Young Birders Month 2025: Celebration of birds and

పక్షుల కిలకిలరావాలు చెవులకు ఎంత ఇంపుగా ఉంటాయో.. చిన్నారుల కేరింతలూ అంతే వినసొంపుగా ఉంటాయి. మరి చిన్నారులు, పక్షులు ఒకే చోట ఉంటే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో కదా. ఈ అందమైన ఊహను నిజం చేస్తోంది హైదరాబాద్‌ నగరానికి చెందిన మహిళ డైరెక్టర్‌గా ఉన్న వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్లు్యడబ్లు్యఎఫ్‌). ఈ నెలను యంగ్‌ బర్డర్స్‌ మంత్‌ (వైబీఎమ్‌)గా ప్రకటించడం ద్వారా పక్షులతో చిన్నారులకు అనుబంధాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టింది.  

నగరవాసి ఫరీదా తంపాల్‌ 1980లలో వ్యక్తిగతంగా పక్షుల వేటను ప్రారంభించారు. అలా అలా మరెందరో పక్షి ప్రేమికులకు మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తూ, డబ్లు్యడబ్లు్యఎఫ్‌ డైరెక్టర్‌గా మారారామె. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచేందుకు బర్డ్‌వాచింగ్‌ ఉపకరిస్తుందని ఇటీవలే అధ్యయనాలు వెల్లడించిన నేపధ్యంలో దేశంలోనే తొలిసారిగా చిన్నారుల కోసం బర్డ్‌ వాచింగ్‌ ఈవెంట్స్‌ను పరిచయం చేస్తూ వైబీఎమ్‌ను ప్రారంభించారు.  

వాచింగ్‌....విన్నింగ్‌... 
‘పక్షులు కనిపించడమే కాకుండా, అవి ప్రకాశవంతమైనవి, విభిన్నమైన కిలకిలలను, ధ్వనులను కలిగి ఉంటాయి. ఆసక్తికరమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తాయి. మానవులతో లోతైన ప్రకృతి అనుబంధాలను కలిగి ఉంటాయి. ప్రస్తుత పర్యావరణ పరిరక్షణ లేదా వన్యప్రాణుల రంగంలో నిమగ్నమైన వారిలో అత్యధికులు తమ ప్రయాణాన్ని పక్షులను చూడటంతోనే ప్రారంభించి ఉంటారు‘ అని ఫరీదా తంపాల్‌ అంటున్నారు.  
చిన్నారికి సిరి...ప్రకృతి దారి 
‘పక్షుల వీక్షణ అనేది చిన్నారులను సహజ ప్రపంచంలోకి ఆకర్షించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. ఎందుకంటే అవి వారిని ఆకట్టుకునేలా ఆసక్తికరమైన పనులు చేస్తాయి. పాడటం, నృత్యం చేయడం, తమ భాగస్వాములను ఎంచుకోవడం, గూళ్లను, ఇళ్ళు నిరి్మంచడం, ఇంకా ఎన్నో..’ అని చెప్పారామె.  పక్షుల ద్వారా పిల్లలను సహజ ప్రపంచానికి పరిచయం చేయడమే ఎర్లీబర్డ్‌ అనే 
సంస్థ ప్రాథమిక విధి. దీని కోసం విద్యా సామగ్రిని వృద్ధి చేయడం, ప్రకృతి విద్యావేత్తలకు శిక్షణ ఇవ్వడం ప్రకృతి సంబంధిత విద్యను ప్రోత్సహించడానికి ఔట్రీచ్‌ వంటివి నిర్వహిస్తోంది. అదే క్రమంలో ఎర్లీ బర్డ్‌తో కలిసి డబ్లు్యడబ్లు్యఎఫ్‌–ఇండియా నుంచి ఫరీదా, గరిమా సహా సభ్యులతో కూడిన ఆర్గనైజింగ్‌ కమిటీ వైబీఎమ్‌ను నిర్వహిస్తోంది. ఈ దేశవ్యాప్త కార్యక్రమం, మరింత మంది పిల్లలను మనోహరమైన పక్షుల ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుంది.  

నవంబర్‌ నెలే ఎందుకంటే... 
వైబీఎం ఈవెంట్‌కు నవంబర్‌ నెలనే ఎంచుకోవడం ఎందుకంటే... ఈ నెల దేశంలోని అనేక ప్రాంతాలలో వలస పక్షుల రాకకు ఊపునిస్తుంది. అంతేకాక ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జన్మదినం (నవంబర్‌ 12). అదే విధంగా బాలల దినోత్సవం (నవంబర్‌ 14) కూడా ఇదే నెలలో ఉన్నాయి కాబట్టి ఈ నెలను వైబీఎమ్‌ కోసం ఎంచుకున్నారు.  

వాక్స్, టాక్స్‌...మరెన్నో... 
వైబీఎంలో భాగంగా హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల బర్డ్‌ వాక్స్, ఆటలు, క్విజ్‌లు నిర్వహిస్తారు. నెల పొడవునా అనేక నడకలు, ఆటలు నేచర్‌ జర్నలింగ్‌ సెషన్‌లతో పాటు, పక్షుల నేపథ్య ఉత్సవాలు కూడా ఇందులో భాగంగా నిర్వహిస్తున్నారు. కథ చెప్పడం, పక్షి కవిత్వం నుంచి ప్రకృతి జర్నలింగ్, పక్షి పాట అనుకరణ పోటీ వరకు చిన్నారుల కోసం కార్యక్రమాలు ఉంటాయి, 

అలాగే పెద్దల కోసం, చలనచిత్ర ప్రదర్శనలు, పక్షుల గురించి చర్చలు  అవార్డు గెలుచుకున్న పక్షి ఛాయాచిత్రాల ప్రదర్శన ఉంటుంది‘ అని నిర్వాహకులు వెల్లడించారు.  డబ్లు్యడబ్లు్యఎఫ్, ఎర్లీ బర్డ్‌ ప్రస్తుత నెట్‌వర్క్‌లతో పాటు, ‘బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ, బర్డ్‌వాచర్స్‌ సొసైటీ (పశ్చిమ బెంగాల్‌)  గ్రీన్‌ హబ్‌తో సహా దేశవ్యాప్తంగా పకృతి విద్యపై పనిచేస్తున్న సంస్థలు వ్యక్తులు దీని కోసం చేతులు కలిపాయి. ‘ఇప్పటిదాకా వివిధ ప్రదేశాలలో దాదాపు 35 ఈవెంట్‌లు నిర్వహించాం. మరిన్ని ప్రణాళికలు కూడా ఉన్నాయి.’ అని తెలిపారు.  

బర్డ్‌ వాక్‌ 
ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలోని మోకిలాలో ఈ కార్యక్రమం ఉంటుంది. పక్షులను పసిగట్టడం దగ్గర నుంచి వాటిని పరిశీలించడం వరకూ పలు అంశాల్లో ప్రాథమిక అవగాహన కలి్పస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జరుగుతుంది.  

వెబినార్‌ 
ఈ నెల 9న నగరానికి చెందిన వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఎం.శ్రీరామ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు బర్డింగ్‌ యాప్స్‌ పరిచయం చేస్తారు. పక్షులు పర్యవేక్షణ, పరిరక్షణపై అవగాహన అందిస్తారు.  

ఎకో ఆఫ్‌ ది ఏవియన్‌ 
ఈ నెల 22న యువత, చిన్నారుల కోసం ఈ పేరుతో వినోద భరితంగా ఎకో ఆఫ్‌ ది ఏవియన్‌ పేరిట ఒక బర్డ్‌ కాల్‌ కాంటెస్ట్‌ నిర్వహిస్తారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ ఈ కార్యక్రమం ఉంటుంది.  

నగరంలో 8న కార్యక్రమం...
దేశంలోనే తొలిసారిగా చిన్నారుల కోసం ప్రత్యేకించిన ఒక యంగ్‌ బర్డర్స్‌ మంత్‌ను నిర్వహిస్తున్నాం. పక్షులు, ప్రకృతిపై అవగాహన పెంచేలా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉంటుంది. నగరంలో ఈ నెల 8వ తేదీన తొలి ఈవెంట్‌ మోకిలాలో జరుగుతోంది. మరిన్ని వివరాలను మా సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 
– ఫరీదా, డైరెక్టర్, వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement