ఎవరీ రీసైకిల్‌ కింగ్‌ కరణ్‌? ఏకంగా 400 టన్నుల.. | Karan Kumar: Delhi teen transforms waste into hope: 450 tonnes recycled | Sakshi
Sakshi News home page

ఎవరీ రీసైకిల్‌ కింగ్‌ కరణ్‌? ఏకంగా 400 టన్నుల..

Dec 19 2025 5:58 PM | Updated on Dec 19 2025 7:01 PM

Karan Kumar: Delhi teen transforms waste into hope: 450 tonnes recycled

ఢిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కరణ్‌ తన ‘ఫినోబాదీ’ స్టార్టప్‌ ద్వారా 450 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేశాడు. 3,318 మొక్కలను నాటాడు. డైబ్భై మందికి పైగా కార్మికులకు స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని కల్పిస్తున్నాడు...

‘స్టెబిలిటీ–క్లారిటీ–డిగ్నిటీ’ నినాదంతో ‘ఫినోబాదీ’ అనే రీసైకిలింగ్‌ కంపెనీని ప్రారంభించాడు కరణ్‌ కుమార్‌. కరణ్‌ తండ్రి అయిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆస్తిపాస్తులు లేవు. కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషించాడు. ‘నాన్నకు చదువు లేదు. ఆస్తి లేదు. అయినా సరే ఏదో రకంగా జీవనోపాధిని సృష్టించుకోగలిగాడు. ఇది చూసిన తరువాత శూన్యం నుంచి అవకాశాన్ని సృష్టించుకోవచ్చు’ అనే విషయాన్ని నేర్చుకున్నాను అంటాడు కరణ్‌.

ఎందుకు? ఏమిటి? ఎలా?
రకరకాల గాడ్జెట్స్‌కు సంబంధించి  ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆసక్తి కరణ్‌లో ఉండేది. అవి ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోవాలనుకునేవాడు. చేతికి దొరికిన ప్రతి గ్యాడ్జెట్‌ను విడదీసి, తిరిగి వాటిని యథాతథ స్థితిలోకి తీసుకువచ్చేవాడు. ఇది సరదా కోసం చేసిన పని కాదు. 

వాటి అంతర్గత పనితీరు తెలుసుకోవడానికి చేసింది. ఏదైనా గ్యాడ్జెట్‌ పనిచేయకపోతే దాన్ని బాగు చేసి పనిచేసేలా చేసేవాడు. దీంతో ఇరుగు పొరుగు వారు రిపేర్‌ పని ఏదైనా ఉంటే కరణ్‌ దగ్గరికి వచ్చేవారు. పాకెట్‌ మనీకి కరణ్‌కు లోటు ఉండేది కాదు.

నేర్చుకున్న తొలిపాఠం
కోవిడ్‌ టైమ్‌లో తండ్రి వర్క్‌షాప్‌ మూతబడడంతో తమ్ముడితో కలిసి చిన్నపాటి ‘డోర్‌–టు–డోర్‌ మిల్క్‌ డెలివరీ సర్వీస్‌’ ప్రారంభించాడు కరణ్‌. అయితే దీంతో నష్టమే తప్ప లాభం రాలేదు. ‘వ్యాపారం అనేది సమస్యను పరిష్కరించేలా ఉండాలి. సమస్యను కొని తెచ్చుకునేలా ఉండకూడదు అనే పాఠాన్ని ఆ అనుభవం నుంచి నేర్చుకున్నాను’ అంటాడు కరణ్‌.

ఇంటర్మీడియెట్‌ చేస్తున్నప్పుడు దిల్లీ ప్రభుత్వ భాగస్వామ్యంతో, ఉద్యమ్‌ లెర్నింగ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘ఉద్యమ్‌ శిక్ష’ అనే కార్యక్రమంలో చేరాడు కరణ్‌. నిజజీవిత సమస్యలు పరిష్కరించడానికి విద్యార్థులకు ఉపకరించే శిక్షణా కార్యక్రమం ఇది.

‘ఉద్యమ్‌ శిక్షలో చేరిపోవడం నా జీవితాన్ని మార్చేసింది. నేను కొత్త వారితో మాట్లాడేవాడిని కాదు. మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడిని. అయితే ఉద్యమ్‌ శిక్ష నాలోని బెరుకును పోగొట్టింది. బయటకు వెళ్లి ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోమని చెప్పింది. ఈ క్రమంలోనే నాలో చిన్నగా ఆత్మవిశ్వాసం మొదలైంది’ అంటాడు కరణ్‌.

ఫిన్‌ ప్లస్‌ కబాదీ
ఢిల్లీలో చెత్తకుప్పల సమస్య తీవ్రంగా ఉండేది. చెత్తకుప్పలను కాల్చడం వల్ల విషపూరిత పొగలు విడుదలయ్యేవి. ఇది చూసి షాక్‌ అయ్యాడు కరణ్‌. ఈ చెత్త కుప్పలను కాల్చడం ద్వారా విషవాయువులు విడుదలవుతాయి అనేది ఒక కోణం అయితే, మరో కోణం వాటిని పునర్వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోవడం. 

సమస్య తీవ్రతను తెలుసుకోవడానికి కబాదీవాలాస్‌(స్క్రాప్‌ డీలర్లు)తో మాట్లాడాడు కరణ్‌. వారి పని విధానం ఎలా ఉంటుందో, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో తెలుసుకున్నాడు. ‘విలువ లేని వస్తువులను విలువైన వస్తువులుగా మారుస్తాం’ అని వారు చెప్పిన మాట కరణ్‌ను ఆకట్టుకుంది. వారి మాటల స్ఫూర్తితో ‘ఫినోబాదీ’ పేరుతో రీసైక్లింగ్‌ కంపెనీ మొదలు పెట్టాడు కరణ్‌. ఫిన్‌ (ఫైనాన్స్‌), కబాదీ(స్క్రాప్‌) అనే రెండు మాటలు ఒక దగ్గర చేర్చి తన కంపెనీకి ‘ఫినోబాదీ’ అనే పేరు పెట్టాడు.

ఆ మొక్కలు లక్ష్యాన్ని గుర్తు తెస్తాయి
స్కూలు ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీలోని చంచల్‌ పార్క్‌లో పునర్వినియోగపరచదగిన వస్తువులను సేకరించడం మొదలుపెట్డాడు కరణ్‌. అయితే వారు పనికొస్తాయనుకున్న వస్తువులలో పనికిరాని వస్తువులే ఎక్కువ! ‘ఈ అనుభవంతో ప్లాస్టిక్, మెటల్, పేపర్‌కు సంబంధించి సూక్ష్మస్థాయిలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఏ వస్తువు పనికొస్తుంది, ఏది పనికి రాదు అనే విషయంలో స్పష్టత తెచ్చుకున్నాం’ అంటాడు కరణ్‌. ఉద్యమ్‌ లెర్నింగ్‌ ఫౌండేషన్‌ ‘బిజినెస్‌ బ్లాస్టర్స్‌ ప్రోగ్రాం’ ద్వారా సీడ్‌ క్యాపిటల్‌ సంపాదించాడు.

కంపెనీ పేరుతో వెబ్‌సైట్‌ ప్రారంభించాడు. యాప్‌ తీసుకువచ్చాడు. గల్లీలో మొదలైన ‘ఫినాబాదీ’ ఢిల్లి అంతటా విస్తరించింది. నోయిడా, గురుగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. వంద కిలోల వ్యర్థాలను రీసైకిల్‌ చేసిన ప్రతిసారి ఒక మొక్క నాటడం సంప్రదాయంగా చేసుకుంది ఫినోబాదీ. ‘మనం ఈ పని ఎందుకు చేస్తున్నామో ఆ మొక్క గుర్తు తెస్తుంది’ అంటాడు కరణ్‌ కుమార్‌.

(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్‌లు..! అతడి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌​ ఏంటంటే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement