మనం పీల్చే ప్రాణవాయువు కొంచెం కొంచెంగా మన ప్రాణాన్ని తోడేస్తున్నదంటే నమ్మబుద్ధి కాదు. ఈ సంగతి కొన్ని దశాబ్దాలుగా తెలుస్తూనే ఉన్నా ప్రతి ఏటా దేశ రాజధాని పౌరులు చలికాలం ఉన్నన్నాళ్లూ శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఏటికేడాదీ అది తప్పడం లేదు. కాకపోతే శీతకాలంలో మాత్రమే మన వ్యవస్థలన్నీ మేల్కొంటాయి.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలూ, ప్రభుత్వాల నియమ నిబంధనలూ, విపక్షాల విమర్శలూ, సామాన్యుల అరణ్య రోదనలూ... అన్నీ అప్పుడే! బీసీసీఐ సైతం దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయన్న సంగతే మరిచి ఇదే సీజన్‌లో ఢిల్లీలో, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో క్రికెట్ సంబరాల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది.
ఈసారి కూడా రివాజు తప్పకుండా ఇవన్నీ ఒకదాని వెంబడి మరోటి సాగుతున్నాయి. పొగమంచు కమ్మేస్తున్న పర్యవసానంగా ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మంది ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మొదలైంది. ఉద్యోగులు సొంత వాహనాల్లో కాక, ‘కార్ పూలింగ్’ ద్వారా వచ్చేలా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
రాజధాని వెలుపల రిజిస్టరై, బీఎస్–4 ప్రమాణాలు లేని వాహనాల రాకపోకల్ని నిషేధించారు. కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ లేని వాహనాలకు ఇంధనం విక్రయించరాదంటూ పెట్రోల్ బంకులకు ఆదేశాలు పోయాయి. 16 రోజుల పాటు అమల్లో ఉండేలా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 విధించారు.
ఈ సమయమంతా నిర్మాణ పనులు నిలిచిపోవాలి. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాలను అనుమతించబోరు. ఇవి 12 లక్షల వరకూ ఉంటాయని లెక్కేస్తున్నారు. మొత్తంగా ఉండే కోటిన్నర వాహనాల్లో ఇవి ఏపాటి? నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులు ఆంక్షల కారణంగా పనులు కోల్పోతే రూ. 10,000 చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అలా నమోదైన వారు కేవలం 2.57 లక్షలమంది మాత్రమే.
ఇంతకు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారని అంచనా. ఇవన్నీ మెచ్చదగ్గ చర్యలే. కానీ అసలు ఢిల్లీ సవ్యంగా ఉన్నదెప్పుడు? ఇటీవలికాలంలో అది నిరంతరం కాలుష్యంలోనే మునిగి తేలుతోంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధాంశాలన్నట్టు ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కేంద్రీకృత నగర వ్యవస్థల వల్లనే ఈ అవస్థలన్నీ దాపురిస్తున్నాయని తెలిసినా వాటిని మానుకోవడం లేదు.
ఢిల్లీలో వాయునాణ్యత అతి తీవ్ర స్థాయిలో... అంటే సగటు వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) 400కు మించి ఉన్నదని తేలింది. ఇది వరుసగా మూడు రోజులుండగా, ఆ తర్వాత అది ‘దయనీయ స్థితి’(వెరీ పూర్)కి... అంటే ఏక్యూఐ 300–400 పరిధిలో కొచ్చింది. కాలుష్యం గురించి దీపావళి పండుగకు ముందో, పంజాబ్‌లో పంట కోతల సమయంలోనో గుర్తుకురావటం వల్లే ఈ సమస్యంతా!
కొన్నాళ్లపాటు మొత్తంగా టపాసులు కాల్చటానికి వీల్లేదని నిషేధం విధిస్తే ‘మా పండుగకే ఇలాంటివి గుర్తొస్తాయా?’ అనే తర్కం తలెత్తదు. బ్యాంకుల ద్వారా వాయిదాల్లో వాహనాల కొనుగోలును కొన్నాళ్లు ఆపేస్తే ఇంత చేటు కాలుష్యం ఉండదు. అసలు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ఠం చేస్తే అత్యధికులు వాహనాల జోలికిపోరు. పరిశ్రమలు వెదజల్లుతున్న ఉద్గారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటే కాలుష్య భూతం అదుపులో ఉంటుంది.
ఇవన్నీ పట్టన ట్టు నవంబర్– జనవరి మధ్య క్రికెట్ మ్యాచ్‌లకు బీసీసీఐ ఉత్తరాదిని ఎంచుకుని నగుబాటు పాలవుతోంది. లక్నోలో వాయునాణ్యత 400 మించటంతో శుక్ర వారం జరగాల్సిన మ్యాచ్‌ను రద్దుచేశారు. ఇప్పుడే కాదు... 2017లో ఢిల్లీలో భారత– శ్రీలంక మ్యాచ్ సమయంలో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఆటగాళ్లకు శ్వాసకోశ సమస్య లొచ్చాయి. కొందరైతే ఆడుతూ వాంతులు చేసుకున్నారు.
2019లో భారత–బంగ్లా మ్యాచ్ సమయంలోనూ ఇంతే! రెండేళ్ల క్రితం బంగ్లా–శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ చివరి నిమిషంలో రద్దయింది. కనీసం ఈ సమయంలోనైనా దక్షిణాదిని ఎంచుకుందా మని బీసీసీఐకి తోచదు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తించకుండా ప్రభుత్వ విభాగా లన్నీ సమన్వయంతో పనిచేస్తే, ఏడాది పొడవునా అమలయ్యే చర్యలుంటే ఢిల్లీ కాస్త యినా మెరుగుపడుతుంది. కాలుష్య భూతాన్ని నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుంది.


