భారత బీమా రంగంలో విదేశీ సంస్థలు పూర్తి స్థాయిలో ప్రవేశించటానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ విషయంలో రెండు దశాబ్దాలుగా ఎడతెగకుండా సాగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కివచ్చాయి. ‘సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా’ పేరిట పార్లమెంటులో రంగప్రవేశం చేయబోతున్న బీమా చట్టాల సవరణ బిల్లు... 1938నాటి బీమా చట్టానికీ, 1956నాటి జీవితబీమా కార్పొరేషన్ చట్టానికీ, 1999 నాటి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) చట్టానికీ సమూలమైన మార్పుల్ని ప్రతిపాదిస్తోంది.
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ప్రస్తుతం వున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచటానికి ఈ బిల్లు అనుమతిస్తోంది. కేంద్రంలో పాలకులెవరైనా, వారి రాజకీయ విశ్వాసాలూ, నాయకత్వం వహిస్తున్న కూటములూ ఏవైనా ఎఫ్‌డీఐను పూర్తి స్థాయిలో అనుమతించాలన్న విషయంలో అందరిదీ ఒకటే స్వరం.
బీమా రంగంలో విదేశీ సంస్థలకు తలుపులు బార్లా తెరవాలని సంపన్న దేశాల నుంచి ఎప్పటినుంచో ఒత్తిళ్లు ఉన్నాయి. మన బీమా రంగంలో ప్రైవేటు సంస్థలున్నా సామాన్య పౌరులు పబ్లిక్ రంగ సంస్థ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)ను విశ్వసించిన స్థాయిలో వాటిని నమ్మరు. అందుకే మార్కెట్‌లో ఇప్పటికీ దాని భాగస్వామ్యం దాదాపు 65 శాతం.
అలాగని చొరవగా దూసుకెళ్లటంలో అదింకా వెనకబడి వున్నదనీ ఆర్థిక రంగ నిపుణులంటారు. పోటీ పెరిగితే ఇది మారుతుందనీ, వినియోగదారులు లాభపడతారనీ వారి వాదన. మన జీవిత బీమా రంగం వాటా జీడీపీలో 3.2 శాతం. వాస్తవానికి ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరింత కిందకు పోయి 2.8 శాతం దగ్గర ఆగింది. విదేశాల్లో ఈ రంగం వాటా 6.5 శాతం.
విదేశీ సంస్థలను అనుమతించటాన్ని వ్యతిరేకించేవారు అవి లాభార్జన దృష్టితో ఉంటాయని విమర్శిస్తారు. దేశీయ పొదుపు దేశాభివృద్ధికి కాక విదేశీ సంస్థలకు పోతుందని... పేదరికం ప్రబలంగా ఉన్న మనలాంటి దేశంలో సంక్షోభ కాలంలో ఆసరాగా నిలబడకపోతే ఎలా అన్నది వారి ప్రశ్న. అనుకున్నట్టు లాభాలు రాకపోతే సంస్థలు దివాలా తీసే, నిష్క్రమించే అవకాశం ఉండదా అనే సందేహాలున్నాయి.
ఐఆర్‌డీఏఐ వంటి నియంత్రణ సంస్థ ఉండగా ఆ భయాలు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం డేటా చౌర్యం కూడా సమస్యే! ప్రైవేటు సంస్థల్లో తగిన నియంత్రణ లేని కారణంగా ఖాతాదారుల డేటా బయటకు పోతోందని, అందువల్ల మోసగాళ్ల బెడద ఎక్కువైందని బీమా రంగాన్ని ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకించే సంస్థలు ఆరోపిస్తున్నాయి.
2047కల్లా పౌరుల్లో ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం చేరాలన్నది ఐఆర్‌డీఏఐ లక్ష్యం. అలాగే ఆరోగ్యం, ఆస్తి తదితరాలకు సైతం బీమా చేయించుకునేలా ప్రచారం చేయాలని ఆ సంస్థ కంకణం కట్టుకుంది. విదేశీ సంస్థల్ని అనుమతించటానికి చాన్నాళ్లుగా మన ప్రభుత్వాలు హైరానా పడుతున్నాయి. తొలిసారి వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1999లో ఐఆర్‌డీఏఐ చట్టాన్ని తీసుకొచ్చి ఆ రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలకు తొలిసారి అనుమతించింది.
ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, 2004లో తన నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రాగానే దాన్ని 49 శాతానికి పెంచే ప్రయత్నం చేసింది. అప్పట్లో యూపీఏకు బాసటగా ఉన్న వామపక్షాలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. కారణం ఏమైతేనేం ఈ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. వారితోపాటు విపక్షంలోఉన్న బీజేపీ సైతం గట్టిగా వ్యతిరేకించింది.
కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకొచ్చిన వెంటనే పాత ప్రతిపాదన దుమ్ము దులిపింది. ఏడాదికల్లా దాన్ని 49 శాతానికి, మరో ఏడేళ్లకు 74 శాతానికి విస్తరించింది.
బీమా సంస్థల్లో విదేశీ భాగస్వాముల వాటా పరిమితమే గనుక భయాందోళనలు అనవసరమని ఇన్నాళ్లూ ప్రభుత్వాలు చెబుతూవచ్చాయి.
ఇప్పుడది 100 శాతానికి చేరింది గనుక తగిన జాగ్రత్తలూ, నియంత్రణలూ అవసరం. బిల్లు పార్లమెంటు పరిశీలనకొచ్చినప్పుడు, అందులోని లోటుపాట్లేమిటో, ఇంకా చేయాల్సిందేమిటో చెప్పగలిగే దిశగా ఆరోగ్యవంతమైన చర్చ జరగాలి. దేశీయ పొదుపు కాస్తా అన్యుల చేతుల్లోపడితే, వారు సక్రమంగా నిర్వహించటంలో విఫలమైతే సామాన్యులకు తీరని నష్టం కలుగుతుంది.


