కుందవరపు చౌడప్ప పేరు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమే. ‘నీతులకేం కానీ, బూతాడక పోతే దొరకు నవ్వు పుట్టదు ధరలో’ అంటాడాయన. ‘సభలో పది నీతులూ, పది బూతులూ ఉన్న పద్యాలు చెప్పినవాడే అధికు’డంటూ నీతినీ, బూతునూ ఒకే గాటన కట్టిన తెంపరి ఆయన. అక్షరాన్ని సాక్షాత్తు ‘సరస్వతి’గా ఉపాసించారు కనుకనే పూర్వులు రచనను ‘సారస్వత’ మన్నారు.
అలా అక్షరాన్ని పవిత్రంగా భావించేవారెవరైనా బూతు రాతలో రోతనే తప్ప నీతినీ, నవ్వునూ చూడలేరు. ఒకానొక విశ్వవిద్యాలయంలో తోటి ఆచార్యుని చర్మరోగాన్ని ఆక్షేపిస్తూ ఏకంగా పద్యాలే రాసి తనకు అబ్బిన పద్యవిద్యను బురదగుంటలో పొర్లించిన ఇటీవలి ఆచార్య పుంగవులూ లేకపోలేదు కానీ, తెలుగు సాహిత్యం అదృష్టం కొద్దీ బూతుకవిగా చౌడప్ప ఒక్కడే చరిత్ర కెక్కాడు.
ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా బూతుల బుంగల్ని సృష్టించి సామాజిక మాధ్యమాలు ఆ హేయచరిత్రకు వేల సంఖ్యలో కొత్తపుటలు జోడిస్తున్నాయి. నిజానికి మాధ్యమాలు సామాజికీకరణ చెందడం ఎంతైనా స్వాగతించదగినదే; అందువల్ల తమ భావాలను ఇతరులతో పంచుకునే అవకాశం కొత్తకొత్త వర్గాలకు అందు బాటులోకి వచ్చింది. దాంతోపాటే అవి అసభ్యతా, అశ్లీలం, బూతు, వ్యక్తిగతమైన వేధింపు వగైరాల రూపంలో చెప్పలేనంత మురికినీ తెప్పలుగా పారిస్తున్నాయి.
డ్రైనేజీ స్కీములేక అది డేంజర్‌గా మారుతోంది. కాకపోతే, మనందరికీ తెలిసిన ‘బూతు’లాంటి మోటు మాటలతో కాకుండా ఎక్కువమందికి తెలియని ‘ట్రోలింగ్’ అనే నాజూకు పేరుతో ఇది చలామణీ అవుతోంది. స్కాండెనేవియా జానపద కథల్లోని రాక్షసులు, మరుగుజ్జు ల్లాంటి జగడాలమారి, అసాంఘిక శక్తులను సంకేతించడంతో ప్రారంభించి, చేపలకు వేసే ఎర వరకూ పదిహేనో శతాబ్ది నుంచి రకరకాల అర్థాల్లో వాడుతూ వచ్చిన ఈ ‘ట్రోల్’ అనే మాట ఇప్పుడు రకరకాల అసహ్యార్థాలలో అంతర్జాల సంస్కృతిలో స్థిరపడింది.
భారతీయ సమాజంలో తిట్టుకూ, బూతుకూ స్త్రీలనే లక్ష్యం చేసుకోవడం మొదటి నుంచీ ఉన్నదే. సామాజిక మాధ్యమాలు ఇందుకు కొత్తగా అందివచ్చిన రొచ్చుబండ లయ్యాయి. అక్కడక్కడ స్వయంగా మహిళలూ ఇందులో భాగస్వాములవడం ఈ అధః పతనంలో కొత్త లోతు. సహజంగా స్త్రీల నుంచే దీనిపట్ల తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. బూతులకు, వేధింపులకు గురవుతున్న కొంతమంది మహిళా యూట్యూబర్లు ఈ మధ్య ఒక పోలీస్ ఉన్నతాధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు.
అయినా దీనికి అడ్డుకట్టపడే సూచన కానీ, పడుతుందన్న ఆశకు ఆస్కారం కానీ కనిపించడం లేదు. ఫేస్‌బుక్ మాధ్యమంలో చురుగ్గా పనిచేస్తున్న ఒక గ్రూపు తన వంతుగా రంగంలోకి దిగి దీనిపై ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి, కొన్ని సందేశాత్మక వీడియోలను ప్రచారంలోకి తెచ్చింది.
అయితే, సమస్య ఎన్నో శక్తుల భాగస్వామ్యంతో లోతుగా వేళ్లూనుకున్న స్థితిలో పై మెరుగుల చర్యల వల్ల ఫలితముంటుందా అన్న ప్రశ్నా ఎదురవుతుంది. ఉదాహరణకు, మహిళలు విద్యా, ఉద్యోగాల్లోనే కాక, ఆ యా సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలమవ డాన్ని కంటగించుకునే సాంప్రదాయిక శక్తులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తమ అసహనాన్నీ, అక్కసునూ వెళ్ళగక్కుతున్నాయి.
ఇంకోవైపు, వివిధ భావ జాలాల మధ్య ఘర్షణ పతాకస్థాయికి చేరుకున్న నేటి దేశీయ వాతావరణంలో వాటికి నాయకత్వం వహించే రాజకీయ పక్షాలు సాంప్రదాయిక మాధ్యమాలకు అదనంగా సామాజిక మాధ్యమాలనూ యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. అధికార బలంతోపాటు అర్థబలం, అంగబలం దండిగా ఉన్న శక్తులు ఈ బూతులూ, తిట్ల పంచాంగాన్ని వ్యవస్థీకృతం చేసి తెర వెనుక నుంచి నడిపిస్తున్న సూచనలూ పొడగడుతున్నాయి.
దేవుళ్ళూ, మతమూ, సంస్కృతీ, సభ్యతా, సంస్కారాలతో సహా మనవనుకునే అన్ని టినీ ఆకాశానికెత్తే నోళ్లే బూతులూ, అశ్లీలాల మురికిని పుక్కిలించడం ఈ మొత్తంలో ఒక అపహాస్యభరితమైన అతిపెద్ద వైరుద్ధ్యం. తమవైన వ్యవస్థలకూ, విలువలకూ తమ చేతులతోనే చెరుపుకోలేనంత మసీ, మకిలీ అంటించి చెరుపు చేస్తున్నామన్న స్పృహ కూడా లోపించిన పరిస్థితి. అన్ని తేడాలకూ అతీతంగా అందరూ ఒక్కటై కడతేర్చవలసిన సామాజిక రుగ్మతగా గుర్తించడమే దీనికి ఏకైక పరిష్కారం.


