నెలలు గడుస్తున్నా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం కట్టలు తెంచుకున్నట్టు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్‌తోపాటు, దానికి దన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పార బడుతున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతున్నదనీ, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయనీ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు.
వైరి పక్షాలు ఎటూ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదోమేరకు తగ్గేలా చేయటం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ఠ ఉండాలి. ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాకు ఆ రెండూ తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవటం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించటం కారణం.
జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు ఉక్రెయిన్‌ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులయి యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది.
ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిందనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరనీ తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే ఉక్రెయిన్ లేదు. కానీ ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి ఉక్రెయిన్ మర్చిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు.
నిజానికి 2022లో ఉక్రెయిన్‌కూ, ఆయనకు మద్దతునిస్తున్న యూరప్ దేశాలకూ బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటాననీ, నాటోలో చేరబోననీ హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది.
యూరప్ నుంచి కూడా దీనిపై హామీ కావాలని కోరింది. అప్పటికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటీన ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చజెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవపాత్ర పోషించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండికేస్తున్నారు.
ఆయనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. భారత్ వచ్చేముందు ఈ సంగతి నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలగితే సరే... లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు.
వైరిపక్షాలు చర్చలంటూ మొదలుపెడితే వాటి వైఖరులు ఏదోమేరకు చల్లారుతాయి. కానీ ఆ చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి రష్యా ప్రతిపాదనలకు అంగీకరించమంటూ ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది.
ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యంలేని యూరప్ దేశాలు... ట్రంప్‌ను ఖాతరు చేయొద్దని ఉక్రెయిన్‌కు నూరిపోస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే, అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఉక్రెయిన్ ఈ దశలోనైనా గుర్తెరగాలి. దీన్నుంచి బయటపడాలంటే సొంత గొంతు వినిపించటం ప్రారంభించాలి.


