ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకుంటున్నా నిర్లిప్తంగా, నిమిత్తమాత్రంగా మిగిలిపోతున్న వ్యవస్థలున్నచోట మరో ఘోరం జరిగిపోయింది. గోవాలోని అర్పోరా గ్రామ సమీపంలో ఆదివారం వేకువజామున ఒక నైట్ క్లబ్‌లో చెలరేగిన మంటల్లో చిక్కు కుని, పొగతో ఊపిరాడక 25 మంది కన్నుమూశారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
రెండేళ్లుగా ఎలాంటి అనుమతులూ, లైసెన్సులూ లేకుండా అక్కడ వ్యాపారం సాగు తున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వం ఇప్పుడు సంతాపం ప్రకటించి, నష్టపరిహారం వాగ్దానం చేసింది. ఈ క్లబ్ నిర్మాణాన్ని గ్రామ పంచాయతీ సకాలంలో పసిగట్టి 2023 డిసెంబర్‌లో నోటీసులు జారీచేసింది. పర్యావరణపరంగా అది అత్యంత సున్నితమైన ప్రాంతం గనుక అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరపరాదని తెలిపింది. 2024 ఏప్రిల్‌లో దాన్ని కూల్చేయాలంటూ నోటీసులిచ్చింది. అటుతర్వాత ఏం జరగాలో అదే జరిగింది. స్థల యజమాని పంచాయతీరాజ్ డిప్యూటీ డైరెక్టర్ వద్ద అప్పీల్ చేశాడు. ఆ వెంటనే స్టే జారీ అయింది. మొన్న ఆగస్టులో బీజేపీ సభ్యుడు సంకల్ప్ అమోంకర్ దీన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ఉప్పు మడులు, పంటపొలాలు ఉన్నచోట యథేచ్ఛగా, చట్టవిరుద్ధంగా నైట్ క్లబ్‌లు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ జరిగిందేమీ లేదు. అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అంటున్నారు. మంచిదే. కానీ శాసనసభలో ప్రస్తావనకొచ్చి మూణ్ణెల్లు దాటుతున్నా చేసిందేమిటి?
మంటలు ఆర్పడానికొచ్చిన అగ్నిమాపక వాహనాలు 400 మీటర్ల అవతలే నిలిచి పోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఊహించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకున్నా చాలాసేపు నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది.
శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో డీజేల హోరుమధ్య బెల్లీ డ్యాన్స్ కార్యక్రమం సాగు తుండగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో బాణాసంచా కాల్చడం, అలంకరణ కోసం పైకప్పుపై వెదురు, ఫైబర్, గడ్డి వగైరాలతో చేసిన నిర్మాణంపై ఆ నిప్పు రవ్వలు పడటం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఆ సమయానికి బయటకు పోయేందుకు ఉన్న ఒకే ఒక తోవ ఇరుగ్గా ఉండటంతో బయటపడటం కష్టమైందనీ, దాంతో కొందరు బేస్‌మెంట్‌వైపున్న మెట్లు దిగార నీ, అటు వెళ్లినవారంతా దట్టమైన పొగ వ్యాపించటంతో ఊపిరాడక చనిపోయారనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. క్లబ్ నిర్మించాక అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు దాన్ని సందర్శించి ఉంటే ఇలాంటి విషాదాన్ని ముందే ఊహించేవారు. ఎక్కడెక్కడ వెలుపలికి పోయే మార్గాలుండాలో, మంటలు ఆర్పటానికి తోడ్పడే పరికరాలను ఎక్కడ అందుబాటులో ఉంచాలో సూచించేవారు.
మంటల కారణంగా విద్యుత్ నిలిచిపోయాక ఆ ప్రాంతమంతా గాఢాంధకారం అలుము కుని తొక్కిసలాట చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గోవాలో క్లబ్‌ల కొచ్చేవారిలో అత్యధిక శాతం యువత. విదేశీయులతోపాటు వేర్వేరు రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారు వారాంతంలో బృందాలుగా గోవాకు వస్తుంటారు. ఎంతో బంగారు భవిష్యత్తుగల ఈ యువత కారణంగా కోట్లాది రూపాయల వ్యాపారం సాగించే క్లబ్‌లు కనీస రక్షణ చర్యలు తీసుకోవటంలో విఫలం కావటం, పన్నుల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ప్రభుత్వం కూడా పట్టనట్టు వ్యవహరించటం దుర్మార్గం. ఇలాంటి క్లబ్బుల్లో అడపా దడపా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఉదంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బయటపడుతున్నాయి. అయినా ముందు జాగ్రత్తలు లేవు.
పాశ్చాత్య విష సంస్కృతిని అరువు తెచ్చుకుని వ్యాపారం సాగించటం ఈ బాపతు క్లబ్బుల బతుకుతెరువు. మద్యం ఏరులై పారే, జూదం చోటుచేసుకునే ఇలాంటి వాటిని నడవనీయరాదన్న ఉన్నతాశయం ప్రభుత్వాలకు ఎటూ ఉండటం లేదు. కనీసం వాటిని నియంత్రించటమైనా తమ బాధ్యతగా భావించకపోవటం విషాదకరం. క్లబ్బులే కాదు... ఆకాశాన్ని తాకే భవంతులు సైతం ఎలాంటి ప్రమాణాలూ పాటించకుండానే నిర్మాణ మవుతున్నాయి. అసలు మన దేశంలో అగ్నిమాపక వ్యవస్థ అత్యంత నాసిరకమైనది. అగ్నిమాపక కేంద్రాలు తక్కువ. అక్కడి సిబ్బంది వాడే పరికరాలు, వాహనాలు చాలా భాగం కాలం చెల్లినవి. కనీసం తాజా ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపిస్తుందా? ఆ రంగం సమూల ప్రక్షాళనకు పురిగొల్పుతుందా?


