గ్రామీణ ప్రాంతాల్లో కాయకష్టం చేయగలిగేవారికి ఏడాదికి కనీసం వంద రోజుల పని దినాలు కల్పించేందుకు ఇరవయ్యేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కనుమరుగు కావటానికి రంగం సిద్ధమైంది. దాని స్థానంలో తీసుకురాదల్చిన ‘వికసిత భారత్ రోజ్‌గార్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ–జీ రాం జీ) బిల్లు పార్లమెంటులో రంగప్రవేశం చేసింది.
అమలులో ఉన్న పథకం కన్నా ఇది అనేక రెట్లు మేలైనదని కేంద్రం చెబుతోంది. ఆ మాటెలా ఉన్నా ప్రతి పథకమూ హిందీ భాషా పదాల మేళవింపుతో ఉండటం, పదాది అక్షరాలతో గుర్తుండిపోయే పదం వచ్చేలా రూపొందించటం ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యేకత. ఈసారైతే గ్రామాల్లో ప్రతి పేద కుటుంబమూ ‘జీ రాం జీ’ అని స్మరించుకునేలా వాటంగా రూపుదిద్దారు.
మహాత్మా గాంధీ పేరు తొలగించారు. పార్టీల మధ్య వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా సాధారణ జనం పథకం పేరు కన్నా ప్రయోజనం ఏమేరకన్నదే ప్రధానంగా చూస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన నేపథ్యం ఒకింత విషాదకరమైనది. ‘పల్లె కన్నీరు బెడుతుందో...’ అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పాట అప్పటి పరిస్థితుల్ని ప్రభావవంతంగా చూపింది.
వరస కరువులతో, ఆర్థిక సంస్కరణలతో కుదేలై గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రోజులవి. రైతుల ఆత్మహత్యలు, ఉపాధి కరువై వలసపోవటాలు, చేతివృత్తులు దెబ్బతినటం రివాజయ్యాయి. దేశంలో అనేక జిల్లాలు ఆకలితో అలమటించాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలోకొచ్చిన యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తీసుకొచ్చింది.
2006 నుంచి దశలవారీగా అమలు ప్రారంభించింది. పని చూపాలని కోరితే పక్షం రోజుల్లో పని కల్పించటం లేదా నిరుద్యోగ భృతి కల్పించటం, ఉపాధిని దయాధర్మ భిక్షంగా కాక, హక్కుగా గుర్తించటం, కూలీల్లో మూడోవంతు మంది తప్పనిసరిగా మహిళలుండాలనే షరతు, నివాస స్థలానికి అయిదు కిలోమీటర్ల లోపునే పనిచూపటం, అంతకు మించితే అదనపు వేతనం చెల్లించటం దాని ప్రత్యేకతలు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కల్పనా పథకమది.
పల్లెసీమల్లో ఈ పథకం కింద రహదారులు, చెరువుల్లో పూడిక తీయటం, భూసార పరిరక్షణ, నీటిపారుదల సదుపాయాల మెరుగు వగైరా పనులు చేయించటానికి వినియోగించారు.
అయితే లోపాలు లేవని కాదు. ఈ పథకం వల్ల తమకు కూలీల లభ్యత తగ్గిందని రైతుల ఫిర్యాదు. అలాగే వేతనాల చెల్లింపులో ఆలస్యం, నిధుల అరకొర కేటాయింపు, అన్నిచోట్లా ఒకేలా అమలు చేయకపోవటం, బయటి రేట్లతో పోలిస్తే వేతనాలు తక్కువ ఉండటం వగైరాలు సమస్యలు. వీటిని ‘జీ రాం జీ’ పరిష్కరిస్తుందా? వంద రోజులు కాదు... 125 రోజులు ఉపాధి గ్యారెంటీ అంటున్నది కొత్త పథకం.
సాగు పనులు జోరుగా ఉండే రెండు నెలలూ దీన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఈశాన్య రాష్ట్రాలూ, కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ వగైరాలు మినహా మెజారిటీ రాష్ట్రాలు ఈ పథకంలో 40 శాతాన్ని భరించాల్సి రావటం ఇందులోని ప్రధాన సమస్య. ఇంతవరకూ ఇది 10 శాతం మాత్రమే. ఇకపై రాష్ట్రాలు ఏటా కనీసం రూ. 50,000 కోట్లు వెచ్చించాలి.
పైగా ప్రతి ఏటా నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించటం, అంతకుమించి పెరిగితే రాష్ట్రాలే భరించాల్సి రావటం అదనపు సమస్య. రాష్ట్రాల ఆదాయ వనరులకు గండికొడుతూ అదనంగా ఇంత పెద్ద భారాన్ని మోపటం సరైందేనా? ఎన్డీయేను భుజాలకెత్తుకున్న జేడీ(యూ), టీడీపీ ఏమంటాయి? ఈ పథకం కూడా గతంలో మాదిరే హక్కు ప్రాతిపదికగా ఉంటుందంటున్నా నిధుల లేమితో ఆచరణలో ఆవిరి కాదా?
గత అయిదేళ్లలో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గుతున్నది. ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గణాంకాలు ఆ సంగతి చెబుతున్నాయి. రాష్ట్రాలపై అదనపు భారం మోపితే పథకం నీరసిస్తుంది. రాష్ట్రాలకు కేటాయింపుల్లో కేంద్రం అనుసరించబోయే గీటురాళ్లేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.
తమకేం అవసరమో రాష్ట్రాలు నిర్ణయించు కోవటానికి బదులు ఎక్కడెక్కడ ఖర్చు చేయాలో కేంద్రం నిర్దేశిస్తుంది. వికేంద్రీకరణ అవసరం నానాటికీ పెరుగుతుండగా అందుకు భిన్నమైన మార్గం సమర్థనీయం కాదు. మొత్తానికి దీనివల్ల ఒరిగేదేమిటో, కష్టనష్టాలేమిటో మున్ముందు తెలుస్తాయి.


