breaking news
mnrega
-
జీ రామ్ జీపై సుప్రీంకు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన వీబీ–జీ రామ్ జీ (వికసిత్ భారత్– గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ్)చట్టం–2026ను జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే విషయంలో గత్యంతరం లేక నోటిఫికేషన్ జారీకి ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ చట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. పార్లమెంటులోనూ కేంద్రం తీరును నిలదీయాలని తీర్మానించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై వీబీ–జీ రామ్ జీని రాష్ట్రంలో అమలు చేసే అంశంపై విస్తృతంగా చర్చించింది. సమావేశం అనంతరం సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. కొత్త చట్టంపై ఇతర రాష్ట్రాలూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. టిమ్స్ ఆస్పత్రులకు 6,278 పోస్టులు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులతోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతించారు. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్ఓసీలు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రూ.7345 కోట్లతో మూసీ తొలి దశ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా ఫేజ్–1 పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 21 కి.మీ. పొడవునా అభివృద్ధి చేసేందుకు రూ.7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరుకు ఆమోదం తెలిపింది. హిమాయత్ సాగర్ నుంచి ఈసా... ఉస్మాన్ సాగర్ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాఫNఘాట్ వరకు ఈ పనులు చేపడతారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు... నిర్వహణ కోసం నూతనంగా 147 పోస్టుల మంజూరుతోపాటు ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బంది డిప్యూటేషన్‌కు ఆమోదం తెలిపారు. త్వరలో ఫేజ్–1 పనులకు టెండర్లు పిలవనున్నారు. ఉపాధ్యాయులకూ అల్పహారం, లంచ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని నిర్ణయించారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతోపాటు జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. = వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువుల గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలను, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ ధర ప్రకారం కేటాయించేందుకు ఆమోదం. = జవహర్ నవోదయ విద్యాలయాలకు రెండు చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేబినెట్ కేటాయించింది. జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మరికొన్ని సంస్థలకు భూములు కేటాయించారు. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన వీబీ–జీ రామ్‌జీ చట్టంలోని నిబంధనలపై మంత్రివర్గం తీవ్రంగా నిరసన తెలిపింది. కూలీలకు ఉపాధి భరోసా కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని జనవరిలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయంపై చర్చించింది. మరోసారి తమ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది. వీబీ–జీ రామ్ జీ చట్టం అమలు విషయంలో ఇతర రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకున్నాయో.. కొత్త చట్టంలో తెచ్చిన మార్పులతో రాష్ట్ర ప్రభుత్వానికి, కూలీలకు ఎలా నష్టం జరుగుతుంది తదితర అంశాలపై అధ్యయనం జరిపి మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై మంత్రివర్గం క్షుణ్ణంగా పరిశీలన జరిపింది. సమాఖ్య స్ఫూర్తి విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపేలా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఉపసంఘం పేర్కొంది. ఇతర రాష్ట్రాలన్నీ కొత్త చట్టానికి ఆమోదం తెలిపాయా? లేదా? అని మంత్రివర్గం ప్రశ్నించగా, అన్ని రాష్ట్రాలూ కొత్త చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. -
కొత్త అవతారంలో నరేగా!
ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా నిరుడు డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన వీబీ– జీ రాం జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకొచ్చింది. ఇది రద్దయిన ఉపాధి హామీ పథకం (నరేగా)కు సరికొత్త అవతారం. గత పథకంలోని ‘హక్కుల ప్రాతిపదిక’ను మార్చొద్దనీ, రాష్ట్రాలపై ఆర్థిక భారం పడే విధానానికి స్వస్తిచెప్పి, గతంలో మాదిరే కేంద్రమే భరించాలని పౌరసమాజ కార్యకర్తలతోపాటు కొన్ని రాష్ట్రాలు కూడా కోరాయి. అయితే నరేగా కన్నా ఇదెన్నో రెట్లు మేలని కేంద్రం చెబుతోంది. గత పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి వంద రోజుల పని దినాలకు అనుమతించగా, తాము మరో 25 రోజులు పెంచామని... కూలీల వేతనాలు పెరిగాయని, వారానికోసారి చెల్లింపులు, ఇతర సంస్కరణలు తీసుకురావటంతో అవినీతికి ఆస్కారం ఉండబోదని కేంద్రం చెబుతోంది. పాత పథకంలో ప్రతి 15 రోజులకొకసారి చెల్లించాలన్న నిబంధన ఉన్నా, బ్యాంకింగ్ సదుపాయాలు అంతంతమాత్రమే కావటంవల్ల నిరుపేద కుటుంబాలు నెలల తరబడి వేచిచూడాల్సివచ్చేది. ఈలోగా రోజులు గడవటానికి అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేసే వారు. ఇప్పుడు వారానికొకసారి వేతనాలిస్తామంటున్నా ఈ లోటుపాట్లు సరిదిద్దకపోతే నిరుపయోగమే. గ్రామీణ కూలీలకు మరో 25 రోజులు పనిదొరకటం, అందువల్ల అదనపు ఆదాయం రావటం హర్షించదగ్గది. అయితే నరేగాకింద గ్రామాల్లో సంబంధిత పక్షాల సమావేశాల నిర్ణయాల ఆధారంగా చేయించాల్సిన పనులు ఖరారయ్యేవి. తాజా చట్టం ప్రకారం అలాంటి పనులేమిటో కేంద్రం ‘వాస్తవ ప్రమాణాల’ ఆధారంగా నిర్ణయిస్తుంది. దాని కయ్యే వ్యయాన్ని కూడా అంచనా వేస్తుంది. అందులో 40 శాతాన్ని రాష్ట్రం భరిస్తే, మిగి లిన 60 శాతం నిధులు కేంద్రంనుంచి వస్తాయి. చేయించాల్సిన పనులు, వాటి అంచనా వ్యయం ఆధారంగా వివిధ రాష్ట్రాలకు వేర్వేరు కేటాయింపులుంటాయి. కేంద్రం నిర్దేశించిన పనులకన్నా అధికంగా చేయించదల్చుకుంటే అందుకయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. పాత పథకంలో నిధుల దుర్వినియోగం మాట వాస్తవం. కనబడని మనుషుల పేర్లతో కైంకర్యం చేసిన ఉదంతాలు అనేకం బయటపడ్డాయి. అందుకే హిందీ రాష్ట్రాల్లో ‘పిశాచ లబ్ధిదారుల’న్న పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడున్న సాంకేతికత అప్పుడు లేదు. మొత్తం కాగితాలపైనే వ్యవహారాలన్నీ నడిచేవి. ఆన్లైన్ వ్యవస్థలు, డిజిటల్ చెల్లింపులు వచ్చాక ఆ బెడద తగ్గింది. ‘నరేగా’ను అవినీతి పేరుతో కొట్టిపారేయటం సరికాదు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2006లో ప్రారంభమైన ఈ పథకం తొలి దశాబ్దకాలంలో దాదాపు కోటిన్నరమంది ప్రజలను దారిద్య్రంనుంచి విముక్తుల్ని చేసింది. ఇది చిన్న విషయమేం కాదు. అలాగే సగటున మహిళలకు 50 శాతం పనులు దక్కేవి. ఈ పథకంవల్ల సాగు పనులకు కూలీల కొరత వస్తున్నదన్న ఫిర్యాదులు ఉండేవి. కానీ జాతీయ గణాంకాలు మాత్రం సాగు పనులు ముమ్మరంగా ఉండే సమయంలో ‘నరేగా’కు డిమాండ్ తక్కువేనని చెబుతున్నాయి. కూలీలకు బేరమాడే శక్తి పెరిగిందనీ, వారి కూలీ రేట్లు పెరిగాయనీ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొత్త పథకంలో రాష్ట్రాలు కూడా వ్యయం భరించాల్సిరావటం ఒకరకంగా విషాదం. ‘నిధులు నిండుకుంటే హక్కులు నీరసిస్తాయ’ని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. ఈ పథ కానికి కేటాయింపుల కోసం రాష్ట్రాలు ముందుగా సంక్షేమ పథకాలకే... మహిళా సంక్షేమా నికే కోత పెడతాయి. గతంలో నిధులు లేక కాదు... అమలుపై ఆసక్తి కొరవడి అత్యధిక పేదరికం ఉండే బిహార్, ఉత్తరప్రదేశ్‌లు అతి తక్కువ నిధులు వినియోగించాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు నిధుల లేమితో చాలా రాష్ట్రాలు ఆ తోవన పోయినా ఆశ్చర్యం లేదు. మొన్న ఏప్రిల్ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, బిహార్‌లతోపాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణలు నిధుల భారం మోపటాన్ని వ్యతి రేకించాయి. తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కూడా గొంతుకలిపారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయింది. ఎటూ సంక్షేమాన్ని అరకొరగా చేస్తున్నాం... దాన్ని మరింత కత్తిరిస్తే సరిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అను కుంటున్నట్టున్నారు. ఏదేమైనా ఆచరణలో వచ్చే సమస్యల్ని అధ్యయనం చేశాకైనా వీబీ– జీ రాం జీ ని మెరుగుపరచటం మేలు. -
‘ఉపాధి’కి కొత్త రూపు!
గ్రామీణ ప్రాంతాల్లో కాయకష్టం చేయగలిగేవారికి ఏడాదికి కనీసం వంద రోజుల పని దినాలు కల్పించేందుకు ఇరవయ్యేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కనుమరుగు కావటానికి రంగం సిద్ధమైంది. దాని స్థానంలో తీసుకురాదల్చిన ‘వికసిత భారత్ రోజ్‌గార్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ–జీ రాం జీ) బిల్లు పార్లమెంటులో రంగప్రవేశం చేసింది. అమలులో ఉన్న పథకం కన్నా ఇది అనేక రెట్లు మేలైనదని కేంద్రం చెబుతోంది. ఆ మాటెలా ఉన్నా ప్రతి పథకమూ హిందీ భాషా పదాల మేళవింపుతో ఉండటం, పదాది అక్షరాలతో గుర్తుండిపోయే పదం వచ్చేలా రూపొందించటం ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యేకత. ఈసారైతే గ్రామాల్లో ప్రతి పేద కుటుంబమూ ‘జీ రాం జీ’ అని స్మరించుకునేలా వాటంగా రూపుదిద్దారు. మహాత్మా గాంధీ పేరు తొలగించారు. పార్టీల మధ్య వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా సాధారణ జనం పథకం పేరు కన్నా ప్రయోజనం ఏమేరకన్నదే ప్రధానంగా చూస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన నేపథ్యం ఒకింత విషాదకరమైనది. ‘పల్లె కన్నీరు బెడుతుందో...’ అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పాట అప్పటి పరిస్థితుల్ని ప్రభావవంతంగా చూపింది. వరస కరువులతో, ఆర్థిక సంస్కరణలతో కుదేలై గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రోజులవి. రైతుల ఆత్మహత్యలు, ఉపాధి కరువై వలసపోవటాలు, చేతివృత్తులు దెబ్బతినటం రివాజయ్యాయి. దేశంలో అనేక జిల్లాలు ఆకలితో అలమటించాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలోకొచ్చిన యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తీసుకొచ్చింది. 2006 నుంచి దశలవారీగా అమలు ప్రారంభించింది. పని చూపాలని కోరితే పక్షం రోజుల్లో పని కల్పించటం లేదా నిరుద్యోగ భృతి కల్పించటం, ఉపాధిని దయాధర్మ భిక్షంగా కాక, హక్కుగా గుర్తించటం, కూలీల్లో మూడోవంతు మంది తప్పనిసరిగా మహిళలుండాలనే షరతు, నివాస స్థలానికి అయిదు కిలోమీటర్ల లోపునే పనిచూపటం, అంతకు మించితే అదనపు వేతనం చెల్లించటం దాని ప్రత్యేకతలు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కల్పనా పథకమది. పల్లెసీమల్లో ఈ పథకం కింద రహదారులు, చెరువుల్లో పూడిక తీయటం, భూసార పరిరక్షణ, నీటిపారుదల సదుపాయాల మెరుగు వగైరా పనులు చేయించటానికి వినియోగించారు.అయితే లోపాలు లేవని కాదు. ఈ పథకం వల్ల తమకు కూలీల లభ్యత తగ్గిందని రైతుల ఫిర్యాదు. అలాగే వేతనాల చెల్లింపులో ఆలస్యం, నిధుల అరకొర కేటాయింపు, అన్నిచోట్లా ఒకేలా అమలు చేయకపోవటం, బయటి రేట్లతో పోలిస్తే వేతనాలు తక్కువ ఉండటం వగైరాలు సమస్యలు. వీటిని ‘జీ రాం జీ’ పరిష్కరిస్తుందా? వంద రోజులు కాదు... 125 రోజులు ఉపాధి గ్యారెంటీ అంటున్నది కొత్త పథకం. సాగు పనులు జోరుగా ఉండే రెండు నెలలూ దీన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఈశాన్య రాష్ట్రాలూ, కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ వగైరాలు మినహా మెజారిటీ రాష్ట్రాలు ఈ పథకంలో 40 శాతాన్ని భరించాల్సి రావటం ఇందులోని ప్రధాన సమస్య. ఇంతవరకూ ఇది 10 శాతం మాత్రమే. ఇకపై రాష్ట్రాలు ఏటా కనీసం రూ. 50,000 కోట్లు వెచ్చించాలి. పైగా ప్రతి ఏటా నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించటం, అంతకుమించి పెరిగితే రాష్ట్రాలే భరించాల్సి రావటం అదనపు సమస్య. రాష్ట్రాల ఆదాయ వనరులకు గండికొడుతూ అదనంగా ఇంత పెద్ద భారాన్ని మోపటం సరైందేనా? ఎన్డీయేను భుజాలకెత్తుకున్న జేడీ(యూ), టీడీపీ ఏమంటాయి? ఈ పథకం కూడా గతంలో మాదిరే హక్కు ప్రాతిపదికగా ఉంటుందంటున్నా నిధుల లేమితో ఆచరణలో ఆవిరి కాదా? గత అయిదేళ్లలో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గుతున్నది. ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గణాంకాలు ఆ సంగతి చెబుతున్నాయి. రాష్ట్రాలపై అదనపు భారం మోపితే పథకం నీరసిస్తుంది. రాష్ట్రాలకు కేటాయింపుల్లో కేంద్రం అనుసరించబోయే గీటురాళ్లేమిటో ఇంకా తెలియాల్సి ఉంది. తమకేం అవసరమో రాష్ట్రాలు నిర్ణయించు కోవటానికి బదులు ఎక్కడెక్కడ ఖర్చు చేయాలో కేంద్రం నిర్దేశిస్తుంది. వికేంద్రీకరణ అవసరం నానాటికీ పెరుగుతుండగా అందుకు భిన్నమైన మార్గం సమర్థనీయం కాదు. మొత్తానికి దీనివల్ల ఒరిగేదేమిటో, కష్టనష్టాలేమిటో మున్ముందు తెలుస్తాయి. -
ఉపాధి హామీకి పెద్దపీట
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెద్దపీట వేశారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి అధికంగా నిధులు కేటాయించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఈ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ. 38,500 కోట్లు కేటాయించారు. ఈ డబ్బు మొత్తాన్ని ఖర్చుచేస్తే.. ఈ పథకం మీద ఇప్పటివరకు ఖర్చుపెట్టిన అత్యధిక మొత్తం ఇదే అవుతుందని గత బడ్జెట్ ప్రసంగం సమయంలో అరుణ్ జైట్లీ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వెయ్యి కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెస్తామని జైట్లీ అన్నారు. 15వేల పంచాయతీలకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పన వస్తుందని అన్నారు. గత సంవత్సరం నిధులు పూర్తిగా వినియోగించారని మహిళల భాగస్వామ్యం కూడా 48 శాతం నుంచి 55 శాతానికి పెరిగిందని తెలిపారు. -
ఉపాధి హామీ పథకాన్ని అడ్డుకున్న చైనా
న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనల మధ్య భారతీయ వాయుసేన గురువారం లడఖ్ లో సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని ల్యాండ్ చేసింది. ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద జరుగుతున్న పనులను లడఖ్ లో చైనా జవానులు అడ్డుకున్న మరుసటి రోజు ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన చైనా జవానులు పనులు నిలిపివేయాలంటూ వర్కర్లపై అరిచినట్లు ఓ వార్త సంస్ధ ప్రచురించింది. దీంతో రంగంలోకి దిగిన 70 మంది భారత జవానులు ఆ ప్రదేశానికి వెళ్లి చైనా జవానుల కవాతును అడ్డుకున్నట్లు తెలిసింది. పనుల గురించి అభ్యంతరాలు చెప్పడం, అందుకు వివరణలు ఇవ్వడం జరిగినట్లు ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా ప్రాంతంలోని విమానం ల్యాండయిన ప్రదేశం చైనా బోర్డర్ కు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 4200 అడుగుల పొడవు కలిగిన రన్ వేపై సీ-17ను ల్యాండ్ చేసి అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోగల సామర్ధ్యం ఉందని వాయుసేన నిరూపించుకుంది. మెచుకా నుంచి రోడ్డు మార్గం ద్వారా డిబ్రూఘర్ కు చేరుకోవాలంటే(500 కిలోమీటర్ల దూరం) కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ఈ మార్గంలో రోడ్లు తరచూ పాడవుతూ ఉంటాయి. సీ-17 ల్యాండింగ్ పై మాట్లాడిన భారతీయ వాయుసేన అధికారులు రోడ్డు మార్గం క్లిష్టతరంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన వాటిని వేగంగా తరలించేందుకు ఈ సామర్ధ్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో అత్యధిక ఎత్తు నుంచి విమానాలను ల్యాండ్ చేయడంలో వాయుసేన పాలుపంచుకుంటోంది. -
యంత్రాలకు ‘ఉపాధి’
ఊటకుంటల తవ్వకాల్లో అక్రమాలు కూలీలకు బదులుగా యంత్రాలతో పనులు బినామీ మస్టర్లతో నిధుల స్వాహా అధికార పార్టీ నేతల హవా ఉదయగిరి : గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది.కూలీలకు ఎంపిక చేసిన పనుల ద్వారా ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం నిబంధనలను గాలికొదిలేసింది. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించి టీడీపీ కార్యకర్తల జేబులను నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అధికారులు చేతులెత్తేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే ఊటకుంటల పనులను యంత్రాలతో చేపడుతూ బినామీ మస్టర్లతో నిధులు స్వాహా చేస్తున్న తంతు ఉదయగిరి నియోజకవర్గంలో య«థేచ్ఛగా సాగుతోంది. ఈ పనులు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం విశేషం. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో నేతల కన్ను వీటిపై పడింది. ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తుండడంతో అవినీతికి అంతులేకుండా పోతోంది. జిల్లాలో 22,087 ఊటకుంటలు తవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.128.43 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 5467 కుంటల పనులు ప్రారంభించి రూ.10.70 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 791 ప్రస్తుతానికి పూర్తయ్యాయి. జిల్లాలోని 40 మండలాల్లో ఊటకుంటలను తవ్వేందుకు అనుమతులు మంజూరుచేశారు. ఇందులో భాగంగా ఒక్క ఉదయగిరి ప్రాంతానికే పది వేల కుంటలను మంజూరుచేశారు. ఈ పనులను ఉపాధి కూలీలతో చేయించాల్సి ఉన్నప్పటికీ ఉదయగిరి, సీతారామపురం, కలిగిర, వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం, తదితర మండలాల్లో యంత్రాలతో పనులు చేస్తున్నారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పనులు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రివేళల్లో పనులు: యంత్రాలతో పగటిపూట పనులు చేయిస్తే కూలీల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో రాత్రి వేళల్లో తవ్వకాలు చేపడుతున్నారు. పగటి వేళ కొంతమంది కూలీలను పెట్టి తుది మెరుగులు దిద్దుతున్నారు. అనంతరం తమకు అనుకూలమైన గ్రూపులను ఎంపిక చేసుకుని బినామీ మస్టర్లతో నిధులు కాజేస్తున్నారు. ఉదయగిర మండలంలోని తిరుమలాపురం, జి.అయ్యవారిపల్లి, దేకూరుపల్లి, జీ చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, జీ అయ్యవారిపల్లి, వరికుంటపాడు మండలంలోని రామాపురం, కొండాయపాళెం, వరికుంటపాడు, తదితర గ్రామాల్లో ఈ తరహాలతో యంత్రాలతో పనులు చేయించి నిధులు స్వాహా చేస్తున్నారు. పరస్పర సహకారం ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు, నేతలు ముందుగా పరస్పర అవగాహనతో యంత్రాలతో పనులు చేస్తున్నారు. నేతలు ముందుగా యంత్రాలతో నీటి కుంటలను తవ్విస్తారు. ఆ తర్వాత కూలీలతో తుదిమెరుగులు దిద్దుతారు. యంత్రాలతో చేపట్టిన పనుల విషయమై గ్రామస్తులు ఎవరైనా అధికారుల్ని నిలదీస్తే ఆ పనులతో తమకు సంబంధం లేదని, మస్టర్లు వేసేది లేదని చెబుతారు.అంతా సర్దుమణిగిన తర్వాత నెలకో రెండు నెలలకో మస్టర్లు వేసి నిధులు స్వాహా చేస్తారు. ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో యంత్రాలతో నీటికుంటల పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న కూలీలు అక్కడికెళ్లి పనులు ఆపివేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వామా పీడీ అసంతృప్తి ఇటీవల నియోజకవర్గంలోని వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డ్వామా పీడీ హరిత పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి కుంటలను యంత్రాలతో నిర్మించినట్లుగా క్షేత్రస్థాయిలో ఆమె గుర్తించినా ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా కూలీలతో పనులు చేయించాలని, లేకపోతే చర్యలు తప్పవని పరోక్షంగా అధికారుల్ని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా కూలీలతో చేయించాల్సిన ఉపాధి పనులను యంత్రాలతో చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి యంత్రాలతో పనులు చేపట్టకుండా కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. యంత్రాలతో పనులు చేయిస్తే చర్యలు తప్పవు– వీరాస్వామి, ఎంపీడీఓ, ఉదయగిరి కూలీలతో తవ్వించాల్సిన ఊటకుంటలను యంత్రాలతో చేపడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. యంత్రాలతో పనులు చేపడుతుంటే కూలీలు తమ దృష్టికి తీసుకురావాలి. ఉపాధి పనులను పారదర్శకంగా చేయించే ప్రయత్నం చేస్తున్నాం. -
అవినీతిని భరించలేక ఇంజనీర్ ఆత్మహత్య
యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పేరుకుపోయిన అవినీతి ఓ యువ ఇంజనీరు ప్రాణాలను బలిగొంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్ (24) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించాడు. ఈ పథకంలో విపరీతంగా పేరుకుపోయిన అవినీతిని సురేష్ ఏమాత్రం భరించలేకపోయాడని, దొంగ బిల్లులు సృష్టించడానికి, ఆమోదించడానికి నిరాకరించి.. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి తండ్రి మారిస్వామి శెట్టి తెలిపారు. చామరాజనగర్ జిల్లాలోని కాగలవాడి గ్రామంలో సురేష్ పనిచేసేవాడు. గ్రామపంచాయతీ సర్పంచి సర్దార్, అతడి భార్య సరోజ, స్థానిక ప్రాజెక్టు అభివృద్ధి అధికారి (పీడీవో) వైరముడి కలిసి దొంగబిల్లులను ఆమోదించాల్సిందిగా సురేష్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. సురేష్ అందుకు నిరాకరించడంతో పాటు, వాళ్లు ఇవ్వజూపిన లంచాన్ని కూడా తిరస్కరించాడు. పైనుంచి కూడా దీనిపై ఒత్తిడి రావడంతో ఈ అవినీతిని భరించలేనంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేర్చగా అక్కడ మరణించాడు.


