ప్రశాంతంగా ఉన్నంతకాలమూ అంతా సవ్యంగా ఉందనుకోవటమే తప్ప ఉగ్రవాదం తీవ్రత ఎక్కడా తగ్గలేదని గత ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో చోటు చేసుకున్న ఉదంతం తెలియజేస్తోంది. హన్నూక సంబరాల్లో మునిగిన యూదు సమూహంపై తండ్రీకొడుకులిద్దరు తుపాకులతో దాడి చేసి 15 మందిని కాల్చిచంపటం, 40 మందిని గాయపర్చటం గమనిస్తే నిరంతర అప్రమత్తత ఎంత అవసరమో అర్థమవుతుంది.
ప్రతిచోటా భద్రత కల్పించటం ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవచ్చు. అందుకే వర్తమాన పరిస్థితుల్లో ఎవరికి వారు తమ చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో అనునిత్యం గమనించుకోవడం తప్పనిసరి. తుపాకీ చట్టాలు ఎంతో కఠినంగా ఉండే ఆస్ట్రేలియాలో ఈ మాదిరి ఘటన జరిగి మూడు దశాబ్దాలవుతోంది. 1996లో పోర్ట్ ఆర్తర్‌లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. గత రెండేళ్లలో యూదులకు వ్యతిరేకంగా దాదాపు 2,000 ఘటనలు జరిగినట్టు పోలీసు నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుత ఉదంతం కూడా దానికి కొనసాగింపే! ఇలాంటి నేపథ్యంలో నిఘా మరింత పక డ్బందీగా ఉంటే బాగుండేది. ఉన్మాదులు హఠాత్తుగా ఎక్కడైనా దాడులకు తెగబడొచ్చని ఇది రుజువుచేస్తోంది. ఆస్ట్రేలియా భిన్న జాతుల నిలయం. చాలా దేశాలతో పోలిస్తే అది స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పెట్టింది పేరు. దేశ జనాభాలో యూదుల శాతం 0.4 శాతం.
అంకెల్లో చెప్పు కోవాలంటే అది 1,17,000. అందులో చాలా కుటుంబాలు నాజీ జర్మనీలో హిట్లర్ ఉన్మాదాన్ని అధిగమించి అదృష్టవశాత్తూ బతికి బయటపడినవారివే. ఇజ్రాయెల్ పాల కులు గాజాపై రెండేళ్లపాటు ఎడతెగకుండా సాగించిన హంతకదాడుల్లో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆ దాడులు ఆగింది లేదు. దాన్ని ప్రపంచ దేశాల ప్రజలంతా నిరసించారు.
అందులో యూదులు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా సైతం తీవ్రంగా ఖండించింది. అంతేకాదు, మొన్న ఆగస్టులో పాలస్తీనాను గుర్తించింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న యూదులంతా ఇజ్రాయెల్ దుండగాన్ని సమర్థించారని కూడా చెప్పలేం. ఉగ్రవాద సంస్థ హమాస్ సాగించిన హత్యాకాండకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవటం సబబేనని భావించేవారు ఉంటే ఉండొచ్చు.
అలాంటి వారిని సైతం ఒప్పించేలా, మార్చ గలిగేలా ఉద్యమాలు నిర్మించాలి తప్ప సంబంధం లేని అమాయక పౌరుల్ని చంపి ఇలాంటి ఉన్మాదులు ఏం సాధిస్తారు? ఇప్పుడు దాడికి పాల్పడిన తండ్రీకొడుకులకు గాజా ఉదంతం సాకు మాత్రమే.
హైదరాబాద్ పాతబస్తీ నుంచి 27 ఏళ్ల క్రితం సాజిద్ అక్రం వలసపోగా, ఆరేళ్లక్రితమే అతని కుమారుడు నవీద్ ఫిలిప్పీన్స్‌లోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలు పెట్టుకున్నాడని, అప్పటినుంచి వారిద్దరికీ ఉన్మాదం తలకెక్కిందని అంటు న్నారు. గత నెలలో వారిద్దరూ ఫిలిప్పీన్స్ వెళ్లి సైనిక శిక్షణ తీసుకున్నారని పోలీసుల కథనం.
ఆర్నెల్లక్రితం కొడుకుపై అనుమానం వచ్చి నిఘా సంస్థ అధికారులు ప్రశ్నించా రట కూడా! కొడుకు పేరుతో రిజిస్టరైన వాహనంలో పేలుడు పదార్థాలు, ఐఎస్ పతా కాలు ఉన్నట్టు పోలీసు సోదాలో బయటపడింది. ఉదంతం జరిగిన రోజే తండ్రిని పోలీసు బలగం కాల్చిచంపగా, కొడుకు సాజిద్‌ను సమీపంలోనే ఉన్న చిరువ్యాపారి అహ్మద్ అల్ –అహ్మద్ చాకచక్యంగా పట్టుకోగలిగాడు. మృత్యువుకు ఎదురొడ్డి అతను చేసిన సాహస కార్యం వల్ల అనేకమంది ప్రాణాలు నిలబడ్డాయి. కానీ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఉదంతంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ విచిత్రంగా స్పందించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ విధానాలు యూదు వ్యతిరేకతను ప్రోత్సహించే విగా ఉన్నందువల్లే ఈ ఉదంతం జరిగిందని వ్యాఖ్యానించారు. పాలస్తీనా రాజ్యం ఏర్ప డాలని కాంక్షించటం యూదు వ్యతిరేక చర్య ఎలా అవుతుందో నెతన్యాహూకే తెలియాలి.
హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి 1,195 మంది ఆ దేశ పౌరుల్ని, విదేశీయులు కొందరిని చంపేశారు. 251మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆ విషయంలో ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చటానికి నెతన్యాహూ గాజాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడాయన ఆల్బనీస్‌ను తప్పుపట్టేందుకు సిద్ధపడ్డారు! ఏదేమైనా ఆస్ట్రేలియా ఉదంతం ప్రపంచ దేశాల కళ్లు తెరిపించాలి. అత్యంత అప్రమత్తంగా ఉండకపోతే ఉగ్రవాద భూతం ఎక్కడైనా విరుచుకుపడొచ్చని తెలుసుకోవాలి.


