సిడ్నీ: ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ సాక్షిగా జరిగిన సామూహిక కాల్పుల ఘటన ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హనుక్కా వేడుకల కోసం వందలాది యూదు కుటుంబాలు అక్కడికి చేరిన సమయంలో తండ్రీకొడుకులైన సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) జరిపిన ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 ఏళ్ల పిల్లల నుండి 87 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో మరో 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
ఈ దారుణ ఘటనకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక డాష్‌క్యామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బోరిస్, సోఫియా గుర్మాన్ అనే వృద్ధ దంపతులు ప్రాణాలకు తెగించి ఒక దుండగుని అడ్డుకోవడానికి ప్రయత్నించడం కనిపిస్తున్నది. లావెండర్ టీ-షర్ట్ ధరించిన బోరిస్, సాయుధుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, సోఫియా అతనికి తోడుగా నిలిచారు. ఈ పోరాటంలో వారు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు వారు చూపిన ధైర్యం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
New footage confirms a second hero at Bondi Beach.
A man in a purple shirt charged the terrorists, disarmed one of them, and tried to stop the massacre.
He and his wife paid with their lives.#bondibeach pic.twitter.com/lOG8Fo7xXv— TRIDENT (@TridentxIN) December 16, 2025
ప్రాణాలకు తెగించిన పండ్ల వ్యాపారి
43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ అనే పండ్ల వ్యాపారి చేసిన సాహసం అద్వితీయం. ఫుట్‌బ్రిడ్జిపై కాల్పులు జరుపుతున్న నిందితుడిని వెనుక నుండి పట్టుకుని, నిరాయుధుడిని చేసే క్రమంలో అహ్మద్ రెండు బుల్లెట్ గాయాలకు గురయ్యారు. కాగా ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా, అతను తుపాకీని లాక్కొని, పెను రక్తపాతాన్ని నివారించారని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆ పండ్ల వ్యాపారిని ప్రశంసించారు. ప్రస్తుతం అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రజా ఆగ్రహం.. నిందితుడిపై దాడి
ఈ ఊచకోత సృష్టించిన బీభత్సాన్ని చూసి అక్కడి పౌరులు ఆగ్రహంతో ఊగిపోయారు. జాకబ్ బార్న్‌ఫీల్డ్ అనే యువకుడు నేలపై పడి ఉన్న నిందితుడి తలపై దాడిచేసిన దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి. ‘అక్కడ పడి ఉన్న శవాలు, పిల్లల ఏడుపులు చూశాక సంయమనం కోల్పోయాను. ఏ ఆస్ట్రేలియన్ అయినా ఇదే చేసేవాడు’ అని అతను ఏమత్రం పశ్చాత్తాపం లేకుండా స్పష్టం చేశాడు.
హైదరాబాద్ మూలాలు.. ఆస్ట్రేలియాలో ‘శిక్షణ’
సిడ్నీ కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందినవాడు. 27 ఏళ్ల క్రితం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్, అక్కడ ఒక క్రైస్తవ మహిళను వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న ఇతను.. ఆస్తి వివాదాల పరిష్కారం కోసం మాత్రమే కొన్నిసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవాడు. సాజిద్ కుమారుడు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. వీరిద్దరూ దాడికి ముందు ఫిలిప్పీన్స్‌లోని దావో నగరానికి వెళ్లి, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 28 రోజుల పాటు ఉగ్రవాద శిక్షణ పొందినట్లు దర్యాప్తులో తేలింది. సాజిద్ భారతీయ పాస్‌పోర్ట్‌పై, నవీద్ ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించి ఈ కుట్రను అమలు చేశారు.
తీవ్రవాద భావజాలం.. నిఘా వైఫల్యం
నవీద్ అక్రమ్ 18 ఏళ్ల వయస్సులోనే "అల్లాహ్ చట్టమే అన్నింటికన్నా గొప్పది" అంటూ చేసిన వీడియో ప్రసంగం అప్పట్లో కలకలం రేపింది. ఫలింగా అతను ఆస్ట్రేలియా నిఘా సంస్థల (ఏఎస్‌ఐఓ) జాబితాలో చేరాడు. అయినప్పటికీ సాజిద్ తన పేరు మీద స్పోర్ట్స్ క్లబ్ సాకుతో ఆరు రైఫిల్ లైసెన్సులను పొందడం, పైగా వాటిని 2023లో పునరుద్ధరించుకోవడం అనేది భద్రతా సంస్థల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. బాండీ బీచ్ దాడి సమయంలో పోలీసులు సాజిద్‌ను కాల్చి చంపగా, గాయపడిన నవీద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, దర్యాప్తు సంస్థల విచారణలో ఉన్నాడు. వీరిద్దరూ ఐసిస్ భావజాలానికి ప్రభావితమై, పక్కా ప్రణాళికతోనే యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఉగ్రవాద కోణంలో అధికారులు ఈ కేసును నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అండగా నిలిచింది.
ఇది కూడా చదవండి: ‘శాంతి’తో సంచలనం.. ఇక భారత ‘అణు శక్తి’ ప్రైవేటీకరణ!


