ట్రంప్‌ ఖాతాలోకి మరికొన్ని దేశాలు | Donald Trump Extended Travel Ban To 39 Countries Amid National Security Concerns, Check Full Details Here | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఖాతాలోకి మరికొన్ని దేశాలు

Dec 17 2025 7:18 AM | Updated on Dec 17 2025 10:55 AM

Trump Extended Travel Ban to 39 Countries Check Full Details Here

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం మరో ఏడు దేశాలపై నిషేధం విధించే ఉత్తర్వులపై ఆయన సంతకాలు(Trump Travel Ban) చేశారు. దీంతో.. మొత్తం 39 దేశాలపై ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ విధించినట్లయ్యింది.

ట్రంప్‌ తాజా సంతకంతో అమెరికాలో ప్రవేశానికి నిషేధం ఉన్న దేశాల సంఖ్యను 19 నుంచి 39కి పెరిగింది(US Travel Ban). వలస విధానాలను మరింత కఠినతరం చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించారని ఈ సందర్భంగా వైట్‌హౌజ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు దేశ భద్రతనే కారణమని చెబుతోంది. 

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మొన్నీమధ్యే కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక నేషనల్ గార్డ్ సభ్యులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అఫ్గనిస్థాన్‌ నుంచి వలస వచ్చిన రహ్మానుల్లా లకన్వాల్‌గా నిర్ధారించారు. దీంతో.. వలసవాదులపై ట్రంప్‌ భగ్గుమన్నారు. 

తాజాగా.. పూర్తి నిషేధం విధించిన దేశాలు లావోస్, సియెర్రా లియోన్, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సూడాన్, సిరియా ఉన్నాయి. అలాగే.. తాత్కాలిక నిషేధం (భాగస్వామ్య పరిమితులు) విధించిన దేశాలు.. అంగోలా, ఆంటిగ్వా & బార్బుడా, బెనిన్, కోట్ దివ్వార్, డొమినికా, గాబోన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వేలు.

పలు దేశాలపై నిషేధం మాత్రమే కాదు.. పాలస్తీనా వలసల మీద కూడా ట్రంప్‌ కొరడా ఝుళిపించారు.  పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన వారికి కూడా ఈ పరిమితులు వర్తించనున్నాయి. అదే సమయంలో.. తుర్కమేనిస్తాన్(మధ్య ఆసియా) పౌరులపై ఉన్న నాన్-ఇమిగ్రెంట్ వీసా నిషేధాన్ని ఎత్తివేసినా, ప్రవేశాన్ని మాత్రం నిలిపివేశారు.

మినహాయింపు వీళ్లకే.. 
శాశ్వత నివాసితులతో పాటు ఇప్పటికే వీసా కలిగిన వాళ్లకు.. అలాగే కొన్ని ప్రత్యేక వీసా వర్గాలకు.. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన వాళ్లకు మినహాయింపు దక్కనుంది.

ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వలస విధానాలను కఠినతరం చేస్తోంది. అలాగే ఆశ్రయం (అసైలం) విషయంలోనూ ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో బైడెన్ కాలంలో ఇచ్చిన వీసాలను సమీక్షించడంతో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్ల పునఃపరిశీలన వంటి చర్యలు చేపడుతోంది.

ట్రంప్‌ పూర్తి నిషేధం విధించిన దేశాలు (Full Ban):
1. ఆఫ్ఘానిస్తాన్
2. బర్మా (మయన్మార్)
3. చాద్
4. రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో
5. ఈక్వటోరియల్ గినియా
6. ఎరిట్రియా
7. హైటి
8. ఇరాన్
9. లిబియా
10. సోమాలియా
11. సూడాన్
12. యెమెన్
13. బురుండి
14. క్యూబా
15. లావోస్
16. సియెర్రా లియోన్
17. టోగో
18. తుర్కమేనిస్తాన్
19. వెనిజులా
20. బుర్కినా ఫాసో
21. మాలి
22. నైజర్
23. సౌత్ సూడాన్
24. సిరియా

భాగస్వామ్య పరిమితులు ఉన్న దేశాలు (Partial Restrictions):
25. అంగోలా
26. ఆంటిగ్వా & బార్బుడా
27. బెనిన్
28. కోట్ దివ్వార్
29. డొమినికా
30. గాబోన్
31. గాంబియా
32. మలావి
33. మౌరిటేనియా
34. నైజీరియా
35. సెనెగల్
36. టాంజానియా
37. టోంగా
38. జాంబియా
39. జింబాబ్వే

భాగస్వామ్య ప్రయాణ నిషేధం (Partial Travel Ban) అంటే.. ఒక దేశానికి చెందిన ప్రజలందరిపై పూర్తి నిషేధం కాకుండా, కొన్ని వర్గాలపై మాత్రమే పరిమితులు విధించడం. ఉదాహరణకు, పర్యాటక వీసాలు లేదంటే విద్యార్థి వీసాలు నిలిపివేయొచ్చు. కానీ వ్యాపార వీసాలు, అధికారిక వీసాలు అనుమతించొచ్చు.  

అలాగే సమాచారం పంచుకోవడంలో లోపాలు, భద్రతా తనిఖీలలో లోపాలు ఉన్న దేశాలపై ఈ విధమైన పరిమితులు అమలు చేస్తారు. భద్రతా కారణాల వల్ల కొన్ని వర్గాల వ్యక్తులు (ఉదా: ప్రభుత్వ అధికారులు, సైనికులు, లేదంటే నిర్దిష్ట వయసు ఉన్నవాళ్లను అమెరికాలో ప్రవేశించకుండా ఆపవచ్చు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement