నవంబర్‌లో 19 శాతం అప్
ఇంజనీరింగ్, ఎల్రక్టానిక్స్ మెరుగైన పనితీరు
ఐదు నెలల కనిష్టానికి వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నవంబర్‌లో బలమైన పనితీరు చూపించింది. అమెరికా టారిఫ్‌ల నడుమ సానుకూల వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్‌లో 38.13 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరిగాయి. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, కెమికల్స్, రత్నాభరణాలు వృద్ధికి తోడ్పడ్డాయి. దిగుమతులు 1.88 శాతం తగ్గి 62.66 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రధానంగా బంగారం, ముడిచమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి.
దీంతో వాణిజ్య లోటు 24.53 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. అక్టోబర్ నెలకు వాణిజ్య లోటు 41.68 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినా నవంబర్‌లో గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.62 శాతం పెరిగి 292.07 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం ఇదే కాలంలో 5.59 శాతం అధికమై 515.21 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 223.14 బిలియన్ డాలర్లుగా ఉంది.
→ నవంబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 11.65 శాతం పెరిగి 3.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
→ టీ, కాఫీ, ఐరన్ ఓర్, జీడిపప్పు, డెయిరీ, హస్తకళాకృతులు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు సైతం సానుకూలంగా నమోదయ్యాయి.
→ బియ్యం, నూనె గింజలు, కార్పెట్, ప్లాస్టిక్స్ ఎగుమతులు క్షీణించాయి.
→ సేవల ఎగుమతులు నవంబర్‌లో 35.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2024 నవంబర్‌లో వీటి ఎగుమతులు 32.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సేవల ఎగుమతులు 270 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 248.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఎగుమతులకు ప్రోత్సాహకం..
రూ. 25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌కు సంబంధించి సవివర మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నట్టు వాణిజ్య శాఖ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. కొన్నింటిని ఈ వారంలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన ప్రభావం నుంచి ఎగుమతిదారులకు కొంత మేరకు ఉపశమనం లభిస్తుందన్నారు. అమెరికా టారిఫ్‌లు విధించినప్పటికీ.. 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు భారత ఎగుమతులకు యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్నట్టు ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్’ (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్‌సీ రల్హాన్ తెలిపారు.
యూఎస్‌కు 22 శాతం అధికం
నవంబర్‌లో అమెరికాకు ఎగుమతులు బలపడ్డాయి. వరుసగా రెండు నెలల పాటు (సెప్టెంబర్, అక్టోబర్) క్షీణత తర్వాత.. నవంబర్‌లో 22.61 శాతం మేర అధికంగా 6.98 బిలియన్ డాలర్ల ఎగుమతులు యూస్ మార్కెట్‌కు వెళ్లాయి. భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను ఆగస్ట్ నుంచి యూఎస్ అమలు చేస్తుండడం తెలిసిందే. అమెరికా నుంచి నవంబర్‌లో భారత్‌కు దిగుమతులు 38 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అమెరికాకు ఎగుమతులు 11.38 శాతం పెరిగి 59 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 13.49 శాతం పెరిగి 35.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.


