ఇద్దరు దుర్మరణం
అనుమానితుడి అరెస్ట్
ప్రొవిడెన్స్: అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. రోడ్ ఐలాండ్స్‌లోని ప్రొవిడెన్స్ పట్టణంలోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు కాలేజ్‌కు వచ్చి పరీక్షలు రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఇద్దరు మరణించారు. 9 మంది గాయపడ్డారు. వెంటనే దుండగుడు పరారయ్యాడు.
అతను 30ల్లో ఉంటాడని, నలుపు దుస్తులు ధరించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ అతడు దొరికాడన్న విషయం పోలీసులు వెల్లడించలేదు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులంతా హడలిపోయారు.
రూమ్‌లో, బాత్రూమ్‌లలో, డెస్క్ కింద, జిమ్‌లో, ఎక్కడ వీలైతే అక్కడే గంటల తరబడి దాక్కున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాంతో వారాంతంలో అత్యంత సందడిగా ఉండే పట్టణ వీధులన్నీ దుండగుడు బయటే తిరుగుతున్నాడన్న భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. సెక్యూరిటీ చెకింగ్‌లను దాటుకుంటూ అతను కాలేజీలోకి హంతకుడు ఎలా రాగలిగాడు? ఫేస్ రికగి్నషన్ లాక్ రక్షణ ఉన్న క్లాస్ రూమ్ లోనికి ఎలా దూరాడు అన్నది ప్రశ్నగా మారింది. మృతులకు అమెరికా ట్రంప్ నివాళులు అర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుండగుడు హ్యాండ్ గన్ వాడినట్టు భావిస్తున్నారు.


