వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరం మరోసారి ముద్దుల పోటీకి వేదికైంది. ‘నేషనల్ కిస్ అండర్ ది నేషనల్ మిజిల్‌టో’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జంటలు తరలివచ్చాయి. ఆంథెమ్ రోలో వేలాడదీసిన మిజిల్‌టో మొక్కల కింద 480 మంది జంటలు ముద్దాడటం ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. అయితే, శనివారం జరిగిన కార్యక్రమానికి సుమారు 1,435 జంటలు వచ్చి ముద్దాడుకున్నాయి.
ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు తరఫున న్యాయ నిర్ణేతగా వచ్చిన మైకేల్ ఎంప్రిక్ ఇక్కడికి చేరుకున్న మూడు వేలమందిని చూసి ఆశ్చర్యమేస్తోంది. వీరంతా మిజిల్‌టో కింద ముద్దుల చరిత్రను సృష్టించారని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న రికార్డును వీరు సులభంగా బద్దలు కొట్టారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు’అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ఒంటరిగా ఇక్కడికి ఎవరూ రాలేదన్నారు.
అందరూ జంటలుగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. వీరంతా ఏకకాలంలో ఐదు సెకన్లపాటు ముద్దులు పెట్టుకుని, రికార్డు నెలకొల్పారని ఎంప్రిక్ వివరించారు. తాము కేవలం 500 జంటలు మాత్రమే పాల్గొంటాయని భావించామని, అనూహ్యంగా 6 వేల జంటలు నమోదు చేయించుకున్నాయని నిర్వాహకుడు ఎబనీ వాల్టన్ చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ఒరెగాన్‌లోని ఓ వ్యవసాయక్షేత్రం నుంచి 17,150 మిజిల్‌టో అనే గుబురుగా ఉండే పారాసైటిక్ నాచు మొక్కలను తెప్పించామన్నారు.


