అమెరికా రికార్డు బద్దలు
చరిత్ర సృష్టించిన పోస్టర్ల ప్రదర్శన
పుణే: భారతదేశం మరోసారి విశ్వ వేదికపై మెరిసింది. ఈసారి ఒక సాంస్కృతిక ఘనతతో, పుణే నగరం ’అత్యధిక పోస్టర్ల ప్రదర్శన’లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక రికార్డు నెలకొల్పింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగ్రీకర్ శనివారం ఈ రికార్డును ధ్రువీకరించారు. అత్యధిక పోస్టర్ల ప్రదర్శన రికార్డులో అమెరికాను వెనక్కి నెట్టి, ఈ ఘనతను భారత్ సొంతం చేసుకుందని ప్రకటించారు.
బిర్సా ముండాకు అంకితం
ప్రపంచ రికార్డు సృష్టి వెనుక ఒక విశిష్ట లక్ష్యం ఉంది. ఈ రికార్డును గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండాకు నివాళిగా అంకితం చేశారు. పుస్తక మహోత్సవ కనీ్వనర్ రాజేష్ పాండే మాట్లాడుతూ, గిరిజన సమాజం, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బిర్సా ముండా చేసిన సేవలను గౌరవించేందుకు ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన పదజాలంతో కూడిన పోస్టర్ల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు.
1,678 పోస్టర్లతో భారతీయ అస్తిత్వం
ఫెర్గుసన్ కళాశాలలో జరుగుతున్న పుణే పుస్తక మహోత్సవంలో ఈ రికార్డును నెలకొల్పారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, గిరిజన పదాలను ప్రదర్శిస్తూ ఏకంగా 1,678 పోస్టర్లను ప్రదర్శించారు. గతంలో అమెరికాలో ఫిబ్రవరి 2025లో 1,365 పోస్టర్లతో నెలకొలి్పన రికార్డును ఈ ప్రదర్శన బద్దలు కొట్టింది. డిసెంబర్ 12న పుణే బుక్ ఫెస్టివల్, యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, రైజ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ రికార్డును సాధించినట్లు గిన్నిస్ ధ్రువపత్రంలో పేర్కొన్నారు.
అంతరిస్తున్న భాషల పరిరక్షణ
సామాజిక కార్యకర్త గిరీష్ ప్రభూణే మాట్లాడుతూ, బిర్సా ముండా కృషి బహుముఖమైనదని కొనియాడారు. ‘అంతరించిపోతున్న మాండలికాలను పరిరక్షించడం అత్యవసరం. వాటిని దేవనాగరి లిపిలో నమోదు చేస్తే.. గిరిజన భాషలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలవుతుంది’.. అని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ పుణే పుస్తక మహోత్సవం, పుస్తక ప్రదర్శన మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, భాషా పరిరక్షణకు ఒక శక్తివంతమైన వేదికగా నిలిచింది. ఈ రికార్డు విజయంతో, పుణే నగరం పుస్తకాల పండుగను కేవలం వినోద కార్యక్రమంగా కాకుండా, సామాజిక చైతన్యం, సాంస్కృతిక గౌరవానికి చిహ్నంగా మార్చింది.


