పూణే:ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా థార్ ఎస్‌యూవీతో విసిగిపోయిన కారు యజమాని వినూత్నంగా నిరసన తెలిపాడు. థార్ కారుని ఇంటి నుంచి షోరూం వరకు గాడిదలతో తరలించారు. అలా అయినా మహీంద్రా ప్రతినిధులు స్పందించి తన సమస్యను పరిష్కరిస్తారేమోనని ఆశగా ఎదురు చూశాడు. ఆ తర్వాత ఏమైందంటే?
థార్‌తో రోజుకో పుట్టుకొస్తున్న సమస్యలతో విసిగిపోయిన వ్యక్తి.. గాడిదలతో షోరూమ్‌కు లాగించిన ఘటన పూణేలో జరిగింది. అక్బర్ ఖాన్ మహీంద్రా థార్ (2023 మోడల్)ను కొనుగోలు చేశాడు. లక్షలు వెచ్చించి కారును కొనుగోలు చేశాడన్న మాటేగాని నిత్యం ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. నాటి నుంచి ఇంజిన్ సమస్యలు, బ్రేక్‌డౌన్ ఫెయిలవ్వడం షోరూంకి తీసుకుపోయి బాగు చేయించుకోవడం, వేలవేలకు వేలు ఖర్చు చేయడం. ఇలా పరిపాటిగా మారింది. అలా అని థార్ సమస్యలు తీరాయా? అంటే అదీ లేదు.
కారులోని సమస్యలతో ఇబ్బంది పడుతున్నా బాగుచేయండి మహాప్రభూ అంటూ షోరూం ప్రతినిధులకు కారు యజమాని మొరపెట్టుకున్నా.. ఫలితం శూన్యం. ఈ క్రమంలో ఇంజిన్ సమస్యలు, బ్రేక్‌డౌన్‌లు తరచూ ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ థార్ యజమాని కారును గాడిదలతో లాగించి షోరూమ్ ముందు ఉంచి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. దీంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా థార్ ఓనర్ అక్బర్ ఖాన్ మాట్లాడుతూ.. “థార్ వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. షోరూమ్‌కు ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. చివరికి గాడిదలతో లాగించి షోరూమ్ ముందు ఉంచి నా బాధను వెళ్లగక్కానని చెప్పుకొచ్చాడు. వీడియో వైరల్ కావడంపై షోరూమ్ ప్రతినిధులు స్పందిస్తూ, “వాహన యజమానిని సంప్రదించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.
ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యజమాని వినూత్న నిరసనను ప్రశంసిస్తుండగా, మరికొందరు కంపెనీపై విమర్శలు చేస్తున్నారు.
Pune: Frustrated Mahindra Thar Owner Ties Donkeys To SUV, Drags It To Wakad Showroom In Protest pic.twitter.com/3s2LizjBhF
— Pune First (@Pune_First) November 13, 2025


