ముంబై: మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల మేరకు.. మహారాష్ట్రలో పుణె మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో 28 సంస్థలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. స్థానిక గ్యాంగ్‌స్టర్, మనవడి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బందు అందేకర్ శనివారం నామినేషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఎరవాడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడు భారీ పోలీసు భద్రత నడుమ ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నాడు. పోలీసు వ్యాన్‌లో వచ్చిన బందు అందేకర్ చేతులకు తాళ్లు కట్టి ఉండగా, ముఖానికి నల్లటి గుడ్డ కప్పి ఉండటం గమనార్హం.
Notorious Andekar Gang Leader Bandu Andekar was brought from Yerwada Jail under police escort to Bhawani Peth Regional Office to file his application for the Municipal Corporation elections in Dec 27. Express Video By Pavan Khengre. pic.twitter.com/o7gyBWnFG4
— Express Pune Resident Editor (@ExpressPune) December 27, 2025
అనంతరం, భవానీ పేటలోని నామినేషన్ కేంద్రానికి తీసుకురాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో నామినేషన్ దాఖలు చేసి మళ్లీ జైలుకు వెళ్లిపోయాడు. కాగా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందేకర్‌కు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. అందేకర్ మాత్రమే కాకుండా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న అతడి సోదరుడి భార్య లక్ష్మి అందేకర్, కోడలు సోనాలి అందేకర్ కూడా కోర్టు అనుమతితో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా.. మాజీ కార్పొరేటర్, బందు అందేకర్ కుమారుడు వనరాజ్ అందేకర్ గతంలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే మనవడు ఆయుష్ కోమ్కర్‌ను సెప్టెంబర్ 5న కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ హత్య వెనుక అందేకర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో అందేకర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇక, అందేకర్ నామినేషన్‌కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
आंदेकर कुटुंब निवडणुकीच्या रिंगणात, फॉर्म भरताना काय घडलं? #Pune #Andekar #Crime pic.twitter.com/2CVYyxrlma
— Mumbai Tak (@mumbaitak) December 27, 2025


