కౌన్సిలర్ అయినా పండ్లమ్ముతున్న భాగ్యశ్రీ!
పుణె జిల్లాలోని అందమైన హిల్ స్టేషన్ లోనావాలా.. పర్యాటకులకు స్వర్గధామం. కానీ ఇప్పుడా ప్రాంతం ఒక సామాన్య మహిళ పోరాటానికి, నిరాడంబరతకు చిరునామాగా మారింది. ముంబైకి కూతవేటు దూరంలోని ఈ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగ్యశ్రీ జగ్తాప్ అనే మహిళ సాధించిన విజయం.. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
విజయం వరించినా.. వేరు మరువలేదు
సాధారణంగా ఎన్నికల్లో గెలవగానే నాయకులు పూలమాలలు, ఊరేగింపులు, బాణసంచా హడావిడిలో మునిగిపోతారు. కానీ భాగ్యశ్రీ స్టైలే వేరు.. ఆదివారం ఫలితాలు వచ్చాయి.. భారీ మెజారిటీతో ఆమె గెలిచారు. సోమవారం ఉదయాన్నే అందరూ ఆమె ఇంటికి అభినందనలు తెలపడానికి వద్దామనుకుంటే.. ఆమె మాత్రం ఎప్పటిలాగే రోడ్డు పక్కన తన పండ్ల దుకాణం దగ్గర ప్రత్యక్షమైంది. కౌన్సిలర్ హోదాను ప్రదర్శించడం కంటే, తన కుటుంబాన్ని పోషిస్తున్న పండ్ల గంపే ఆమెకు దైవంగా కనిపించింది. ‘గెలిచాం కదా అని వ్యాపారాన్ని వదిలేస్తామా?.. మా కుటుంబానికి జీవనాధారం ఇదే’.. అంటూ ఆమె పండ్లను సర్దుతున్న తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
హేమాహేమీలను ఓడించి..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన భాగ్యశ్రీ, తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యరి్థని ఏకంగా 608 ఓట్ల తేడాతో ఓడించింది. పౌర సమస్యలపై ఆమెకున్న అవగాహన, సామాన్యులతో అనుబంధమే.. ఈ భారీ విజయానికి కారణమని లోనావాలా వాసులు స్పష్టం చేస్తున్నారు.
దేని పని దానిదే..
పదవి గురించి భాగ్యశ్రీ మాటల్లో ఎక్కడా గర్వం కనిపించదు. ‘పండ్లమ్మడం మా వంశపారంపర్య వ్యాపారం. కౌన్సిలర్‌గా ప్రజల సమస్యలపై పోరాడతాను, వారి బాధలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాను. అదే సమయంలో నా పండ్ల దుకాణాన్ని కూడా నడుపుతాను. ఈ వ్యాపారమే నాకు గుర్తింపునిచి్చంది’.. అని ఆమె స్పష్టం చేసింది. భర్త మహదేవ్ జగ్తాప్ కూడా ఆమె నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఆమె ప్రజా సేవలో నిమగ్నమైతే, తాను వ్యాపార బాధ్యతలు చూసుకుంటానని సగర్వంగా చెబుతోంది.
శభాష్ భాగ్యశ్రీ
రాజకీయాల్లో విజయం సాధించాక నేలమీద నడవని నేతలున్న కాలంలో.. నిరాడంబరతే ఆభరణంగా భాగ్యశ్రీ సాగిపోతోంది. తన కష్టాన్ని, వృత్తిని నమ్ముకున్న ఈ ’పండ్లమ్మే కౌన్సిలర్’ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ హీరోగా నిలిచింది. గెలిచాక వాగ్దానాల ‘గంప’దించేసే నాయకుల మధ్య.. గెలిచినా గంపను నమ్ముకున్న ఈ ’భాగ్యశ్రీ’ నిజంగా అభినందనీయురాలు.
– సాక్షి, నేషనల్ డెస్క్


