ఫరీదాబాద్‌లో గ్యాంగ్‌రేప్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి
ఫరీదాబాద్: హరియాణాలో చోటుచేసుకున్న నిర్భయ తరహా సామూహిక అత్యాచారం ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఫరీదాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున లిఫ్ట్ ఇస్తామని చెప్పి వ్యానులో ఎక్కించుకున్న ఇద్దరు డ్రైవర్లు పాతికేళ్ల యువతిని గ్యాంగ్‌రేప్ చేసి రోడ్డు మీద పడేసిన విషయంతెల్సిందే. రోడ్డు మీద పడేయడానికి ముందు ఆమెను వీలైతే ఆమెను చంపేసేందుకు ప్రయత్నించారని, చంపేస్తామని బాధితురాలిని బెదిరించారన్న కొత్త విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
వివరాలను బాధితురాలి సోదరి గురువారం మీడియాకు వెల్లడించారు. ‘‘ అమ్మతో గొడవయ్యాక మా సోదరి.. స్నేహితురాలి ఇంటికెళ్లింది. తిరిగొచ్చేటప్పుడు ఆటో దొరక్క తప్పని పరిస్థితుల్లో వీళ్ల వ్యాన్ ఎక్కింది. మేముండే కళ్యాణ్‌పురిలో దిగబెట్టకుండా గురుగ్రామ్ వెళ్లే రోడ్డులో మూడు గంటలపాటు తిప్పుతూ వ్యాన్‌లో దారుణంగా రేప్‌చేశారు. ఫరీదాబాద్–గురుగ్రామ్ రోడ్డులో హనుమాన్ టెంపుల్ దాటిన తర్వాత వేరే రోడ్డులో పోనిచ్చి ఒకతను పూర్తిగా డ్రైవింగ్ చేయగా మరొకడు రేప్ చేశాడు. ఈ సందర్భంగా చంపేస్తామని బెదిరించారు.
మూడింటప్పుడు వేగంగా దూసుకెళ్తున్న వ్యాను నుంచి రోడ్డు మీదకు విసిరేశాక 3.30 గంటలప్పుడు నిద్రిస్తున్న నాకు సోదరి నుంచి ఫోన్ వచ్చింది. అటు నుంచి నిశ్శబ్దం. తర్వాత ఫోన్‌కాల్ కట్ అయింది. వెంటనే తిరిగి ఫోన్ చేశా. వాళ్లతో పోరాడి అలసిపోయిన గొంతుతో ఏడుస్తూ మాట్లాడింది. మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి. వెంటనే జాడ పట్టుకుని మా కుటుంబం మొత్తం అక్కడికెళ్లి వెతకడం మొదలెట్టాం. ఎట్టకేలకు ఆమె జాడ కన్పించింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాం. ఆమె అప్పుడు స్పృహలో లేదు. దీంతో డాక్టర్లు ఢిల్లీకి తీసుకెళ్లండని సలహా ఇచ్చారు.
సమయంలేక వేరే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాం’’ అని సోదరి ఏడుస్తూ చెప్పారు. ఆమె కాస్తంత స్పృహలో ఉన్నప్పుడే పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, నిందితుల్లో ఒకరిది మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణంకాగా, మరొకరిది ఉత్తర ప్రదేశ్‌లోని మథుర పట్టణం. హరియాణా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రావ్ నరేంద్ర సింగ్ గురువారం ఫరీదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలిని కలిశారు. ఆమెను పరామర్శించారు. ‘‘ ఆమె స్పృహలో లేదు. మాట్లాడే స్థితిలో లేదు. ముఖానికి తీవ్రమైన గాయాలయ్యాయి. హరియాణాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని
ఆరోపించారు.


