ఉపన్యాసాలు చాలు... ఏసీ గదులు వదిలి రోడ్డెక్కండి..
పెద్దల చుట్టూ ప్రదక్షిణలు వద్దు.. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం
గ్రూపు రాజకీయాలకు చెక్.. జిల్లా అధ్యక్షులే ఇక నా సేనాపతులు
ఓటరు జాబితాల నుంచి వ్యవస్థల వరకు అన్నీ బీజేపీ గుప్పిట్లోనే!
ప్రతి బూత్‌లో నిఘా పెట్టండి.. క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండండి
కురుక్షేత్ర వేదికగా కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజకీయమంటే మైకుల ముందు ఉపన్యాసాలు దంచడం కాదు.. ఓటరు జాబితాలో అక్రమాలను అడ్డుకోవడం! ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయాలు నడిపే రోజులు పోయాయి.. ఇకపై ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా నిలబడాల్సిందే. బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు.. బూత్ స్థాయి పోరాటమే శరణ్యం’అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
హరియాణాలోని కురుక్షేత్రలో జరిగిన పార్టీ శిక్షణ శిబిరంలో ఆయన 2029 ఎన్నిక లను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలకు తగు హెచ్చరి కలు చేశారు. బీజేపీ అధికార బలంతో వ్యవస్థలను హైజాక్ చేస్తోందంటూ ఆయన.. ‘కాంగ్రెస్ నాయకులు ఇకపై యుద్ధం చేయాల్సింది వేదికలపై కాదు, ఓటరు జాబితాలపై’అని స్పష్టం చేశారు.
అసలు కథ బూత్‌లోనే ఉంది..
బీజేపీ గెలుపు గురించి రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, ‘వాళ్లు కేవలం ప్రచారంతో గెలవడం లేదు. అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఓటరు లిస్టుల ను ట్యాంపర్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారు. అందుకే మన నిఘా బూత్ స్థాయి నుంచే మొదలుకావాలి. ప్రతీ గల్లీలో పహారా కాయాలి. నిరుద్యోగం, రైతు సమస్యలు, ధరల పెరు గుదల వంటి అంశాలను ఆయుధాలుగా మలుచు కుని జనంలోకి వెళ్లాలి’అని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనా తీరుపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.
ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కేవలం ప్రచారం, ఈవెంట్ల మయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ‘ప్రకటనలు, ఆర్భాటాలతో ప్రజాస్వా మ్యం బతకదు. బీజేపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటోంది. ఓటరు జాబితా నుంచి ఈవీఎంల నిర్వహణ వరకు ప్రతి చోటా వారి కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. హరియా ణాలో ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలు ఇకపై ప్రతి గల్లీలో, ప్రతి బూత్‌లో కాపలాదారులుగా మారాలి. కేవలం ఓట్లు అడగడమే కాదు.. మన ఓట్లను కాపాడుకోవడం కూడా యుద్ధంలో భాగమే’అని రాహుల్ ఉద్బోధించారు.
నేనే రాజు అనుకుంటే కుదరదు..
సొంత పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, పైరవీ రాజకీయాలపై రాహుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వేదికపై ఉన్న సీనియర్ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. ‘కొందరు నేతలు తమను తాము పార్టీ కంటే గొప్పవారని, తాము లేకపోతే పార్టీయే లేదని భ్రమపడుతున్నారు. అలాంటి వారి వెనుక తిరగడం, వారి కోటరీలలో చేరడం జిల్లా అధ్యక్షులు మానుకోవాలి.
టికెట్ల కోసం ఢిల్లీలో సిఫార్సులు, పెద్దల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి కాలం చెల్లింది. గ్రూపు రాజకీయాలను నేను సహించను. ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉంటారో వారికే భవిష్యత్తు ఉంటుంది. మీరే క్షేత్రస్థాయిలో సేనాపతులు. ఎవరి బెదిరింపులకు లొంగకండి. కష్టపడి పనిచేసే వారికే టికెట్ దక్కుతుంది తప్ప.. సిఫార్సులతో వచ్చే వారికి కాదు,’అని రాహుల్ తేల్చి చెప్పారు.
బీజేపీకి చెక్ పెట్టాల్సిందే
సంస్థాగతంగా ఎంతో పటిష్టంగా ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు డేటా మేనేజ్‌మెంట్, బూత్ స్థాయి కమిటీలే కీలకమని రాహుల్ స్పష్టం చేశారు. ప్రచార ఆర్భాటాల కంటే, క్షేత్రస్థాయి నిఘానే 2029లో కాంగ్రెస్‌ను గెలిపిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సంస్థాగతంగా ఎంతో పటిష్టంగా ఉన్న బీజేపీ యంత్రాంగాన్ని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ కూడా సాంకేతికతను, డేటాను నమ్ముకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. బూత్ మేనేజ్‌మెంట్‌లో డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించుకోవాలని, ఇది బీజేపీ సంస్థాగత బలానికి గట్టి పోటీ ఇస్తుందని ఆయన సూచించారు.


